- గవర్నర్ పదవికి బ్రిటీష్ కాలంలో అర్థం ఉండే..
విధాత: రాజ్‌భవన్ రాజకీయ వేదికలకు అడ్డా కాదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పారు. గవర్నర్ రాజకీయాలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ రాజకీయ పరమైన వ్యాఖ్యలు మానుకోవాలని కేటీఆర్ కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. అయితే మీడియా సమావేశం ముగియగానే.. గవర్నర్ బడ్జెట్ ప్రసంగంపై కేటీఆర్‌ను ఓ జర్నలిస్టు ప్రశ్నించారు. తాను ఇక్కడ ఉన్నానని, ఆ విషయం తనకేమి తెలియదన్నారు. సీఎం, శాసనసభా వ్యవహారాల మంత్రి చూసుకుంటారని స్పష్టం చేశారు కేటీఆర్.
దేశానికి, వ్యవస్థకు మంచిది కాదు..
రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థల్ని గౌరవించే సంస్కృతి మాది అని కేటీఆర్ స్పష్టం చేశారు. రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్న వారు కూడా పార్టీలకు అనుకూలంగా, పార్టీల ప్రతినిధులుగా పార్టీల చర్చల్లో పాల్గొనడం, రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేయడం మానుకుంటే మంచిది. ఇంత అన్యాయంగా ఒక పార్టీ గురించే మాట్లాడుతూ, ఒక పార్టీ నాయకుల ఫోటోలనే రాజ్‌భవన్‌లో పెట్టుకుంటూ రాజ్‌భవన్‌ను రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చడం దేశానికి మంచిది కాదు. వ్యవస్థకు మంచిది కాదు అని కేటీఆర్ సూచించారు.
బ్రిటీషోళ్లు పెట్టిన గవర్నర్ వ్యవస్థ వల్ల దేశానికి ఏం ఉపయోగం..?
మోదీ మొన్న గొప్ప స్పీచ్ ఇచ్చారు. బ్రిటీష్ కాలం నాటి బానిస చిహ్నాలు పోవాలని మోదీ అన్నారు అని కేటీఆర్ గుర్తు చేశారు. అందుకే రాజ్‌పథ్‌ను కర్తవ్య పథ్ అని మార్చామని చెప్పి మోదీ గొప్ప స్పీచ్ ఇచ్చారు. గవర్నర్ వ్యవస్థ కూడా బ్రిటీషోళ్లు పెట్టిందే. మరి అవి ఎందుకు ఉండాల్నో.. అవి ఎందుకో.. దాని వల్ల దేశానికి ఏం ఉపయోగమో చెప్పాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
గవర్నర్లు ఎవరు ఎన్నుకున్నవారు..?
ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్‌ను ఏమో ప్రజలు ఎన్నుకున్నారు. గవర్నర్లు ఎవరు ఎన్నుకున్నవారు..? అని కేటీఆర్ ప్రశ్నించారు. సర్కారియా కమిషన్, ఫూంచ్ కమిషన్ కూడా చెప్పింది. మేం చెప్పుడు కాదు.. మోదీ కూడా సీఎంగా ఉన్నప్పుడు స్వయంగా చెప్పారు. రాజకీయాల్లో ఉన్నవారికి గవర్నర్ పదవి ఇవ్వొద్దని మోదీనే చెప్పారు. రెండేండ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటేనే ఇవ్వాలని మోదీ చెప్పారు. మరి ఇవాళ మోదీ అది పాటిస్తున్నాడా..? ముఖ్యమంత్రి మోదీనేమో నీతులు చెబుతాడు. ప్రధానమంత్రి మోదీనేమో అదే నీతులను తుంగలో తొక్కుతాడు. ఇవాళ వ్యవస్థ అట్లున్నది అని కేటీఆర్ దుయ్యబట్టారు.
గవర్నర్ పదవికి ఒకప్పుడు అర్థం ఉండే..
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉంటాయి అని కేటీఆర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి ఉంటారు. గవర్నర్ పదవికి బ్రిటీష్ కాలంలో అర్థం ఉండే. ఎందుకంటే పైనా వైశ్రాయ్ ఉండే.. కింద గవర్నర్ ఉండే.. వారు సంభాషించుకునే వారు. ఇక ప్రధాన మంత్రైనా ఆయన పేరును వైశ్రాయ్ అని మార్చుకోవాలి. లేదంటే ఇక్కడ గవర్నర్లను అయినా ఎత్తేయాలి. ఇతరులకు చెప్పేముందు ఆయన ఆలోచించుకుంటే మంచిదని కేటీఆర్ సూచించారు.