- జిల్లాలో పెండింగ్ పనులు పూర్తి చేయాలి
- ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం అవసరం
- జనగామ జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్ణయం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలను ఇంటింటికీ చేర్చాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జనగామ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని విన్నవించింది.
శనివారం జనగామలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా జెడ్పీ సర్వసభ్య సమావేశంలో జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై చర్చ జరిగింది. వృద్దులు, వికలాంగులు, వితంతువులకు అందిస్తున్న పెన్షన్ సక్రమంగా చేరే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఇటీవల కొత్తగా పెన్షన్లు మంజూరు చేసిన లబ్ధిదారులకు చేరుతున్నయా లేదా చెక్ చేయాలని సూచించింది.
గ్రామపంచాయతీలు, మండల కేంద్రాలలో రోడ్లు, భవనాలు నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. రైతుల కోసం రైతుబంధు పథకం, 24 గంటలు ఉచిత కరెంటు ఇతర సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు అవుతున్నాయా లేదా పరిశీలించాలని సూచించారు. సమావేశంలో పాల్గొన్న జనగామ జిల్లా కలెక్టర్ శివ లింగయ్య, అదనపు కలెక్టర్ ప్రాపుల్ దేశాయి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
రానున్నది ఎన్నికల సమయం కానుండడంతో ప్రజల్లో వ్యతిరేకత రాకుండా అన్ని రకాల పథకాలు సక్రమంగా చేరేలా అధికారులు పర్యవేక్షించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ సిఇవో వసంత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెల్లి క్రిష్ణారెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి, జడ్పీటీసీలు, కో-ఆప్షన్ సభ్యులు, ఎంపీపీలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.