HomelatestWarangal | చట్టసభల్లో కమ్యూనిస్టులు ప్రశ్నించే గొంతుకలు: చాడ

Warangal | చట్టసభల్లో కమ్యూనిస్టులు ప్రశ్నించే గొంతుకలు: చాడ

Warangal

  • కోటీశ్వరుల కొమ్ముకాచే ప్రభుత్వం బిజెపిది
  • శ్రమకు తగ్గ ఫలితానికి పోరాటాలే శరణ్యం
  • సిపిఐ జాతీయ కార్య వర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల మధ్య ఉండి ప్రజలను చైతన్యం చేస్తూ ప్రశ్నించే గొంతుకగా చట్టసభల్లో కమ్యూనిస్టులను పంపితే ప్రశ్నించే గొంతుకలు అవుతారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, బీమదేవరపల్లి మండలాల సిపిఐ సమితి సమావేశం ఎల్కతుర్తిలో ఉట్కూరి రాములు అధ‌క్షతన జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చాడా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ దేశ, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కమ్యూనిస్టులు ముందుంటారని, ప్రజలు కమ్యూనిస్టులను ఆదరించాలని కోరారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలో బ్యాంకింగ్, ఎల్ఐసి, రవాణా తదితర రంగాలను జాతీయీకరణ చేసేందుకు కమ్యూనిస్టులు నిరంతరం ఉద్యమాలు చేశారని, కానీ నేడు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం గుజరాత్ పెట్టుబడుదారులు కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ధ్వంసం చేస్తూ అప్పనంగా కట్ట పెడుతున్నదని అన్నారు.

మోడీ ప్రజల సంక్షేమం మరిచి కార్పొరేట్ వ్యక్తులకు కొమ్ముకాస్తున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ధరలు పెరుగుతున్నాయని, వంద రోజులలో నిత్యావసర ధరలు అదుపులోకి తీసుకొచ్చి సామాన్యునికి సైతం అందుబాటులోకి తీసుకు వస్తామని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలని హామీ ఇచ్చి తొమ్మిది సంవత్సరాలైనా వాటి అమల్లో మోడీ పూర్తిగా వైఫల్యం చెందారని అన్నారు.

పెద్ద నోట్ల మార్పిడి, జిఎస్టితో పన్నులను పెంచి సామాన్యుని పై కూడా భారం వేశారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు సిపిఐ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, బిజెపి హఠావో దేశ్ కి బచావో అనే నినాదాన్ని దేశవ్యాప్తంగా ప్రజల వద్దకు తీసుకుపోతామని అన్నారు.

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కెసిఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలైన పేదల ఇళ్ల స్థలాలు, పక్కా ఇళ్లు నిర్మించడంలో వైఫల్యం చెందడంతో ప్రజలు ఆవేదనతో ఉన్నారని తెలిపారు. పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, గుడిసె వాసులందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈనెల 15న సిపిఐ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో బహిరంగ సభను జయప్రదం చేయుటకు వేలాదిమంది తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, సిపిఐ రాష్ట్ర, జిల్లా నాయకులు ఆదరి శ్రీనివాస్, కర లక్ష్మణ్, మర్రి శ్రీనివాస్, కె. వెంకటరమణ, రాజ్ కుమార్, మంచాల రమాదేవి, బాషబోయిన సంతోష్, తిరుపతి, కంచర్ల సదానందం, నిమ్మల మనోహర్, తండ మొండయ్య, రాజనర్సు, భాస్కర్ రెడ్డి, తిరుమల, స్వప్న, లలిత, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular