- మాణిక్‌షాను కొనసాగిస్తారా?
- ప్రతిమాభౌమిక్‌కు చాన్స్ ఇస్తారా?
విధాత: ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో రెండో విడత బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి (Tripura Chief Minister) ఎవరు అవుతారనే చర్చ పార్టీలో జోరుగా సాగుతున్నది. ప్రస్తుత ముఖ్యమంత్రి మాణిక్‌షా (Manik Saha)ను కొనసాగించాలని కొందరు కోరుతుంటే.. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి ప్రతిమాభౌమిక్ (Pratima Bhoumik) పట్ల మొగ్గు చూపుతున్నారు.
కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న ప్రతిమాభౌమిక్‌ను ఎమ్మెల్యేగా నిలబెట్టినప్పుడే బీజేపీ గెలిస్తే ఈమే ముఖ్యమంత్రి అవుతారన్న చర్చ జరిగింది. తాజాగా ఎన్నికైన సభ్యుల్లోనూ ఎక్కువ మంది ప్రతిమకే జై కొడుతున్నారని సమాచారం. ప్రతిమా భౌమిక్ సీఎం అయితే.. త్రిపురకే కాదు.. మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లోనే (North-East) తొలి మహిళా ముఖ్యమంత్రి అవుతారు. అంతేకాకుండా.. ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏకైక మహిళా సీఎంగా కూడా ఉంటారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమం మార్చి 8న నిర్వహించనున్నారు. ఆ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women’s Day) కూడాను. అటువంటి ప్రత్యేకత ఉన్న రోజున ఒక మహిళను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారనే చర్చ కూడా ఉన్నది. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాతోపాటు పలువురు సీనియర్ నేతలు హాజరు కానున్నారని తెలుస్తున్నది.
ఢిల్లీకి దూతలను పంపిన మాణిక్‌షా?
ముఖ్యమంత్రి కుర్చీని తనకే రిజర్వ్ చేసుకునే ప్రయత్నాలను ఇప్పటికే మాణిక్‌షా మొదలు పెట్టారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. తనకు బాగా నమ్మకస్తులైన సుశాంత చౌదరి, రాంప్రసాద్ పాల్‌ను పార్టీ కీలక నేత, అస్సాం సీఎం హింత బిశ్వశర్మ వద్దకు పంపినట్టు సమాచారం.