September 17 | ఇది ముమ్మాటికీ తెలంగాణ ప్రజలకు విద్రోహ దినమే! ప్రజలు తమ గత చరిత్రను తెలుసుకున్నప్పుడు, వర్తమానంలో ఏం చేయాలో భవిష్యత్తును ఎలా నిర్మించు కోవాలో నిర్ణయించుకుంటారు. కానీ నేడు సెప్టెంబర్ 17, 1948 కేంద్రంగా ప్రజలు ఏ చరిత్రను సృష్టించు కున్నారో, ఏ పోరాటాలను నిర్మించుకొని భవిష్యత్తును కలలుగన్నారో అది ఉన్నది ఉన్నట్టుగా నేడు పాలకులు, పాలకవర్గ పార్టీలు చెప్పడం లేదు. ప్రజల వీరోచిత పోరాటాల చరిత్ర కూడా ప్రచారంలో ఉండాలి. లేదంటే […]

September 17 |
ఇది ముమ్మాటికీ తెలంగాణ ప్రజలకు విద్రోహ దినమే!
ప్రజలు తమ గత చరిత్రను తెలుసుకున్నప్పుడు, వర్తమానంలో ఏం చేయాలో భవిష్యత్తును ఎలా నిర్మించు కోవాలో నిర్ణయించుకుంటారు. కానీ నేడు సెప్టెంబర్ 17, 1948 కేంద్రంగా ప్రజలు ఏ చరిత్రను సృష్టించు కున్నారో, ఏ పోరాటాలను నిర్మించుకొని భవిష్యత్తును కలలుగన్నారో అది ఉన్నది ఉన్నట్టుగా నేడు పాలకులు, పాలకవర్గ పార్టీలు చెప్పడం లేదు. ప్రజల వీరోచిత పోరాటాల చరిత్ర కూడా ప్రచారంలో ఉండాలి. లేదంటే పాలకవర్గాలు చెప్పే తప్పుడు చరిత్రనే చరిత్రగా మిగిలిపోతుంది. అదే నిజమని నమ్మే ప్రమాదం ఉంటుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ 17న తెలంగాణకు ఏం జరిగింది అనే విషయంపై చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.
ఇది ఎన్నికలు జరిగే సంవత్సరం కాబట్టి, ఈ సంవత్సరం మరింత చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ తో పాటు రీజనిస్ట్ పార్టీలు తమ రాజకీయ అవసరాల కోసం ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు. దీనికోసం రకరకాలైన వాదనలతో భారీ బహిరంగ సభలు జరపడానికి సిద్ధం అవుతున్నాయి. కొందరు విలీనం అని, మరికొందరు విమోచనమని, ఇంకొందరు స్వాతంత్రం అని, తమ స్వార్థ రాజకీయ కార్యాచరణను మొదలు పెట్టారు. వారి వారి స్వలాభం కోసం ప్రజల చరిత్రను మభ్య పెట్టే పనిలో ఉన్నాయి. సరిగ్గా ఇక్కడే మనం మన గత చరిత్రను అర్థం చేసుకోవాలి. గతంలో మనం దేనికోసం పోరాడామో, భవిష్యత్తును ఏమి కలలుగన్నాము ఒకసారి మననం చేసుకోవాలి. చరిత్రను సరైన రీతిలో అర్థం చేసుకోవాలి.
అసలు చరిత్రలో సెప్టెంబర్ 17న తెలంగాణకు ఏం జరిగింది?
1948కి ముందు భారతదేశంలో 568 సంస్థానాలు ఉన్నాయి. ఈ అన్ని సంస్థానాల్లో బ్రిటిష్ సామ్రాజ్య వాదుల పాలనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉంది. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ సామ్రాజ్య వాదుల పాలన అంతమైంది. భారతదేశానికి అంతట అధికార మార్పిడి జరిగింది. ఈ 568 సంస్థానాల్లో ఒక 4 తప్ప మిగతావన్నీ యూనియన్ ప్రభుత్వంలో విలీనమయ్యాయి. ఈ నాలుగు సంస్థానాలు నిజాం, జమ్మూకాశ్మీర్, జునాగడ్ త్రిపుర. ఇవి నాటి యూనియన్ ప్రభుత్వంలో విలీనం అవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేయలేదు. కానీ నాటి నెహ్రూ ప్రభుత్వం వీటిని కలుపుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేశాడు.
ఈ నాలుగు సంస్థానాల్లో హైదరాబాద్ సంస్థానాన్ని నైజాం పరిపాలించాడు. నైజాం రాజు తెలంగాణ నాటి ఉమ్మడి 10 జిల్లాలు, మహారాష్ట్ర ఐదు జిల్లాలు (ఔరంగాబాద్, బీడ్, పర్బాని, నాందేడ్ ఉస్మానాబాద్), కర్ణాటకకు చెందిన మూడు జిల్లాలు (గుల్బర్గా, రాయచూర్, బీదర్)తో కలిపి నిజాం సంస్థానం ఉండేది. ఇది బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు నజరానాలు, పన్నులు చెల్లిస్తూ తమ తాబేదారులుగా కొనసాగుతూ వస్తుంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదం భారతదేశంలో మీద సంస్థానాలపై దాడి చేస్తున్న క్రమంలో ఇక్కడ ఉన్న సైన్యాన్ని సైతం వాళ్లకు మద్దతుగా పంపించి బ్రిటిష్ వాళ్ళ ఆక్రమణకు తోడ్పడ్డాడు.
మైసూర్ రాజ్యం మీద దురాక్రమణ జరిగినప్పుడు నైజాం నవాబు బ్రిటిష్ కు మద్దతుగా నిలిచాడు. నైజాం రాజ్యం సంస్థానంగా ఉన్నా, అది అస్వతంత్రంగానే కొనసాగుతూ వచ్చింది. నైజాం పాలనలో హైదరాబాద్ సంస్థాన ప్రజలు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్నారు. నైజాం రాజు తెలంగాణ ప్రజలతో వెట్టిచాకిరి చేయించుకోవడం, అధిక పనులను గుంజడం, హత్యలు, అత్యాచారాలు చేయడం, స్త్రీలను నగ్నంగా బతుకమ్మ ఆడించడం చేశాడు. శారీరకంగా, మానసికంగా, భౌతికంగా దాడుల గురి చేయడం నిత్యం జరుగుతూ ఉండేవి. ప్రజలతో వెట్టి చాకిరి, బానిసత్వం చేయించుకునే వాడు.
ప్రజల మీద వీటిని అమలు చేయడానికి నైజాం రాజు తన సంస్థానం అంతట జాగిర్దారులను, జమీందారు లను, భూస్వాములను, దేశముకులను, దొరలను తమ తాబేదారులుగా నియమించుకున్నాడు. నైజాం నవాబు రజాకారులతో ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పరచుకొని ప్రజలపై నిత్యం దాడులు చేస్తుండేవాడు. వీరు హిందూ, ముస్లింతోపాటు అన్ని మతాలలోని ఉన్నత వర్గాలకి, దోపిడీ వర్గాలకు రక్షణ కవచంగా అన్ని మతాలలోని పేద ప్రజలను హింసించే వారిగా దోపిడీ చేసేవారిగా ఉండేవారు. వీరి దోపిడీకి వ్యతిరేకంగా ఉన్న వారిని, ఊర్లను రాత్రికి రాత్రి తగలబెట్టడం ప్రజల ధన, మాన, ప్రాణాలను దోచేయడం నిత్యం జరుగుతూ ఉండేది.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంగా ఆవిర్భావం
రజాకార్లకు వ్యతిరేకంగా ప్రజలు ప్రారంభంలో ఆంధ్ర జన సంఘం పేరిట పోరాడారు. అది 1930 నాటికి వచ్చేసరికి ఆంధ్ర మహాసభ పేరుతో ఉద్యమించారు. ఈ ఆంధ్ర మహాసభనే తర్వాత కాలంలో కమ్యూనిస్టు పార్టీగా అవతరించింది. వెట్టి చాకిరి, అధిక శిస్తూ వసూళ్లకు వ్యతిరేకంగా దున్నేవాడిదే భూమి నినాదంగా ఆంధ్ర మహాసభ పని చేసింది. అది 1946కు వచ్చేనాటికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంగా ఉద్భవించింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ప్రపంచ చరిత్రలోనే గొప్ప ప్రాముఖ్యత ఉంది.
భూమి తల్లి ఒడిలో తమ చెమటను చిందించి పసిడి సిరులను పండించే మట్టి మనుషుల చేత బంధుకు పట్టించి దొరల, భూస్వాములపై యుద్ధాన్ని నడిపించింది. ప్రపంచంలో ఈ పోరాటానికి పెద్దఎత్తున మద్దతు వచ్చింది. ఈ పోరాటంలో వేలాది మంది యోధులు తమ జీవితాలను అర్పించారు. షేక్ బంధగి, దొడ్డి కొమరయ్య, షోయబుల్లాఖాన్ లాంటి అందరి వీరులు నాటి పోరాటంలో తమ ప్రాణాలను అర్పించారు. విసునూరు రామచంద్రారెడ్డి ఆగడాలకు వ్యతిరేకంగా చాకలి అయిలమ్మ నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం జరిగింది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాలో మొదలైన ఈ పోరాటం మొత్తం నైజాం రాజ్యం అంతట విస్తరించింది. ఈ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూములను ప్రజలు సొంతం చేసుకున్నారు. 3000 గ్రామాల్లో ప్రజారాజ్యాలను నైజాం అధికారానికి ధీటుగా నెలకొల్పుకున్నారు. దొరలు, భూస్వాములు జాగిర్దారుల చేతుల ఉన్న భూమి అంతా నాటి కమ్యూనిస్టు పార్టీ గ్రామ సభలు నిర్వహించి భూమిలేని ప్రజలకు ప్రజాస్వామిక పద్ధతిలో పంచి పెట్టింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఫలితంగా నైజాం రాజు తన పాలన కొనసాగించ లేకపోయాడు. పోరాట ఫలితంగా నైజాం రాజు అన్ని రకాలుగా బలహీనమై పోయాడు.
ఈ పోరాటం దేశవ్యాప్తంగా అంటుకొని ఎక్కడ ప్రజలు భూస్వాములు మీద తిరగబడతారని ఆలోచించిన నాటి ప్రభుత్వం "ఆపరేషన్ పోలో" పేరుతో నిజాం నవాబు సహకారంతో దండయాత్ర చేసింది. వాస్తవానికి నిజాం నవాబు అప్పటికే జరిగిన ప్రజా పోరాటాల వల్ల బలహీనమైన కారణంగా నాటి నెహ్రూ పటేల్ సైన్యాలు చేసిన ఒక్కరోజులోనే నిజాం నవాబును ఒక్క రోజులోనే లొంగిపోయినాడని ప్రకటించాయి. వీరు నిజాం నవాబు లక్ష్యంగా దండయాత్ర చేస్తే లొంగిపోయిన తర్వాత కూడా ఎందుకు వీరి దురాక్రమణ కొనసాగింది.
దాదాపు 600 రోజులు వీరు తెలంగాణలోని ప్రతి పల్లెలో దురాక్రమణలను కొనసాగిస్తూ అరాచకాన్ని సృష్టించారు. ప్రజలను విప్లవకారులను అనేక మందిని చెట్ల కట్టేసి పిట్టల్ని కాల్చి చంపినట్టు చంపారు. అంతేకాదు నిజాం నవాబుకు "రాజు ప్రముఖ్"అనే బిరుదు ఇచ్చి కోటిన్నర రూపాయలను నజరానాగా ఇచ్చింది. ప్రజలను చిత్రహింసలు పెట్టిన కాశీం రాజ్వి పాకిస్తాన్ పారిపోవడానికి సహకరించారు. ఇదంతా నెహ్రూ నైజాం నవాబ్ కుమ్మకులో భాగంగా జరిగిన తథంగం.
నెహ్రూ పటేల్ సైన్యాలు ఆ తరువాత కమ్యూనిస్టుల కేంద్రంగా దాడులు చేశారు. అనేకమంది ప్రజలను ఊచకోత కోశారు. 4000 మంది కమ్యూనిస్టు విప్లవకారులను చంపివేశారు. కమ్యూనిస్టులు పంచి పెట్టిన భూమిని తిరిగి భూస్వాములకు అప్పచెప్పారు. అలాంటప్పుడు ఇది ఏ రకంగా విలీనం విమోచనం స్వతంత్రం అవుతుందో నేడు జరుగుతున్న పార్టీలే చెప్పాలి.
చరిత్రకు వక్రభాష్యాలు
ప్రధానంగా బీజేపీ హిందూ, ముస్లింల మధ్య జరిగిన గొడవగా దీన్ని సృష్టిస్తుంది. నిజాం నవాబు ముస్లిం అయినా తన కింద పని చేసిన భూస్వాములు, జాగిదారులు, దేశ్ ముఖ్ లు హిందూ మతంలోని ఉన్నత వర్గాల వారే. వీరిద్దరూ కలిసి అన్ని మతాలలోని పేద బడుగు బలహీన వర్గాల ప్రజల మీద దాడులు చేశారు. అలాంటప్పుడు ఇది వీరు చెబుతున్నట్లు విమోచనం ఎలా అవుతుంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రజలను ప్రజా సమస్యల పట్ల చైతన్యం కాకుండా ఉండటం కోసం ప్రజల మధ్య విద్వేషాలను పెంచడం కోసం బీజేపీ తన తీవ్రమైన ప్రయత్నాలను చేస్తుంది.
నిజాం నవాబు తను సంస్థానాన్ని 1947 కన్నా ముందే సామంత రాజుగా, తాబేదారుడుగా బ్రిటిష్ పాలకవర్గాలకు పనిచేస్తున్నాడు. అలాంటప్పుడు దీనిని విలీనం, స్వతంత్రం అనలేము. దీనిలో బీజేపీ మతోన్మాదం కాగా మిగతా పార్టీలది అవకాశవాదంతో చరిత్రను వక్రీకరిస్తున్నారు. నాడు మనం సాధించుకున్న హక్కులను, భూములను నిజాం నవాబు బూచిగా చూపెట్టి నెహ్రూ, పటేల్ సైన్యాలు హరించి వేశాయి. దీనికి వ్యతిరేకంగా నిలబడిన ప్రజలను కమ్యూనిస్టులు ఉద్యమకారులను ఊచకోత కోశాయి.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఆనవాళ్లు నేడు తెలంగాణ ఏ పల్లెకు వెళ్లినా నేటికీ సజీవంగా మనకి సాక్షాత్కరిస్తాయి. తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం కొనసాగింపు ఇష్టం లేని వాళ్ళు, ప్రజలను మభ్యపెట్టి రకరకాలైన వాదనలను తెరమీదకు తీసుకొస్తున్నారు. ఇలాంటి వాదనలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సెప్టెంబర్ 17న తెలంగాణకు ఏమి జరిగిందని అంశంపై అందరూ మాట్లాడాల్సిన తక్షణ అవసరం నేడు ఉంది. చరిత్రను చరిత్రగా ఉంటే మంచిది. ఒకానొక చారిత్రక సందర్భంలో ప్రజలు తమ చరిత్ర గురించి తెలుసుకున్నప్పుడు భవిష్యత్తును ఎలా నిర్మించుకుంటారో వారే నిర్ణయించుకుంటారు.దీనికి ప్రజా పోరాటాలే దోహదం చేస్తాయి.
నాడు జరిగిన మట్టి మనుషులు పోరాటం నేటికీ పాలకవర్గాలను భయకంపితులను చేస్తున్నాయి. అందుకే ఇంతటి మహోద్వాల చరిత్రకు వారు రకరకాలైన వక్రభాష్యాలను చెబుతున్నారు.అయినా అంతిమంగా ప్రజలే చరిత్ర నిర్మాతలు. వారి చరిత్రను వారే నిర్మించుకుంటారు. ప్రజలను హింసించి, వెట్టి చాకిరి, బానిసత్వాన్ని చేపించుకొని ధన, మాన, ప్రాణాలను హరించి ఊచ కోత కోసిన రోజు సెప్టెంబర్ 17. ఇది ముమ్మాటికి తెలంగాణ ప్రజలకు విద్రోహ దినమే.
- వ్యాసకర్త: పీ మహేష్, పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షులు, సెల్:9700346942
