కాలేజీ డ్రాపౌట్‌, ట్రక్‌ డ్రైవర్‌.. ఇప్పుడు ఖలిస్థానీ వేర్పాటువాది పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ ద్వారా శిక్షణ? విదేశాల నుంచి ఆయుధాలు, నిధులు! అమృత్‌పాల్‌ వేటలో పంజాబ్‌, కేంద్రం తృటిలో తప్పించుకున్న వేర్పాటు నేత Amritpal Singh। అమృత్‌పాల్‌సింగ్‌! ఇప్పడు భారతదేశంలో మోస్ట్‌ వాంటెడ్‌.. పంజాబ్‌లో సమసిపోయిందనుకున్న వేర్పాటువాదాన్ని మళ్లీ రెచ్చగొడుతున్న ఖలిస్థానీ కార్యకర్త. పాలిటెక్నిక్‌ చదువుతూ మధ్యలో మానేసిన యువకుడు.. దుబాయ్‌లో ఒక ట్రాన్స్‌పోర్టు కంపెనీలో డ్రైవర్‌గా పని చేసిన వ్యక్తి.. మతం మాటున వేర్పాటువాద నాయకుడిగా ఎదగడం […]

  • కాలేజీ డ్రాపౌట్‌, ట్రక్‌ డ్రైవర్‌..
  • ఇప్పుడు ఖలిస్థానీ వేర్పాటువాది
  • పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ ద్వారా శిక్షణ?
  • విదేశాల నుంచి ఆయుధాలు, నిధులు!
  • అమృత్‌పాల్‌ వేటలో పంజాబ్‌, కేంద్రం
  • తృటిలో తప్పించుకున్న వేర్పాటు నేత

Amritpal Singh। అమృత్‌పాల్‌సింగ్‌! ఇప్పడు భారతదేశంలో మోస్ట్‌ వాంటెడ్‌.. పంజాబ్‌లో సమసిపోయిందనుకున్న వేర్పాటువాదాన్ని మళ్లీ రెచ్చగొడుతున్న ఖలిస్థానీ కార్యకర్త. పాలిటెక్నిక్‌ చదువుతూ మధ్యలో మానేసిన యువకుడు.. దుబాయ్‌లో ఒక ట్రాన్స్‌పోర్టు కంపెనీలో డ్రైవర్‌గా పని చేసిన వ్యక్తి.. మతం మాటున వేర్పాటువాద నాయకుడిగా ఎదగడం వెనుక చాలా పెద్ద కుట్రే ఉన్నది.

విధాత: క్లబ్‌హౌస్‌ (ClubHouse group) అనే సోషల్‌ మీడియా యాప్‌ ఒకటి ఉన్నది. అందులో వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు, సంస్థల మధ్య విభిన్న అంశాలపై ‘ఆడియో రూమ్స్‌’లో చర్చలు నడుస్తూ ఉంటాయి. ఆ యాప్‌లో చేరి, వారి మాటలు వినే సాధారణ యువకుడు అమృత్‌పాల్‌సింగ్‌.

కేంద్రం తీసుకువచ్చిన నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ శివార్లలో చారిత్రాత్మక ఉద్యమాన్ని నడిపారు. ఆ సమయంలో ఎర్రకోట వద్ద జరిగిన ఆందోళనల సందర్భంగా తెరపైకి వచ్చిన దీప్‌ సిద్ధు (Deep Sidhu).. క్లబ్‌హౌస్‌ యాప్‌లో 2021 చివరిలో ఒక ఆడియో రూమ్‌ ప్రారంభించాడు.

ఈ రూమ్‌లో అమృత్‌పాల్‌ కూడా ఉన్నా.. ప్రసంగాలు చేసేవాడు కాదు. అయితే.. కొంతమంది ఎన్నారైలు, ఇతర సభ్యులు పంజాబ్‌పై ఆయనకు ఉన్న విషయ పరిజ్జానాన్ని గుర్తించిన తర్వాత వారి ప్రోత్సాహంతో కీలక ప్రసంగీకుల్లో ఒకడిగా మారాడు. అమృత్‌పాల్‌ పంజాబ్‌ ఇతర సమస్యలు కాకుండా.. తరచూ ఖలిస్థాన్‌ ఏర్పాటు ఆవశ్యకత గురించి మాట్లాడుతుండటంతో దీప్‌ సిద్ధు అతడిని బ్లాక్‌ చేశాడు.

దీప్‌ సిద్ధు ఆకస్మిక దుర్మరణం

2022 ఫిబ్రవరి 15న దీప్‌ సిద్ధు అనుమానాస్పద రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. వారిస్‌ పంజాబ్‌ దే (Waris Punjab De) సంస్థను ప్రారంభించిన కొద్ది రోజులకే ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం ఒక అంశమైతే.. దీప్‌ సిద్ధు ప్రారంభించిన సంస్థ ఫేస్‌బుక్‌ పేజీ హ్యాక్‌ అవడమే కాకుండా.. ఆ సంస్థకు అమృత్‌పాల్‌ కొత్త చీఫ్‌ అంటూ ప్రకటన అందులో రావడం మరో అనుమానాస్పద అంశంగా మారింది.

అంతేకాదు.. ఆయన నియామక పత్రం అంటూ ఒక డాక్యుమెంటును కూడా పోస్టు చేశారు. వాస్తవానికి అమృత్‌పాల్‌ అప్పటికి సిక్కు మతం ఆచరించేవాడు కాదని చెప్తారు. జుట్టు కత్తిరించుకోవడాన్ని, గడ్డం ట్రిమ్‌ చేసుకోవడాన్ని సమర్థించేవాడు. ఇతడు దుబాయ్‌లో ట్రక్‌ డ్రైవర్‌గా పనిచేసేవాడు. కపూర్తల పాలిటెక్నిక్‌ కాలేజీలో చదువుతూ మధ్యలో మానేశాడు.

ఆకస్మికంగా రంగంలోకి..

పంజాబ్‌లో ఉన్నట్టుండి భారీ స్థాయిలో ప్రత్యక్షమయ్యేదాకా అమృత్‌పాల్‌ కార్యకలాపాలు ఏమీ లేవు. 2022 సెప్టెంబర్‌ 25న ఆనందపూర్‌ సాహిబ్‌కు (Anandpur Sahib) తన మద్దతుదారులతో వచ్చిన అమృత్‌పాల్‌.. సిక్కుమతం స్వీకరించాడు. అది జరిగిన నాలుగు రోజులకే ఖలిస్థానీ వేర్పాటువాద సిద్ధాంత కర్త జర్నైల్‌ సింగ్‌ భ్రిందన్‌వాలే (Jarnail Singh Bhindranwale) పూర్వీకుల గ్రామమైన రోడేలో అమృత్‌పాల్‌కు తలపాగా చుట్టే కార్యక్రమం దస్తర్‌బందీ (dastarbandi) ఘనంగా నిర్వహించారు.

అచ్చం భ్రిందన్‌వాలే తరహాలో పొట్టి, వదులైన పంట్లం వేసుకుని, దానిపై పొడవాటి కుర్తా ధరించి, తనకు నీలం రంగు తలపాగా పెట్టుకుని, ఓ చేతిలో కరవాలం (Kirpan), మరో చేతిలో మరో ఆయుధం పట్టుకుని.. దర్శనమిచ్చాడు. భ్రిందన్‌వాలే 2.0 మొదలయ్యాడని పంజాబ్‌ పోలీసులు, కేంద్ర సంస్థలకు ప్రమాద సంకేతాలు అందాయి.

విదేశాల నుంచి ఆయుధాలు, నిధులు!

అమృత్‌పాల్‌ గ్యాంగ్‌కు విదేశాల నుంచి నిధులు, ఆయుధాలు, మందుగుండు సరఫరా అవుతున్నట్టు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా అమృత్‌పాల్‌కు పాకిస్థాన్‌కు చెందిన గూఢచార సంస్థ ఐఎస్‌ఐ (ISI) శిక్షణ ఇచ్చినట్టు తెలుస్తున్నది. అతడు పంజాబ్‌కు రావడానికి ముందు జార్జియా దేశంలో శిక్షణ పొందాడన్న విమర్శలు ఉన్నాయి. ఒక గురుద్వారాను, కొన్ని డ్రగ్‌ డీ అడిక్షన్‌ కేంద్రాలను తన ఆయుధాలు నిల్వ చేసుకునేందుకు అమృత్‌పాల్‌ ఉపయోగిస్తున్నాడని అనుమానిస్తున్నారు.

మొదట్లో హింసకు వ్యతిరేకం.. నెలల్లోనే హింస

నిజానికి మొదట్లో అమృత్‌పాల్‌ హింసను వ్యతిరేకిస్తూ ఉపన్యాసాలు చెప్పేవాడు. సిక్కు యువతను మతం ఆచరించేలా మాట్లాడేవాడు. తలపాగాలు ధరించాలని, జుట్టు పొడవుగా పెంచుకోవాలని చెప్పేవాడు. క్రైస్తవ, ఇతర మతాలు స్వీకరించిన సిక్కులు తిరిగి స్వ మతంలోకి వచ్చేందుకు ఖల్సా వాహీర్‌ యాత్ర (Khalsa Vaheer yatra) పేరుతో యాత్రలు నిర్వహించేవాడు. మొత్తానికి ఆయన పనులు చాలా మందిని ఆకర్షించాయి. అయితే.. పోలీసులు మాత్రం వెంటనే అందులో ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు.

జలంధర్‌ నుంచి హింస మొదలు

గురు గ్రంథ్‌ సాహిబ్‌ పఠనం సమయంలో నేలపై కూర్చొనలేని వారి కోసం జలంధర్‌ (Jalandhar) గ్రామీణ ప్రాంత గురుద్వారాలలో కుర్చీలు ఏర్పాటు చేశారు. ఈ సంప్రదాయాన్ని నిరసిస్తూ అమృత్‌పాల్‌ అనుచరులు 2022 డిసెంబర్‌లో రెండు గురుద్వారాల్లో ఫర్నీచర్‌ను విరగ్గొట్టారు. అతడు, అతని అనుచరులు అధునాతన ఆయుధాలు చేతపట్టి, ఖరీదైన కార్లలో తిరుగుతూ చేస్తున్న హంగామాను గుర్తించిన తర్వాత కానీ అమృత్‌పాల్‌ సింగ్‌ నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని పోలీసులు పసి గట్టలేక పోయారు.

అంతకు ముందు వరకు అమృత్‌పాల్‌కు ఎవరు మద్దతు ఇస్తున్నారనే విషయంలో రాష్ట్ర పోలీసులకు గానీ, కేంద్ర సంస్థలకు గానీ పెద్దగా అవగాహన లేదు. ఢిల్లీలోని కొందరు శక్తిమంతులు అమృత్‌పాల్‌ను నడిపిస్తున్నారని పంజాబ్‌ పోలీసులు భావిస్తే.. అతడి పట్ల పంజాబ్‌ పోలీసులు మెతక వైఖరితో ఉన్నారని కేంద్ర సంస్థలు అనుమానించాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి మధ్య ఉన్న ఘర్షణ పూరిత వాతావరణం కూడా అమృత్‌పాల్‌ విషయంలో అనేక ఊహాగానాలకు తావిచ్చింది.

అసలు రూపాన్ని చెప్పేసిన అజ్నాలా హింసాకాండ

కానీ.. మొన్న ఫిబ్రవరిలో అజ్నాలా(Ajnala)లో జరిగిన హింసాకాండతో అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి ఒక స్పష్టత వచ్చి, ఉమ్మడి ప్రమాదంపై సంయుక్త ఆపరేషన్లు ప్రారంభించారు. లవ్‌ప్రీత్‌ తూఫాన్‌ సహా తన మద్దతుదారులను విడిపించుకునేందుకు అజ్నాలాలోని పోలీస్‌స్టేషన్‌పై అమృత్‌పాల్‌ విరుచుకుపడ్డాడు.

అమృత్‌పాల్‌ కార్యకలాపాలను వ్యతిరేకించినందుకు గాను తనను కిడ్నాప్‌ చేసి, చిత్రహింసలకు గురి చేశారని రాఫోర్‌కు చెందిన వీరేందర్‌సింగ్‌ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు లవ్‌ప్రీత్‌ తూఫాన్‌, ఇతర మద్దతుదారులను పోలీసులు అరెస్టు చేశారు.

నా వాళ్లనే అరెస్టు చేస్తారా? అంటూ అమృత్‌పాల్‌ తన మద్దతుదారులతో కలిసి, పోలీస్‌ స్టేషన్‌పై దండెత్తి.. ఠాణాను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో అనేక మంది పోలీసులు గాయపడ్డారు. అమృత్‌పాల్‌ చాలా తెలివిగా ఒక పల్లకీలో గురుగ్రంథ్‌ సాహిబ్‌ను ఉంచి.. దాన్ని అడ్డుపెట్టుకుని తన పన్నాగాన్ని అమలు చేశాడు.

దీంతో పెద్దగా బలప్రయోగం చేయలేకపోయామని పోలీసులు చెబుతున్నారు. దీనిపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. అమృత్‌పాల్‌ చర్యను పోలీసులు, ఆప్‌ ప్రభుత్వంతోపాటు ఎస్‌జీపీసీ(SGPC), అఖల్‌తఖ్త్‌ (Akal Takht)లోని సిక్కు మత పెద్దలు సైతం ఖండించారు. ఈ చర్య ద్వారా అతడు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.

మార్చి 18న భారీ ఆపరేషన్‌

ఎట్టకేలకు మార్చి 18వ తేదీన రాష్ట్ర పోలీసు, కేంద్ర సంస్థలు భారీ ఆపరేషన్‌ చేపట్టాయి. తన ఖల్సా వాహీర్‌ యాత్ర రెండో విడుతను ప్రారంభించేందుకు సిద్ధమైన అమృత్‌పాల్‌ను అరెస్టు చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇదే సమయంలో పంజాబ్‌ గాయకుడు సిద్ధు మూసేవాలా (Sidhu Moosewala) ప్రథమ వర్థంతి సందర్భంగా భారీ ర్యాలీ తీసేందుకు అతడి బంధువులు, అభిమానులు సిద్ధమయ్యారు.

ఈ ర్యాలీలో అమృత్‌పాల్‌ పాల్గొంటే పరిస్థితి చేయి దాటి పోతుందని నిఘా వర్గాలు అనుమానించాయి. ఈ క్రమంలో అమృత్‌పాల్‌ అనుచరులు 78 మంది సహా మొత్తం 112 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. అమృత్‌పాల్‌ కూడా దొరికినట్టే దొరికి తృటిలో తప్పించుకుపోయాడు. అయినా అతడి కోసం వేట కొనసాగుతూనే ఉన్నది.

మరోవైపు అమృత్‌పాల్‌ మామ, అమృత్‌పాల్‌ పారిపోవడానికి ముందు ప్రయాణం చేసిన కారు డ్రైవర్‌ ఆదివారం రాత్రి లొంగిపోయారు. అమృత్‌పాల్‌ దేశం వదిలి పారిపోకుండా సరిహద్దుల్లో అప్రమత్తం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలో ఇంటర్నెట్‌ సేవలను మార్చి 21 వరకు నిలిపివేశారు.

Updated On 21 March 2023 10:02 AM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story