- చమురు ఎగుమతులు, భారీ షిప్పుల తయారీలో తోడ్పాటుకు రష్యా హామీ
విధాత: సంక్లిష్ట, సంక్షోభ సమయంలో అండగా నిలిచినందుకు భారత్‌కు రష్యా పెద్ద గిఫ్ట్‌ను ప్రకటించింది. రవాణా షిప్పుల నిర్మాణంలో తోడ్పాటు నందించటంతో పాటు, దిగుమతి చేసుకొనే చమురును తక్కువ ధరకే సరఫరా చేసేందుకు ముందుకు వచ్చింది. ఇదంతా రష్యాకు ఆపద సమయంలో భారత్ అండగా నిలిచినందుకేనని ప్రకటించటం గమనార్హం.
ఉక్రెయిన్- రష్యా మధ్య ఉద్రిక్తతలు 2014నుంచి ఉన్నా పూర్తి స్థాయి మిలిటరీ రష్యా దాడి 2022 ఫిబ్రవరి 24 నుంచి మొదలైంది. నాటో కూటమిలో ఉక్రెయిన్ చేరుతానన్నందుకు రష్యా ఈ దాడికి పాల్పడింది. రష్యా దాడిని పశ్చిమ దేశాలన్నీ తీవ్రంగా ఖండించాయి.
అమెరికా, ఇంగ్లండ్ లాంటి దేశాలు రష్యాను వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేశాయి. రష్యా దాడికి ప్రతిగా.. రష్యా ఎగుమతులపై నాటో దేశాలు నిషేధం విధించాయి. రష్యా ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసేందుకు చమురు ఎగుమతులపై జీ-7 దేశాలు ఆంక్షలు విధించాయి. ప్రపంచ దేశాలేవీ రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోరాదని హెచ్చరించాయి.
కానీ రష్యాతో భారత్‌కు ఉన్న వర్తక వాణిజ్య సంబంధ బాంధవ్యాల నేపథ్యంలో జీ-7 దేశాల ఆంక్షలను భారత్ అంగీకరించలేదు. తమ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకొంటామని భారత్ స్పష్టం చేసింది.
భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని రష్యా స్వాగతించింది. ఈ నేపథ్యంలో రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ రష్యాలోని భారత రాయబారి పవన్ కపూర్‌ను కలిసి భారత్‌కు అన్ని విధాలా తోడ్పాటునందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా తోడ్పాటుతో అటు వర్తక వాణిజ్య రంగాలతో పాటు, షిప్పుల తయారీలో కూడా భారత్ ఎంతో పురోగతి సాధించనున్నది అనటంలో సందేహం లేదు.