Warangal
- రైతుల పాలిట శాపంగా మారిన ధరణి
- కలిసికట్టుగా పనిచేద్దాం కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం
- ములుగు ఎమ్మెల్యే సీతక్క
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతుల పాలిటి శాపంగా మారిన ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క హామీ ఇచ్చారు.
ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులుగా నియామకమైన పైడాకుల అశోక్ ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు.
జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంచర్ల MR గార్డెన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గజ మాలతో సన్మనించారు. ములుగు పట్టణం మూడు రంగులమయమైంది
అనంతరం జరిగిన సమావేశంలో సీతక్క మాట్లాడుతూ గులాబి పార్టీ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్‌తో రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ను గెలిపిద్దాం..
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేద్దాం కాంగ్రెస్ జెండాను గెలిపిద్దామని సీతక్క పిలుపునిచ్చారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగిస్తూ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోరారు.
ఎన్నికలవేళ గృహలక్ష్మి
ఎన్నికల దగ్గర పడుతుండటంతో ముఖ్య మంత్రి కెసిఆర్ ఇప్పుడు గృహ లక్ష్మి పథకం, పోడు భూములకు పట్టాలు గుర్తుకు వచ్చాయని విమర్శించారు. గడిచిన తొమ్మిదిన్నర యేండ్ల లో ఏ ఒక్క హామీ నెరవేర్చని ముఖ్య మంత్రిని ఎవరు నమ్మే పరిస్థితులు లేవని కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో బిజెపి, బిఆర్ ఎస్ ప్రభుత్వాలకు ఊపిరి ఆడడం లేదని అన్నారు.
కాంగ్రెస్ వస్తేనే సమస్యలకు పరిష్కారం
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని సీతక్క కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుల పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్ రద్దు చేస్తాం. రైతు పండించిన ప్రతి పంటను మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం. మహిళకు 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. పోడు భూములకు పట్టాలు ఇస్తామని ఆమె హామీ ఇచ్చారు.
నిరుద్యోగ భృతి 3016 ఇచ్చి, ఖాళీగా ఉన్న 2లక్షల పోస్టులను భర్తీ చేస్తామని ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయిలు ఇస్తామని చెప్పారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కలిసికట్టుగా పని చేయాలని, రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామని సీతక్క అన్నారు.
కార్యక్రమంలో డాక్టర్ అనీల్‌తో పాటు బ్లాక్, మండల అధ్యక్షులు, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల జిల్లా మండల గ్రామ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీ, సహకార సంఘం చైర్మన్ లు, వైస్ చైర్మన్ లు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.