HomelatestWarangal | పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చుట్టూ రాజకీయం.. మృతిపై భిన్న వాదనలు

Warangal | పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య చుట్టూ రాజకీయం.. మృతిపై భిన్న వాదనలు

Warangal

  • ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని చెబుతున్న విపక్షాలు సహ ఉద్యోగులు
  • కాదంటున్న స్థానిక ఎమ్మెల్యే పెద్ది
  • ఆర్థిక కారణాలే కారణం అంటున్న బంధువులు
  • భర్త వేధింపులే కారణం అంటున్న తల్లిదండ్రులు, పోలీసులు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రంగాపురం గ్రామ జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న బైరు సోని ఆత్మహత్య చుట్టూ రాజకీయం సాగుతోంది. తమ సమస్యల ప‌రిష్కారానికి, ముఖ్యంగా తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.

సమ్మె చేస్తున్న ఉద్యోగులపై వేటు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైన తరుణంలో పంచాయతీ కార్యదర్శి సోనీ కూడా భయాందోళనకు గురై రెండు రోజుల క్రితం ఉద్యోగంలో చేరింది. శుక్రవారం కూడా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించింది. ఏమైందో ఏమో కానీ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా నర్సంపేట లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

ప్రభుత్వ తీరు వల్లే మృతి

సోనీ మృతి సంఘటనపై సహచర ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ శుక్రవారం రాత్రి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని తరలించకుండా రాత్రి రెండు గంటల పాటు అడ్డుకున్నారు. పోలీసులు కుటుంబ సభ్యులతో జరిపిన చర్చల అనంతరం వారు అంగీకరించడంతో సమస్య సద్దుమణిగింది. ఇదిలా ఉండగా సోనీ ఇంటి నిర్మాణం కోసం రూపాయలు 10 లక్షలు అప్పు తీసుకుందని సమ్మెలో పాల్గొంటే ఉద్యోగం పోతే అప్పు ఎలా తీర్చాలని ఆందోళనతో ఆత్మహత్య చేసుకుందని ఆమె సమీప బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.

సోనీ మృతి పై భిన్న వాదనలు

సోనీ ఆత్మహత్యపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కుటుంబ కలహాలు, భర్త వేధింపులే కారణమంటూ ఇప్పటికే సోని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని అక్కడి పోలీస్ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.

పరామర్శించిన బీజేపీ నాయకులు

జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోని మృతదేహానికి పూలమాలలు వేసి బీజేపీ నాయకులు నివాళులర్పించారు. ఉద్యోగ భద్రత కోసం ఉద్యమిస్తూ అసువులు బాశారని పేర్కొన్నారు. కుటుంబాన్ని బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీధర్, రాష్ట్ర నాయకులు రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎడ్ల అశోక్ రెడ్డి, గటిక అజయ్ పరామర్శించారు.

ప్రభుత్వాన్ని తప్పు పట్టడం సరైనది కాదు

నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతురాలిని హాస్పిటల్లో శుక్రవారం పరామర్శించి కుటుంబాన్ని ఓదార్చారు. ఇదిలా ఉండగా విపక్షాలు, రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు సోనీ మృతిని తమకు అనుకూలంగా వినియోగించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వం పై అపవాదు మోపేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కొన్నిప్రతిపక్ష రాజకీయ పార్టీలు సోని మరణాన్ని అడ్డం పెట్టుకొని కావాలనే ప్రభుత్వాన్ని తప్పుపట్టాలని చూస్తున్నాయ‌న్నారు. మరణానికి ఆమె భర్తే కారణమని బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

సోని భర్తపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. బాధితురాలికి ఒక చిన్న పాప ఉంది. ఆ పాప ఉన్నతమైన చదువుకు సంబంధించి పూర్తి బాధ్యత జిల్లా కలెక్టర్ తీసుకున్నారని ఎమ్మెల్యే వివరించారు. కుటుంబంలో ఒకరికి అవుట్ సోర్సింగ్ పద్దతిలో ఉపాధి అవకాశాన్ని కూడా కల్పించనున్నట్లు కలెక్టర్ హామీ ఇచ్చారు. త్వరలో ఈ హామీ అమలు పూర్తయ్యే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది తెలియచేశారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular