Kurnool | ఓ వ్యక్తి పీకల దాకా మద్యం సేవించి, ఆ మత్తులో దారుణానికి పాల్పడ్డాడు. వేట కొడవలితో తన భార్యతో పాటు, ఆమె తల్లిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో వారిద్దరూ అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన కర్నూల్ జిల్లా పెద్దకడబూరు మండలం జాలవాడిలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. జాలవాడికి చెందిన కురవ నాగరాజు, శాంతి(ఆదోనీకి) 12 ఏండ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే జీవనోపాధి నిమిత్తం నాగరాజు ప్రయివేటుగా విద్యుత్ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో నాగరాజు మద్యానికి బానిసగా మారాడు. నిత్యం తాగొచ్చి, భార్యతో గొడవ పడేవాడు. పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని వేధించేవాడు. భర్త వేధింపులు భరించలేని ఆమె కొద్ది రోజుల క్రితం తన పుట్టింటికి వెళ్లింది. 20 రోజులైనా కూడా భార్య తిరిగి రాకపోవడంతో.. ఇటీవలే నాగరాజు తన అత్తగారింటికి వెళ్లాడు. భార్యను ఒప్పించి ఇంటికి తీసుకొచ్చాడు. మళ్లీ భార్యను వేధించడం మొదలుపెట్టాడు.
అయితే ఇటీవలే శాంతి కుమార్తెకు ఆటలమ్మ సోకింది. దీంతో మనువరాలిని చూసేందుకు శాంతి తల్లి భీమక్క శుక్రవారం జాలవాడికి వచ్చింది. మద్యం సేవించిన నాగరాజు తన భార్యతో గొడవపడ్డాడు. తన బిడ్డను వేధించొద్దని అల్లుడికి భీమక్క సర్దిచెప్పబోయింది. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన నాగరాజు.. ఇంట్లో వేట కొడవలితో శాంతి, భీమక్కపై విచక్షణారహితంగా దాడి చేసి చంపాడు. అమ్మ, అమ్మమ్మను తండ్రి చంపిన దృశ్యాలను చూసి ముగ్గురు పిల్లలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. తమ తండ్రే అమ్మ, అమ్మమ్మను చంపాడని పిల్లలు పోలీసులకు తెలిపారు. పరారీలో ఉన్న నాగరాజును పట్టుకునేందుకు పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు.