హత్య వివ‌రాలు తెలిపిన మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్ రావు విధాత: భర్తను చంపితే ఉన్నభూమి అమ్ముకోవ‌చ్చు.. వితంతువు పెన్షన్ పొందవచ్చన్న దుర్భుద్ధితో ఓ ఇల్లాలు కన్న కొడుకుతో కలిసి కట్టుకున్న భర్తను చంపించిన ఘటన మృగ్యమవుతున్నమానవ విలువలకు నిదర్శనంగా చెప్ప‌వ‌చ్చు. హత్యకు సంబందించిన వివరాలు నల్గొండ జిల్లా హాలియా పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్రావు తెలిపారు. పెద్దవూర మండలం చిన్నగూడెం గ్రామానికి చెందిన మృతుడు దాసరి వెంకటయ్య (55)తన […]

హత్య వివ‌రాలు తెలిపిన మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్ రావు

విధాత: భర్తను చంపితే ఉన్నభూమి అమ్ముకోవ‌చ్చు.. వితంతువు పెన్షన్ పొందవచ్చన్న దుర్భుద్ధితో ఓ ఇల్లాలు కన్న కొడుకుతో కలిసి కట్టుకున్న భర్తను చంపించిన ఘటన మృగ్యమవుతున్నమానవ విలువలకు నిదర్శనంగా చెప్ప‌వ‌చ్చు.

హత్యకు సంబందించిన వివరాలు నల్గొండ జిల్లా హాలియా పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్రావు తెలిపారు. పెద్దవూర మండలం చిన్నగూడెం గ్రామానికి చెందిన మృతుడు దాసరి వెంకటయ్య (55)తన కుటుంబంతో క‌లిసి తన అత్తగారి స్వగ్రామం అనుముల మండలంలోని పులిమామిడిలో గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నాడు.

వెంకటయ్య పేరు మీద ఉన్న ఎకరం భూమిని అమ్మాలని ఆయన భార్య సుగుణమ్మ, కొడుకు కోటేష్ గత కొంతకాలంగా వత్తిడి తీసుకువస్తున్నారు. భూమిని అమ్మేందుకు భర్త వెంకటయ్య ఒప్పుకోకపోవడంతో ఆగ్రహానికి గురైన భార్య సుగుణమ్మ తన భర్తను చంపితే ఎకరం భూమితో పాటు ప్రభుత్వం నుంచి నెలనెల వితంతువు పెన్షన్ కూడా వస్తుందని కొడుకు కోటేష్ తో కలిసి భర్త హత్యకు పథకం వేసింది.

భర్తను హత్య చేసేందుకు సుగుణమ్మ, కోటేష్ కు ధైర్యం సరిపోకపోవడంతో మారేపల్లి గ్రామావాసి అనుముల మహేష్ అనే కారు డ్రైవర్‌ని కలిసి తన భర్తను చంపాలని కోరారు. తనకు లక్ష రూపాయలు ఇస్తే చంపుతాన‌ని ఒప్పుకుని వారితో అగ్రిమెంట్ రాసుకున్నాడు. అగ్రిమెంట్ లో భాగంగా అదే రోజు మొదటగా రూ.15 వేలను అడ్వాన్స్ గా ఇచ్చారు.

ఈనెల 14 న తల్లి కొడుకు కలిసి వెంకటయ్యను హతమార్చాలని నిర్ణయించుకుని అనుముల మహేష్ కు ఫోన్ చేసి కారు తీసుకుని అనుముల స్టేజ్ దగ్గరకు రమ్మని చెప్పారు. వెంటనే మహేష్ కారును తీసుకుని పులిమామిడి గ్రామానికి వచ్చి కొడుకు కోటేష్, వెంకటయ్యను తన కారులో ఎక్కించుకుని పులిమామిడి నుండి మారేపల్లి వైపు బయలుదేరారు.

భార్య సుగుణమ్మ, మహేష్, కోటేష్ కు ఫోన్ లో ఇస్తున్న సూచనల ప్రకారం వరదకాలువ కట్ట పై కారు ఆపి వెంకటయ్యకు మద్యం తాగించారు. మద్యం మత్తులో ఉన్నఅతనకి టవల్ ను మెడకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపారు. మద్యం సేవించి చనిపోయినట్లుగా చిత్రీకరించటానికి కారులో తీసుకు వచ్చి హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అనుముల గ్రామం నుంచి చిన్న అనుముల గ్రామానికి వెళ్లే దారిలో మృతదేహాన్ని పడవేశారు.

ఆ తరువాత వెంకటయ్య వంటిపై గల పంచే, అతన్ని చంపడానికి ఉపయోగించిన టవల్ ను మహేష్, కోటేష్ తమ వెంట తీసుకెళ్లి సుగుణమ్మకు ఇచ్చి సాక్షాలను రూపుమాపడానికి ప్రయత్నించారు. కాగా ఈనెల 15న మృత‌దేహాన్ని చేసిన అనుముల వీఆర్ఏ సైదులు హాలియా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన హాలియా సీఐ బి.సురేష్ కుమార్‌, ఎస్ ఐ డి. క్రాంతి కుమార్ వెంకటయ్య విచారణ చేపట్టారు.

పోలీసులు హత్య సంఘటనపై వెంటనే మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలానికి వచ్చారు. అక్కడ భార్య సుగుణమ్మ, కొడుకు కోటేష్ వ్యవహరించిన ప్రవర్తనపై అనుమానం వచ్చింది. పోలీసులు వారి ఫోన్ కాల్ డాటా ఆధారంగా మృతుని భార్య సుగుణమ్మ, కొడుకు కొటేష్ ను విచారించారు. చిన్నగూడెంలో వెంకటయ్య పేరున ఉన్న ఎకరం భూమిని అమ్మమని ఎంత చెప్పినా వినడం లేదని, అతన్ని హత్య చేస్తే ఎకరం భూమిని అమ్ముకోవచ్చని అదేవిధంగా వితంతువు పెన్షన్ కూడా వస్తుందని పథకం వేసి మహేష్ అనే వ్యక్తితో కలిసి తామే చంపించామని సుగుణమ్మ, కొడుకు కోటేష్ ఒప్పుకున్నారు.

హత్య కేసులోని ముగ్గురు హంతకులు కారులో పులిమామిడికి వెళ్ల‌డానికి నల్ల‌గొండ నుండి వస్తున్నారనే సమాచారం తో పులిమామిడి స్టేజ్ వద్ద వాహనాల తనిఖీ చేప‌ట్టారు. నిందితులు దాసరి సుగుణమ్మ, దాసరి కోటేష్, అనుముల మహేష్ అరెస్టు చేసి సోమవారం రిమాండ్ కు పంపారు. నిందితుల నుంచి పోలీసులు స్విఫ్ట్ కారు, పల్సర్ బైక్, 3 సెల్ ఫోన్స్, చంపడానికి ఉపయోగించిన టవల్, మృతుని పంచే, చెప్పులు, రూ.5 వేలు సుపారీ డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసు పరిశోధనలో కృషి చేసిన హాలియా, సాగర్ సీఐలు బి. సురేష్ కుమార్, కె. నాగరాజు, హాలియా ఎస్ ఐ డి, క్రాంతికుమార్, సిబ్బందిని మిర్యాలగూడ డీఎస్పీ అభినందిచారు

Updated On 21 Nov 2022 4:45 PM GMT
krs

krs

Next Story