విధాత‌: అవసరానికి బైక్ నడిపే వారు కొందరైతే, సరదాగా బైక్ నడిపే వారు కొందరు. ప్రయాణం చెయ్యనిదే పనిగడవని రోజులివి. ఎక్కువ మంది ప్రయాణాలకు వాడేది ఈ రోజుల్లో బైకులే. ఇది వరకు రోజుల్లో బైక్ విలాసమైతే ఇప్పుడు అవసరమే. బైకుల వినియోగం పెరిగే కొద్దీ జనంలో వెన్నునొప్పి సమస్య కూడా పెరుగుతోంది. బైక్ రైడింగ్‌లో వెన్ను నొప్పి ఎందుకు? బైక్ నడిపే సమయంలో ఎక్కువ సమయం పాటు ఒకే భంగిమలో కూర్చుని ఉండాల్సి ఉంటుంది. ఇలా […]

విధాత‌: అవసరానికి బైక్ నడిపే వారు కొందరైతే, సరదాగా బైక్ నడిపే వారు కొందరు. ప్రయాణం చెయ్యనిదే పనిగడవని రోజులివి. ఎక్కువ మంది ప్రయాణాలకు వాడేది ఈ రోజుల్లో బైకులే. ఇది వరకు రోజుల్లో బైక్ విలాసమైతే ఇప్పుడు అవసరమే. బైకుల వినియోగం పెరిగే కొద్దీ జనంలో వెన్నునొప్పి సమస్య కూడా పెరుగుతోంది.

బైక్ రైడింగ్‌లో వెన్ను నొప్పి ఎందుకు?

బైక్ నడిపే సమయంలో ఎక్కువ సమయం పాటు ఒకే భంగిమలో కూర్చుని ఉండాల్సి ఉంటుంది. ఇలా కూర్చునే భంగిమ మన శరీరాలకు అంత సౌకర్యవంతమైంది కాదు. అందువల్ల వీపు కండరాల్లో, ఎముకల్లో నొప్పి వస్తుంది. ఒక అధ్యయన ఫలితాలను బట్టి మనదేశంలో బైక్ రైడర్లలో ఎక్కువ మందిలో వీపు నొప్పి, భుజం, మెడ నొప్పితో బాధపడతున్నారట.

ఈ నొప్పి రాకుండా ఏం చెయ్యాలి?

బైక్ మీద ఎక్కువ దూరాలు ప్రయాణాలు చేసే వారు లేదా ఎక్కువ సమయం పాటు నడిపే వారు వెన్ను నొప్పి రాకుండా ఉండేందుకు వెన్నెముక, వీపు కండరాలు బలంగా ఉండేలా జాగ్రత్త పడాలి. వీలైనంత వరకు డ్రైవింగ్‌లో వెన్నెముకపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. కొన్ని రకాల వ్యాయామాలు తప్పక చెయ్యాలి.

వెన్నెముక నిటారుగా ఉండడానికి వీపు కండరాలు సహకరిస్తాయి. ఎక్కువ సమయం పాటు బైక్ ప్రయాణాలు చేసే వారిలో ఈ కండరాలు బలహీనంగా ఉంటే అలసిపోతాయి. వీటిని బలోపేతం చెయ్యడానికి మార్జాలాసనం, వారధి ఆసనం వంటి యోగాసనాలు ఉపయోగపడతాయి. బ్యాక్ రోటేషనల్ స్ట్రెచ్, షోల్డర్ బ్లేడ్ స్క్వీజ్ వంటి స్ట్రెచెస్ కూడా బాగా రిలాక్స్ చేస్తాయి.

రైడింగ్ భంగిమే ముఖ్యం

బైక్ ప్రయాణాలు ఎక్కువగా చేసినప్పటికీ వెన్నునొప్పిని నివారించాలంటే కావల్సిందల్లా బండి మీద సరైన భంగిమలో కూర్చోవాలి. బైక్ సీట్, ఫూట్ రెస్ట్ సరైన తీరులో సర్దుబాటు చేసుకోగలిగితే మంచిది. హ్యాండిల్ బార్‌ను పట్టుకోవడానికి వీపు మీద ఒత్తిడి పడకుండా ఉండాలి.

అంతేకాదు బండి మీద కూర్చుని నేలను కాళ్లతో తాకేందుకు కూడా ఇబ్బంది ఉండకూడదు. మీ ఎత్తుకు సరిపడే బైక్‌నే కొనుక్కోవడం మంచిది. వీపు నిటారుగా ఉంచి బైక్ మీద కూర్చోవాలి. కూర్చున్న భంగిమలో భుజం తుంటి ఒకే లైన్లో నిటారుగా ఉండాలి. భుజాలు ముందుకు వంగి పోకుండా వెనుకకు పెట్టాలి. అందువల్ల మెడ, భుజాల మీద ఒత్తిడి ఉండదు.

ఒక చిన్న బ్రేక్ అవసరమే

ఎక్కువ సమయం విరామం ఇచ్చే సిగ్నల్స్ దగ్గర, ట్రాఫిక్ జామ్‌లలో దొరికిన సమయాన్ని చిన్నచిన్ని స్ట్రెచింగ్‌లు చెయ్యడానికి వాడాలి. లాంగ్ డ్రైవ్‌లో ఉంటే కాసేపు ఆగి చిన్నచిన్న స్ట్రెచ్‌లు చేసుకొని కాస్త విరామం తర్వాత తిరిగి ప్రయాణం కొనసాగించడం మంచిది.

బండి మీద కూర్చుని కూడా కుడి చేత్తో హ్యాండిల్ బార్‌ను పట్టుకొని ఎడమ చేతితో వెనుక సీటును చేరుకునేలా స్ట్రెచ్ చెయ్యవచ్చు, ఇలాగే రెండో వైపు కూడా చెయ్యవచ్చు. మెడ మీద రెండు చేతులను వెడల్పుగా పరచినట్టు పెట్టుకొని రెండు వైపులకు ఊగవచ్చు. ఇది మెడ చేతులు స్ట్రెచ్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది.

అంతేకాదు బైక్‌ను మంచి కండిషన్‌లో ఉంచుకోవడం కూడా అవసరమే. సస్పెన్షన్లను కండిషన్లో ఉంచుకోవాలి. గుంతలు, స్పీడ్ బ్రేకర్ల వద్ద కుదుపుల సమయంలో వెన్నెముక మీద పడే ఒత్తిడిని ఇవి కాస్త తగ్గిస్తాయి.

Updated On 2 Jan 2023 4:14 AM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story