అధికార పార్టీ నేతల హాట్ టాపిక్ వరంగల్ జిల్లా ఎమ్మెల్యేల్లో గుబులు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు చూసుకునే పరిస్థితి ఇప్పుడు వరంగల్ (Warangal) జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA)ల్లో నెలకొంది. కక్కలేని మింగలేని పరిస్థితిగా మారి అందరి ముందు దోషిగా నిలబడ్డారు. అసలు దొంగ ఎవరో తేలకపోయినప్పటికీ, ఎవరికి వారు ఎక్కడో ఒకచోట అక్రమాలకు పాల్పడినందున, తనను ఉద్దేశించే సీఎం కేసీఆర్ (CM KCR) కామెంట్ చేశారా? […]

  • అధికార పార్టీ నేతల హాట్ టాపిక్
  • వరంగల్ జిల్లా ఎమ్మెల్యేల్లో గుబులు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు చూసుకునే పరిస్థితి ఇప్పుడు వరంగల్ (Warangal) జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA)ల్లో నెలకొంది. కక్కలేని మింగలేని పరిస్థితిగా మారి అందరి ముందు దోషిగా నిలబడ్డారు. అసలు దొంగ ఎవరో తేలకపోయినప్పటికీ, ఎవరికి వారు ఎక్కడో ఒకచోట అక్రమాలకు పాల్పడినందున, తనను ఉద్దేశించే సీఎం కేసీఆర్ (CM KCR) కామెంట్ చేశారా? అని ఆందోళనతో సరిగ్గా నిద్ర కూడా పోవడం లేదు. మొత్తంగా సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యే గుండెల్లో కమిషన్ కక్కుర్తి బాంబు పేల్చారు.

దళిత బంధులో కమీషన్ దందా

దళిత బంధు (Dalita Bandhu) లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు కమిషన్ దందాకు పాల్పడ్డాడు.. అంటూ ఆ చిట్టా మొత్తం తన దగ్గర ఉంది. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే తోక కట్ చేస్తానంటూ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ (CM KCR) ఇటీవల ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఘాటుగా హెచ్చరించారు.

తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన పార్టీ ప్రజా ప్రతినిధుల విస్తృతస్థాయి సమావేశంలోనే బహిరంగంగా ఈ హెచ్చరిక జారీ చేశారు. వరంగల్ జిల్లాలో ఒకరు, ఆదిలాబాద్ జిల్లాలో ఒకరు దళిత బంధు లబ్ధిదారుల నుంచి పెద్ద మొత్తంలో కమిషన్ ప్రతిఫలం పొందినట్లు తన దగ్గర ఆధారాలు ఉన్నాయని, ప్రకటించి అధికార పార్టీ ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు పెంచారు.

ఎవరా? కమీషన్ కక్కుర్తి ఎమ్మెల్యే?

కేసీఆర్ కామెంట్ చేసినప్పటి నుంచి ఎవరా ఎమ్మెల్యే? అనే ఆసక్తికరమైన చర్చ ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ కారణంగా కాస్తంత ఈ విషయం వెనక్కి తగ్గిన ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, ఇందులో 11 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీకి చెందిన వారే ఉన్నారు.

ముఖ్యమంత్రి ఎమ్మెల్యే పేరు చెప్పకపోవడంతో 11 మందిలో ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఎమ్మెల్యే వైపు ఇప్పుడు వేలెత్తి చూపినట్లుగా పరిస్థితి మారిపోయింది. ఫలానా ఎమ్మెల్యే అయి ఉంటాడని, కాదు.. కాదు మా నియోజకవర్గ ఎమ్మెల్యే అయి ఉంటాడంటూ ఎక్కడికి అక్కడ ప్రజల్లోనూ, పార్టీ నేతల మధ్య ఈ కక్కుర్తి దందా పై బహిరంగంగానే చర్చ సాగుతుంది.

ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు

కేసీఆర్ కామెంట్స్‌తో పార్టీ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతోంది. చెప్పేదేదో ఆ కమిషన్ తీసుకున్న ఎమ్మెల్యే పేరు చెప్పిన సమస్య సద్దుమణిగేదని, కానీ ఇప్పుడు అందరూ ఎమ్మెల్యేలు అనుమానితులుగా మారారని అంటున్నారు. ఎవరికివారు భుజాలు చూసుకునే పరిస్థితి జిల్లాలో నెలకొంది. ఎందుకంటే ఎమ్మెల్యేలలో ఎవరు సొక్కం కాకపోవడంతో బయటికి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ నేను తీసుకుందేమైనా సీఎం దృష్టికి వెళ్లిందా? అనే అనుమాన భూతం వెంటాడుతోంది.

అందరూ ఆ తాను ముక్కలే

వాస్తవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదిలాబాద్‌లో ఒకరు వరంగల్లో ఒక ఎమ్మెల్యే ఈ కమిషన్ దందాకు పాల్పడ్డాడని చెప్పినప్పటికీ, మెజారిటీ ఎమ్మెల్యేలు దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో కమిషన్ దందాకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కమిషన్ వసూలులో ఎక్కువ, తక్కువ తేడాలున్నప్పటికీ అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డారని ఆరోపణలు విపక్షాల నుంచి పెద్ద ఎత్తున సాగుతోంది.

ఇక లబ్ధిదారుల ఎంపికలో తమ కోటరీ కి చెందిన వారికే ప్రాధాన్యత ఇచ్చారని, అర్హులైన లబ్ధిదారులను, అసలు సిసలు పేద దళితులను విస్మరించారని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కెసిఆర్ కమిషన్ దందా అందరికీ ఎక్కడో ఒకచోట బాణములా గుచ్చుకుంటుంది. బయటికి బాధని చెప్పుకోలేనప్పటికీ సన్నిహితుల వద్ద, సహచరుల వద్ద అందరూ దోషిగానే మారిపోయారు.

అక్రమాలకు కాస్తంత విరామం

సీఎం హెచ్చరికతో ఇతరత్రా అక్రమాలు చేసేందుకు జంకుతున్నారు. తమపై నిఘా ఉందనే విషయం తెలిసినప్పటికీ, రాబోయే ఎన్నికలలో తోక కట్ చేసే అవకాశాలు ఉన్నాయని ఎవరికి వారు జాగ్రత్త పడుతున్నారు. సీఎం కేసీఆర్ కూడా పేరు చెప్పకపోవడంలో అందరూ కాస్తంత జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తారని ఆలోచనతోనే ఈ కామెంట్ చేసినట్లు భావిస్తున్నారు.

ఏదేమైనా కొందరు ఎమ్మెల్యేలకు ముఖ్యంగా అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్యేలకు సీఎం కామెంట్ తో నిద్ర పట్టడం లేదని సన్నిహితులు గుసగుసలాడుతున్నారు. ఎవరికి వారు నేను కాదంటే, నేను కాదని ఫలానా వ్యక్తి అయ్యుంటాడని ఇతరుల మీదికి తోసేందుకు ప్రయత్నిస్తున్నారు. సీఎం తన కామెంట్‌తో జిల్లా ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు పెంచారనేది మాత్రం వాస్తవం.

Updated On 14 March 2023 7:13 AM GMT
Somu

Somu

Next Story