Wedding With Lord Krishna | చిన్ననాటి నుంచి ఆరాధించిన దైవం భగవాన్ శ్రీకృష్ణుడినే ఓ యువతి మనువాడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్య జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. రిటైర్డ్ ఉపాధ్యాయుడు రంజిత్ సొలంకి కుమార్తె రక్ష (30) పోస్ట్‌గ్రాడ్యుయేట్ చేసి ఎల్‌ఎల్‌బీ చదువుతున్నది.
చినప్పటి నుంచి రక్ష శ్రీకృష్ణుడిని పూజిస్తూ వస్తున్నది. ఈ క్రమంలోనే తన జీవితాన్ని శ్రీకృష్ణుడికే అంకితం చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు సైతం చెప్పింది. దాంతో ఆమెను కోరికను కాదనలేకపోయారు.
తన కూతురుకి కృష్ణుడిపై ఉన్న అపారమైన భక్తి చూసి.. గత శనివారం పెళ్లి కోసం ఏర్పాట్లు చేశారు. అందంగా అలంకరించిన కల్యాణ మండపంలో వివాహ వేడుకను జరిపించారు. అంతకు ముందు శ్రీకృష్ణుడి విగ్రహంతో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి విగ్రహంతో కల్యాణం జరిపించారు.
పెద్ద సంఖ్యలో అతిథులను ఆహ్వానించి, శ్రీకృష్ణుడికి ఇష్టమైన వంటకాలతో కూడిన భోజనాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అప్పగింత కార్యక్రమాన్ని సైతం నిర్వహించారు. ఆ తర్వాత, వధువు కృష్ణుడి విగ్రహంతో జిల్లాలోని సుఖ్‌చైన్‌పూర్ ప్రాంతంలోని తన బంధువుల ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత ఆమె తన ఒడిలో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పెట్టుకుని తన తల్లి ఇంటికి తిరిగి వచ్చింది. ప్రస్తుతం పెళ్లి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.