Dinosaurs
విధాత: ఇప్పుడు ఉన్న ఉష్ణోగ్రతల కంటే ఓ 9 డిగ్రీలు ఎక్కువగా.. ఇప్పటి కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం కంటే సుమారు 16 రెట్లు ఎక్కువగా ఉంటే మనిషి మనుగడ సాగించగలడా? మరి ఇదే వాతవరణం ఉన్న 6.6 కోట్ల సంవత్సరాల క్రితం రాకాసి బల్లులు ఎలా జీవించాయి? వాటి ప్రత్యేకతలేంటి? అలాంటి పరిస్థితుల్లో మనం బతికి బట్టకట్టాలంటే ఎలా.. ఇలా ఎన్నో ప్రశ్నలకు శాస్త్రవేత్తలు సమాధానాలు వెతికే పనిలో పడ్డారు.
అప్పటి పరిస్థితులకు కారణమిదే..
ఒకప్పుడు ఒకే భూమిగా ఉన్న ఈ ప్రపంచం డైనోసార్ల కాలంలో విడిపోతూ… ఇప్పుడు ఉన్న ఖండాలుగా
రూపాంతరం చెందింది. ఇది పలు వాతావరణ మార్పులకు కారణమైంది. అగ్ని పర్వతాలు విస్ఫోటం చెంది బూడిద, విషవాయువులు ప్రకృతిలో కలిసిపోయేవి.
దీంతో యాసిడ్ వర్షాలు, అడవులు తగ్గిపోవడం వంటి విపరిణామాలు సంభవించాయి. దీంతో కొన్ని చిన్నా చితకా జీవ జాతులు అంతరించిపోగా.. రాకాసి బల్లులు మాత్రం ఈ సమస్యలను తట్టుకుని నిలబడ్డాయి.. కొన్ని కోట్ల సంవత్సరాలు ఈ భూమ్మీద రాజ్యం ఏలాయి. మరి డైనోసార్లు ఎలా ఆ ప్రమాదాన్ని తప్పించుకున్నాయి?
సమయమే అన్నింటికీ మూలం
అవును సమయమే అన్నింటికీ మూలమని శాస్త్రవేత్తలు నొక్కి చెబుతున్నారు. పైన చెప్పుకున్న విపత్కర పరిస్థితులన్నీ ఓ స్థాయికి రావడానికి చాలా సమయం పట్టింది. డైనోసార్లకు ఆ పరిస్థితులకు అలవాటు
పడటానికి ఆ మాత్రం సమయం చిక్కింది. ప్రస్తుతం మానవుడికి మాత్రం అంత సమయం లేదన్నది పరిశోధకుల మాట.
మెసోజోయిక్ ఎరాలో కొన్ని డిగ్రీల ఉష్ణోగ్రత పెరగడానికి కోట్ల ఏళ్లు పట్టగా.. ఈ ఆధునికయుగంలో శిలాజ ఇంధనాల వాడకం, పారిశ్రామికీకరణ వల్ల రెండు దశాబ్దాల్లోనే మనం వాతావరణాన్ని ప్రమాదకరంగా మార్చేశాం.
పోట్సడాం ఇన్ స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసర్చ్ (పీఐకే) పరిశోధకుడు జార్జ్ ఫ్యుల్నర్ మాటల్లో చెప్పాలంటే.. ‘ఉష్ణోగ్రత మెల్లగా పెరుగుతూ ఉంటే ప్రకృతి దానికి అలవాటు పడుతుంది. అలాగే మానవుడు సహా అన్ని జీవజాతులూ ఆ వేడి వాతావరణంలో జీవించగగలిగేలా పరిణామం చెందుతాయి. కానీ ఇప్పడు ఆ అవకాశం ఉందా అన్నదే ప్రశ్న’.
నిధుల లేమి..
మానవాళి మీద పడుతున్న భయంకర తుపానులు, వరదలు, కరువులను తట్టుకునేలా మారాలంటే
2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 300 బిలియన్ డాలర్ల నిధులు అవసరం. కానీ ఈ నిధుల సమీకరణలో ఇప్పటికీ ప్రపంచదేశాలు అనుకున్నంత వేగంగా ముందుకు రావడం లేదు.
భూమి అతిగా వేడెక్కడం, అతిగా చల్లబడిపోవడం వల్ల చరిత్రలో ఇప్పటి వరకు ఐదు సార్లు జీవం అంతరించిపోయింది. ఇప్పుడు మనం ఆరో అంతరించిపోయే యుగంలో ఉన్నాం. 86 లక్షల జీవరాశుల్లో వచ్చే కొన్ని దశాబ్దాల కాలంలోనే 10 లక్షల జాతులు కనుమరుగు కానున్నాయని శాస్త్రవేత్తల అంచనా.
మెసోజోయిక్ ఎరా తరహా వాతావరణ పరిస్థితులు మనకి ఎదురుకావడానికి ఇంకా చాలా సమయమే పట్టొచ్చు కానీ.. ఇప్పుడు పెరిగిన ఉష్ణోగ్రతలకే తట్టుకోలేని మానవాళి.. అప్పటి వరకూ మనుగడలో ఉండాలంటే భారీ దిద్దుబాటు చర్యలకు పూనుకోవాల్సి ఉంది.