Wednesday, December 7, 2022
More
  Homelatestఈడీ, ఐటీ, లిక్కర్‌ దాడులు.. అసలు ఏం జ‌రుగుతుంది రాష్ట్రంలో..?

  ఈడీ, ఐటీ, లిక్కర్‌ దాడులు.. అసలు ఏం జ‌రుగుతుంది రాష్ట్రంలో..?

  ఒక‌సారి సిద్ధం.. మ‌రోసారి దాడి చేయ‌మంటారు

  విధాత: రాష్ట్రంలో లిక్కర్‌, క్యాసినో, గ్రానైట్‌, డ్రగ్స్‌ కేసుల్లో అధికార పార్టీ నేతలు, బంధువులు, సన్నిహితులపై ఆరోపణలు జోరుగా వస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక ముందు టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వర్‌ రావు కంపెనీలపై ఐటీ దాడులు జరిగాయి. వారి కుటుంబానికి సంబంధించిన సుమారు రూ. 80 కోట్లు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మంత్రి గంగుల కమలాకర్‌కు చెందిన‌ గ్రానైట్‌ కంపెనీలు, ఇళ్లలో, ఐటీ, ఈడీ ఉమ్మడిగా సోదాలు నిర్వహించాయి.

  నిశబ్ధం దేనికి సంకేతం

  టీఆర్‌ఎస్‌ ఎంపీ వద్దిరాజ్‌ రవిచంద్ర ఇంట్లో ఐటీ దాడులు జరిగాయి. కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన మందాడి శ్రీనివాసరావుకు చెందిన శ్రీహర్ష కన్‌స్ట్రక్షన్‌ ఆఫీస్‌లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. అయితే ఈ దాడులపై అధికార పార్టీ నుంచి ఎలాంటి వ్యతిరేక ప్రకటనలు రాలేదు.

  మునుగోడు ఉప ఎన్నిక సమయంలో రూ.18 వేల కోట్ల కాంట్రాక్టుల కోసం రాజగోపాల్‌ పార్టీ మారాడంటూ  విమర్శలు వస్తే వారు వాటికి సమాధానం ఇచ్చారు. కానీ ఆ సమయంలో తమ కుటుంబ సభ్యులపై, నేతలపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నా టీఆర్‌ఎస్‌ అధినేత నుంచి గానీ పార్టీ నుంచి గానీ ఏ స్పందనా రాలేదు. ఎదైన ప్రకటన చేస్తే రాజకీయంగా తమకు నష్టం చేకూరుస్తుందని ఆయన భావించి ఉంటారు.

  ధైర్యం చెప్పిన కేసీఆర్‌

  అయితే కేంద్రంపై యుద్ధం ప్రకటించి, బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక, బీహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల అధినేతలతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఆ సమయంలోనే రానున్నరోజుల్లో పార్టీ నేతలపై దాడులు జరిగే అవకాశం ఉన్నదని, పార్టీ మారాలని ఒత్తిడి చేస్తారని అలాంటి బెదిరింపులకు భయపడవద్దని కేసీఆర్‌ నేతలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశార‌ని స‌మాచారం.

  ఏ త‌ప్పు చేయ‌లేదు.. భ‌య‌మేలా!

  ఎలాంటి తప్పులు చేయని మేము ఐటీ, ఈడీ దాడులకు ఎందుకు భయపడ‌తాం? తప్పుచేసిన వాళ్లు, దొంగలు భయ పడుతారు? మేము ఎలాంటి తప్పులు చేయలేదు. కాబట్టి ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదనే ధీమాలో ఉన్నారు. అంతేకాదు ఐటీ, ఈడీ అధికారులు కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చినట్టు, ప్రగతిభవన్‌లో కూడా త్వరలో సోదాలు నిర్వహిస్తారనే అంశంపై మీడియా ప్రశ్నించగా.. రాని వస్తే నా దగ్గర ఏమి ఉన్నది? వాళ్లే నాకు ఛాయ్‌ తాగించి పోతారని కేసీఆర్‌ సెటైర్‌ వేశారు.

  అలాగే మంత్రి కేటీఆర్‌ ఈడీ, మోడీ, బోడీ అంటూ ఇటీవల ట్విట్టర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు వేస్తున్న విష‌యం తెలిసిందే. కానీ కేసీఆర్‌ అధ్యక్షతన మొన్న టీఆర్‌ఎస్‌ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం జరిగింది. ఐటీ, ఈడీ దాడులపై తిరగబడండి.. పార్టీ మారాలని ఒత్తిడి చేస్తే చెప్పులతో కొట్టండి అని అన్నారు.

  చెప్పేది ఒక‌టి.. చేసేది మ‌రోటి

  కేసీఆర్‌తో పాటు ఆ పార్టీ నేతలు మాట్లాడితే చాలు తమ పథకాలు దేశానికి ఆదర్శం అని, పాలనలో అత్యంత పారదర్శంకగా ఉన్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ వివిధ కేసుల్లో ఆ పార్టీ నేతల పేర్లు వస్తుండటం, ఐటీ, ఈడీ దాడుల్లో అక్రమాలు బయట పడుతుంటడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. వాళ్లు చెబుతున్న దానికి జరుగుతున్న దానికి పొంతన కుదరడం లేదు.

  ఎందుకు దాడులు చేస్తారు?

  ఎలాంటి అవినీతి, అక్రమాలకు చోటు లేకుంటే ఐటీ, ఈడీ అధికారులు ఎందుకు దాడులు చేస్తున్నారు? సీబీఐకి రాష్ట్రంలోకి నో ఎంట్రీ అని ప్రభుత్వం ఎందుకు ప్రకటించిందని ప్రశ్నిస్తున్న‌ది. అంతేకాదు కొన్ని నెలల కిందటి నుంచి కేసీఆర్‌, కేటీఆర్‌ మొదలు అధికార పార్టీ నేతలు పదే పదే ఐటీ, ఈడీ, సీబీఐ వంటి సంస్థల పేర్లు ప్రస్తావించడానికి ఉటంకిస్తున్నారు. గుమ్మడి కాయ దొంగ ఎవరంటే భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు అనే చర్చ కూడా జరుగుతున్నది.

  ఎందుకు ఆగిపోయింది?

  రాజకీయ కక్ష్య సాధింపులో భాగంగా ఈ దాడులు చేస్తున్నారని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. బీజేపీ అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నేతలు ప్రచారం చేస్తారనే వార్తలు వచ్చాయి. ఆ ప్రస్తావన ఇప్పుడు వినపడటం లేదు. లిక్కర్‌ స్కాం కేసులో కేసీఆర్‌ కుటుంబ సభ్యుల పేరు తెరమీదికి వచ్చి రాజకీయ రచ్చ జరిగి ప్రస్తుతం అది ఎందుకు ఆగిపోయింది? ఇలాంటి అనేక ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి.

  వారి మ‌ధ్య స‌ఖ్య‌త కుదిరిందా..

  తమది పారదర్శక పాలన అంటూ.. ఊదరగొడుతున్న వాళ్లు ఐటీ, ఈడీ దాడులను ఎందుకు ఆహ్వానిస్తున్నారు? కేంద్రంలోని బీజేపీ అధిష్ఠాన పెద్దలు, అధికార పార్టీ నేతల మధ్య అవగాహన మేరకే ఇదంతా జరుగుతున్నదా? అనే చర్చ కూడా జరుగుతున్నది.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page