Tuesday, January 31, 2023
More
  Homelatestమా నియోజకవర్గాలలో మీ పెత్తనం ఏంటి: అద్దంకి

  మా నియోజకవర్గాలలో మీ పెత్తనం ఏంటి: అద్దంకి

  • అణచి వేయాలని చూస్తే తిరుగుబాటు తప్పదు
  • మాకు ఇబ్బందులు కలిగిస్తే మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం
  • TPCC ప్రధాన కార్యదర్శులు అద్దంకి దయాకర్, కొండేటి మల్లయ్య హెచ్చ‌రిక‌

  విధాత: ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ అసెంబ్లీ స్థానాలలో కూడా పరోక్షంగా తమ పెత్తనం కొనసాగించాలన్న దురుద్దేశంతో కొందరు ఫ్యూడల్ భావజాలంతో చైతన్యం కలిగిన దళిత నాయకులను అణిచివేయాలని చూస్తున్నారని టిపిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఆరోపించారు.

  TPCC ప్రధాన కార్యదర్శులుగా నియమితులైన అద్దంకి దయాకర్, కొండేటి మల్లయ్యలను ఆదివారం దళిత సంఘాల ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో ఘనంగా సన్మానించారు.
  ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ రిజర్వేషన్ స్థానాలలో ఇతరుల పెత్తనాన్ని సహించేది లేదని, అణచివేయాలని చూస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.

  మా రాజకీయ భవిష్యత్తును అణచివేయాలని చూస్తే, ఎన్నికల్లో మాకు అవకాశం రాకుండా చేయాలనుకుంటున్న నాయకులకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. మేం ఎవరికి వ్యతిరేకం కాదని, అన్ని వర్గాల సహకారం కోరుకుంటామన్నారు.

  కొందరు బడా నాయకులు రిజర్వుడ్ స్థానాల్లో వారి చెప్పు చేతుల్లో ఉండే ఎస్సి, ఎస్టీ నాయకుల కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. వారి నియంత ధోరణిని సహించేది లేదన్నారు. కోట్లు ఉంటే అనుభవించండి… కానీ మా మీద పెత్తనం చెలాయించాలని చూస్తే ఏ పార్టీ నాయకుడైనా ఊరుకోబోమని హెచ్చరించారు.

  ఎస్సీ, ఎస్టీ, బీసీలలో చైతన్యం కలిగిన నాయకులకు అవకాశాలు రాకుండా, వాళ్ల జీతగాళ్లను, చెప్పుచేతుల్లో ఉండే నాయకులకు ఎన్నికల్లో టికెట్లు ఇప్పించాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. పనిచేసే వాళ్లకే టిక్కెట్లు ఇవ్వాలన్నారు.

  కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందన్నారు. బడుగులకు ఆత్మీయతగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. సీఎం కుర్చీ అయినా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి స్థానమైన కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలకు అవకాశాలు దక్కుతాయని పేర్కొన్నారు.

  తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటివరకు తనతోపాటు అనేకమంది ఎస్సీ, బీసీ,ఎస్టీల నాయకులు ప్రజలను చైతన్యవంతం చేస్తూ ముందుకు పోతున్నామన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నేతలు కొందరు బడుగు, బలహీన వర్గాల నాయకులను అణిచివేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు.

  ఇక వారి ఆటలు చెల్లవని.. మా హక్కులకు భంగం కలిగిస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేశాడని ధ్వజమెత్తారు. మోసపూరిత హామీలతో నియంత పాలన సాగిస్తున్నాడని విమర్శించారు.

  టిపిసిసి ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే అందరికీ సమన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. పార్టీలో కొందరు పెద్ద నాయకులు మాత్రం తమ చెప్పు చేతుల్లో ఉండే నాయకులకు రిజర్వ్ స్థానాల్లో టికెట్లు ఇప్పించుకోవాలని చూస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఇక వారి పెత్తనం సహించేది లేదని హెచ్చరించారు.

  ఎన్నో ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్నందున‌ మాకు చట్టసభలలో అవకాశం రావాలని కోరుకుంటున్నామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సహకారంతో ఆ కల నెరవేర్చుకుంటామని పేర్కొన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

  అనంతరం దళిత సంఘాల నాయకులు పూలమాలలు, బొకేలు, గజమాలతో అద్దంకి దయాకర్, కొండేటి మల్లయ్యలను ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆదిమల్ల శంకర్ ఆధ్వర్యంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో దళిత సంఘాల నేతలు కత్తుల తులసీదాస్, మాచర్ల సైదులు, గోలి సైదులు, కట్టెల శివకుమార్,పి. పాండు, కందుల మోహన్, నరేందర్, అనంతం, ధర్మయ్య, అఖిల్, కొండల్, గుండా జలంధర్ రెడ్డి, కొత్తపెళ్లి మధు, కొత్తపల్లి సైదులు, ఇరిగి శంకర్, కొత్తపల్లి శంకర్ ఆర్ల సూర్యప్రకాష్, ఇరుగు మధు, పెరిక అంజయ్య, లింగాల వెంకన్న, భాస్కర్, సంజయ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular