HomelatestWarangal | జఠిలమ‌వుతున్న‌ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె

Warangal | జఠిలమ‌వుతున్న‌ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె

Warangal

  • సర్కారు అల్టిమేటం బేఖాతర్
  • కుంటుపడిన గ్రామస్థాయి పాలన
  • ప్రభుత్వం చర్చలకు పిలువలేదు
  • నిబంధనలు, ఒప్పందాలకు విరుద్ధంగా సమ్మె
  • సమ్మె విరమించాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గత 15 రోజులుగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మె రోజు రోజుకు జఠిలమవుతుంది. క్షేత్రస్థాయిలో అన్ని పనులను దగ్గరుండి పర్యవేక్షించి చేయాల్సిన ఉద్యోగులు సమ్మె చేయడంతో సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయాయి. ఒక విధంగా గ్రామస్థాయి పాలన కుంటుపడింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడం గమనార్హం.

మరోవైపు ఉద్యోగుల సమ్మెకు వివిధ వర్గాల నుంచి సంఘీభావంతో పాటు సానుభూతి పెరుగుతోంది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నుంచి మద్దతు లభించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. సమ్మె చేస్తున్న కార్యదర్శులకు కాంగ్రెస్ నేతలు సంఘీభావం తెలియజేస్తున్నారు.

ఈ స్థితిలో తాము ఉద్యోగులను చర్చలకు పిలువ లేదంటూ మంత్రి ఎర్రబెల్లి తాజాగా గురువారం స్పందించడం ప్రభుత్వ వైఖరిని తేటతెల్లం చేస్తుంది. పుండు మీద కారం చల్లిన విధంగా ప్రభుత్వ తీరు ఉందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

సర్కారు అల్టిమేటం బేఖాతర్

ప్రభుత్వం ఇప్పటికే సమ్మె చేస్తున్న ఉద్యోగులకు అల్టిమేట్ జారీ చేయగా దాన్ని బేఖాతర్ చేస్తూ సమ్మెను మెజారిటీ ఉద్యోగులు కొనసాగిస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు అంగీకరించేంతవరకు శాంతియుత సమ్మెను కొనసాగిస్తామని, తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదంటూ పదేపదే స్పష్టం చేస్తున్నారు.

స్పందన లేని సర్కారు

అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ముఖ్యంగా ముఖ్యమంత్రి, మంత్రి ఎర్రబెల్లి నుంచి కనీస సానుకూల స్పందన రాకపోగా, హెచ్చరికలు, బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. ఈ స్థితిలో అటు పంచాయతీ కార్యదర్శులు ఇటు ప్రభుత్వం మధ్య చర్చలు జరిగి సమస్యను ఒక కొలిక్కి తీసుకురావాల్సి ఉండగా ప్రభుత్వం ప్రతిష్టకు పోవడంతో సమస్య కు పీఠముడి పడుతుంది.

ఆసక్తికరంగా మారిన మంత్రి ప్రకటన

సమ్మె చేయడమే ప్రభుత్వాన్ని ధిక్కరించడంగా భావించడంతో సమస్య పరిష్కారం ఇబ్బంది కరంగా మారుతుంది. ఈ స్థితిలో ఉద్యోగులతో సంబంధిత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోన్లో మాట్లాడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇదిలా ఉండగా ఫోన్లో మాట్లాడిన నేపథ్యంలో చర్చలకు ప్రభుత్వం ఆహ్వానించినట్లు ప్రచారం సాగుతుందని, ఇది తప్పంటూ మంత్రి స్పందించడం చర్చనీయాంశంగా మారింది.

సమస్య పరిష్కారానికి చర్చలు దోహదం చేయాల్సి ఉండగా, సమ్మె విరమించి విధుల్లో చేరితే సమస్య పరిష్కారం గురించి ఆలోచిస్తామంటూ ప్రభుత్వం చెప్పడం కొసమెరుపు. దీనికి భిన్నంగా గతంలో తాము ప్రభుత్వానికి ఇచ్చిన హామీ మేరకు నాలుగు సంవత్సరాలు విధులు నిర్వహించామని, ఇప్పటికైనా తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విన్నవిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరిస్తేనే సమ్మె విరమిస్తామంటూ ఇప్పటికే అల్టిమేటం గడువు దాటినా సమ్మెను కొనసాగిస్తూ తమ విధానాన్ని స్పష్టం చేస్తున్నారు.

సర్కారు చర్చలకు పిలువలేదు: మంత్రి ఎర్రబెల్లి

ప్రభుత్వం తరపున నేను గానీ, మరెవ్వరు గానీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను చర్చలకు పిలవలేదు. చర్చలకు పిలిచింది అని జరుగుతున్న ప్రచారం అబద్ధం. ఈ ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మ వద్దు. ఇప్పటికైనా సమ్మె విరమిస్తే బాగుంటుందంటూ మంత్రి ఎర్రబెల్లి గురువారం విడుదల చేసిన ప్రకటనలో హితవు పలికారు. ప్రకటన వివరాలిలా ఉన్నాయి.

సీఎం కేసీఆర్ మనసున్న మహారాజు. కార్యదర్శులపై మంచి అభిప్రాయం ఉంది. ఆ పేరును చెడ గొట్టుకోవద్దు. ప్రభుత్వాన్ని శాసించాలని సాహసించడం, నియంత్రించాలని అనుకోవడం తప్పంటూ మంత్రి సున్నితంగా హెచ్చరించారు.

సమ్మె నిబంధనలకు, చట్ట విరుద్ధం. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి కూడా విరుద్ధం. సంఘాలు కట్టబోమని, యూనియన్లలో చెరబోమని, సమ్మెలు చేయబోమని, ఎలాంటి డిమాండ్లకు దిగబోమని మీరు ప్రభుత్వానికి బాండ్ రాసి ఇచ్చారు. మీరు రాసిచ్చిన ఒప్పందాలను మీరే ఉల్లంఘిస్తున్న తీరు బాగా లేదు. పైగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని వెంటనే నిలిపివేయాలి.

ఫోన్లో సమస్యలు చెప్పారు

ఫోన్ ద్వారా నాకు సమస్యలు చెప్పుకున్నారని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. సమ్మె విరమించాలని నేను సూచించాను. కానీ, ప్రభుత్వం చర్చలకు పిలిచింది అని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ఎవరూ నమ్మవద్దు.

ఇప్పటికైనా మించిపోలేదు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వెంటనే సమ్మె ను విర‌మించాలి. విధుల్లో చేరాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు హితవుతో కూడిన హెచ్చరిక లాంటి సూచనలో విజ్ఞప్తి చేశారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular