Vinayaka Chavithi | గ‌ణేశ్ చ‌తుర్ధి రానే వ‌చ్చింది. సోమ‌వారం రోజు విఘ్నేశ్వ‌రుడిని ప్ర‌తిష్టించి, పూజ‌లు చేసేందుకు భ‌క్తులు సిద్ధ‌మైపోయారు. వినాయ‌కుడి పూజ‌కు వాడే వ‌స్తువుల‌ను కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే విఘ్నేశ్వ‌రుడి పూజ‌లో వాడే ఆకుల‌కు ఎంతో విశిష్ట‌త ఉంది. అంతేకాదు.. ఆ ఆకులు సాధార‌ణ‌మైన‌వి కావు.. ఇవ‌న్నీ మ‌హోత్కృష్ట‌మై, శ‌క్తివంత‌మైన ఔష‌ధ గుణాలు క‌లిగి ఉన్న‌వి. మొత్తంగా 21 ఆకుల‌తో విఘ్నేశ్వ‌రుడికి పూజ‌లు చేస్తారు. ఇక న‌వ‌రాత్రులు ముగిసిన త‌ర్వాత గ‌ణ‌నాథుడిని పూజించి, ఆ […]

Vinayaka Chavithi |

గ‌ణేశ్ చ‌తుర్ధి రానే వ‌చ్చింది. సోమ‌వారం రోజు విఘ్నేశ్వ‌రుడిని ప్ర‌తిష్టించి, పూజ‌లు చేసేందుకు భ‌క్తులు సిద్ధ‌మైపోయారు. వినాయ‌కుడి పూజ‌కు వాడే వ‌స్తువుల‌ను కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే విఘ్నేశ్వ‌రుడి పూజ‌లో వాడే ఆకుల‌కు ఎంతో విశిష్ట‌త ఉంది. అంతేకాదు.. ఆ ఆకులు సాధార‌ణ‌మైన‌వి కావు.. ఇవ‌న్నీ మ‌హోత్కృష్ట‌మై, శ‌క్తివంత‌మైన ఔష‌ధ గుణాలు క‌లిగి ఉన్న‌వి. మొత్తంగా 21 ఆకుల‌తో విఘ్నేశ్వ‌రుడికి పూజ‌లు చేస్తారు.

ఇక న‌వ‌రాత్రులు ముగిసిన త‌ర్వాత గ‌ణ‌నాథుడిని పూజించి, ఆ త‌ర్వాత ప‌త్రితో క‌లిపి విగ్ర‌హాన్ని నిమ‌జ్జ‌నం చేస్తారు. ఇలా చేయ‌డం వెనుకాల ఒక కార‌ణం ఉంది. వానాకాలంలో ఎక్క‌డెక్క‌డి నుంచో నీరు వ‌చ్చి చెరువులు, బావులు, న‌దుల్లో చేరుతుంది. పైగా ఆ నీరు క‌లుషిత‌మై ఉండ‌టంతో దానిలోని క్రిమికీట‌కాలను నాశ‌నం చేసే శ‌క్తి ఆ 21 ఆకుల‌కు ఉంటుంది. ఆ ఆకులు నీటిలో క‌లిసి బ్యాక్టీరియాను తొల‌గించి ఆక్సిజ‌న్ స్థాయిల‌ను పెంచుతాయి. ఇది వినాయ‌క నిమ‌జ్జ‌నం వెనుక ఉండే ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ ర‌హ‌స్యం.

21 ఆకుల విశిష్ట‌త తెలుసుకుందాం..

మాచీ ప‌త్రం : చామంతి జాతికి చెందిన దీని ఆకులు సువాస‌న‌ను వెద‌జ‌ల్లుతాయి. త‌ల‌నొప్పి, చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. కండ‌రాల నొప్పుల‌తో బాధ‌ప‌డేవారు ఈ ఆకు వాడితే విశేష‌మైన ప్ర‌భావం ఉంటుంది. ఈ ఆకును తెలుగులో మాచ పత్రి అని పిలుస్తారు.

బృహ‌తీ ప‌త్రం : ముల‌క‌గా పిలిచే దీనిలో చిన్న ముల‌క‌, పెద్ద ముల‌క అని రెండు ర‌కాలుంటాయి. దీని ప‌త్రాలు వంగ ఆకుల మాదిరిగా ఉంటాయి. తెల్ల‌ని చార‌లుండే గుండ్ర‌ని పండ్ల‌తో ఉంటాయి. ఈ ఆకులు జీర్ణ‌, గుండె, చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌ల‌ను నివారిస్తాయి.

బిల్వా ప‌త్రం : దీనికి మారుపేరు మారేడు ఆకు. మూడు ఆకులుగా, ఒక ఆకుగా ఉండే ఇవి శివుడికి చాలా ఇష్టం. డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌కు, డ‌యేరియా, గ్యాస్ట్రిక్ స‌మ‌స్య‌ల‌ను నివారించే ఔష‌ధ గుణాలు ఈ ఆకులో ఉన్నాయి.

దూర్వా ప‌త్రం : దూర్వా ప‌త్రం అంటే గ‌రిక‌. తెల్ల గ‌రిక‌, న‌ల్ల గ‌రిక అని రెండు ర‌కాలుంటాయి. గ‌డ్డి జాతి మొక్క‌లు గ‌ణేషుడికి అత్యంత ప్రీతిక‌రం. గాయాలు, అల‌ర్జీలు, ఉద‌ర సంబంధ స‌మ‌స్య‌ల‌ను నివారించే గుణం గ‌రిక‌కు ఉంటుంది.

దుత్తూర ప‌త్రం : దీన్ని ఉమ్మెత్త అని పిలుస్తారు. వంకాయ రంగు పూలు ఉండి, ముళ్ల‌తో కాయ‌లుంటాయి. కాలిన చ‌ర్మానికి, బొబ్బ‌ల‌కు ఈ ఆకు చ‌క్క‌గా ప‌ని చేస్తోంది.

బ‌ద‌రీ ప‌త్రం : దీనికి మ‌రొక పేరు రేగు. రేగు, జిట్రేగు, గంగ‌రేగు అని మూడు ర‌కాలుంటాయి. ద‌గ్గు, గొంతు, జీర్ణ సంబంధ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి.

అపామార్గ ప‌త్రం : దీనిని ఉత్త‌రేణి అంటారు. గుండ్రంగా ఉండే ఆకులు శివునికి ఇష్ట‌మ‌ని చెబుతుంటారు. పాము కాటుకు, గాయాలు న‌యం కావ‌డానికి ఇది ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది.

తుల‌సీ ప‌త్రం : తుల‌సీ ప‌త్రాల‌ను దేవ‌తార్చ‌న‌లో వాడుతారు. వ్యాధి నిరోధ‌క శ‌క్తి పెంపొందించ‌డానికి, ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌ర నియంత్ర‌ణ‌కు ప‌ని చేస్తుంది. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు తుల‌సీ మంచి ఔష‌ధం.

చూత ప‌త్రం : చూత ప‌త్రం అంటే మామిడి ఆకు. హిందూ కుటుంబాల్లో మామిడి ఆకును ప్ర‌తి శుభ‌కార్యంలో వాడుతారు. ర‌క్త విరేచ‌నాలు, చ‌ర్మంపై ద‌ద్దుర్ల‌ను త‌గ్గించ‌డంతో పాటు కీట‌కాల‌ను ఇంట్లోకి రానివ్వ‌కుండా అడ్డుకుంటుంది.

క‌ర‌వీర ప‌త్రం : గ‌న్నేరు అని కూడా పిలుస్తారు. తెలుపు, ప‌సుపు, ఎరుపు రంగుల పూలు ఉంటాయి. పూజ‌లో ఈ పూల‌కు విశిష్ట స్థానం ఉంది. క్యాన్స‌ర్, ఆస్త‌మా నివార‌ణ‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది.

విష్ణుక్రాంత ప‌త్రం : ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క‌. నీలి పువ్వులుండే ర‌కాన్ని విష్ణుక్రాంత అంటారు. జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచ‌డానికి, జుట్టు పెరుగుద‌ల‌కు, జ‌లుబు, ద‌గ్గు, జ్వ‌రం, ఆస్త‌మా, న‌రాల బ‌ల‌హీన‌త నివార‌ణ‌కు ఉప‌యోగప‌డుతుంది.

దాడిమీ ప‌త్రం : దాడిమీ అంటే దానిమ్మ ఆకు. ఈ ఫ‌లం ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. డ‌యేరియా, కంటి జ‌బ్బులు, చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల నివార‌ణ‌కు చ‌క్క‌గా ప‌ని చేస్తుంది.

దేవ‌దారు ప‌త్రం : దేవ‌త‌ల‌కు అత్యంత ఇష్ట‌మైన ఆకు దేవ‌దారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. అజీర్తి నివార‌ణ‌కు, చ‌ర్మ వ్యాధుల నియంత్ర‌ణ‌కు చ‌క్క‌గా ప‌ని చేస్తుంది దేవ‌దారు ఆకు.

మ‌రువ‌క ప‌త్రం : ఈ ప‌త్రాన్ని వాడుక భాష‌లో ధ‌వ‌నం, మ‌రువం అని అంటారు. ఆకులు ఎండినా మంచి సువాస‌న‌ను వెద‌జ‌ల్లుతాయి. జుట్టు రాల‌డం, జీర్ణ సంబంధ స‌మ‌స్య‌ల‌కు నివారిణిగా ప‌ని చేస్తుంది.

సింధువార ప‌త్రం : దీన్ని వాడుక‌లో వావిలి అని పిలుస్తారు. జ్వ‌రం, త‌ల‌నొప్పి, కీళ్ల నొప్పులు, చెవి నొప్పుల నియంత్ర‌ణ‌కు ఉప‌యోగిస్తారు.

ఆర్క ప‌త్రం : ఈ ఆకునే జిల్లేడు ఆకు అంటారు. శివుడి పూజ‌కు తెల్ల జిల్లెడు ఆకుల‌ను వినియోగిస్తారు. చెవి నొప్పి, కాలిన గాయాలు, ద‌గ్గు, దంత సంబంధ స‌మ‌స్య‌ల నివార‌ణ‌లో ఉత్త‌మంగా ప‌ని చేస్తుంది.

జాజి ప‌త్రం : స‌న్న‌జాజి అనే మ‌ల్లిజాతి మొక్క ఇది. ఈ పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు. ఒళ్లు నొప్పులు, మొటిమ‌లు, చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌ల నివార‌ణ దివ్య ఔష‌ధం.

గండ‌కీ ప‌త్రం : దీన్ని దేవ కాంచ‌న అని కూడా పిలుస్తారు. శివుడికి అత్యంత ప్రీతిక‌ర‌మైన ప‌త్రం ఇది. సీతాకోక చిలుక మాదిరి దీని ప‌త్రాలు ఉంటాయి. ద‌గ్గు, ఉద‌ర సంబంధం స‌మ‌స్య‌ల‌ను నివారిస్తుంది.

శ‌మీ ప‌త్రం : జ‌మ్మి చెట్టు ఆకుల‌ను శ‌మీ ఆకులు అంటారు. ద‌స‌రా రోజున ఈ చెట్టుకు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తారు. ఫైల్స్, కుష్ఠు నివార‌ణ‌కు, దంత స‌మ‌స్య‌లకు ఈ ప‌త్రం చ‌క్క‌గా ప‌ని చేస్తుంది.

ఆశ్వ‌త్థ ప‌త్రం : వీటినే రావి ఆకుల‌ని అంటారు. ర‌క్త శుద్ధికి, ఆస్త‌మా స‌హా వివిధ వ్యాధుల‌ను ద‌రిచేర‌కుండా చేసే ఔష‌ధ గుణాలు రావి ఆకుల్లో ఉన్నాయి.

అర్జున ప‌త్రం : మ‌ద్దిచెట్టు ఆకుల‌నే అర్జున ప‌త్రం అంటారు. మ‌ర్రి చెట్టు ఆకుల‌ను పోలి ఉంటాయి. అడవుల్లో ఈ చెట్లు పెరుగుతుంటాయి. ర‌క్త‌పోటు, గుండె సంబంధిత వ్యాధుల‌ను నియంత్రిస్తుంది ఈ ఆకు. శాపం వ‌ల్ల కుబేరుడు ఈ చెట్టులా మారిపోయాడ‌ని అంటారు.

Updated On 17 Sep 2023 12:03 PM GMT
sahasra

sahasra

Next Story