Wife Victim’s | గృహహింస చట్టంలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నాటక బెంగళూరులో భార్యాబాధితుల సంఘం ఆందోళన నిర్వహించింది. అత్తింటివారి వేధింపుల నుంచి రక్షించేందుకు తీసుకువచ్చిన గృహ హింస చట్టం దుర్వినియోగం అవుతోందని ఆరోపించారు.
ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని కొందరు భార్యలు భర్తతో పాటు అత్తింటి వారిని వేధిస్తున్నారంటూ రోడ్డుకెక్కారు. చట్టంలో పలు సవరణలు చేయాలని డిమాండ్ చేశారు. సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థతో కలిసి భార్యా బాధితుల సంఘం సభ్యులు ఆదివారం దీక్ష చేపట్టారు.
ప్రభుత్వం స్పందించి గృహహింస చట్టంలో మార్పులు చేసి దుర్వినియోగం కాకుండా చూడాలని, లేదంటే ఆందోళనకు కొనసాగిస్తామని హెచ్చరించారు. చట్టంలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని మహిళలు కొందరు విదేశాల్లో ఉంటున్న భర్త తరఫు కుటుంబీకులను వేధిస్తున్నారని ఆరోపించారు.
ఎన్నారైలకు సంబంధించిన కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విడాకులు తీసుకున్న సమయంలో వారి సంతానం ఇద్దరి వద్దా ఉండేలా చట్టాలను సవరించాలని డిమాండ్ చేశారు. తప్పుడు కేసులతో వేధించిన మహిళలకు శిక్ష విధించడంతో పాటు వృద్ధులైన అత్తామామలపై కోడళ్లు పెట్టిన కేసులు రద్దు చేయాలన్నారు.
విడాకులు తీసుకున్న భార్య ధనవంతురాలైతే ఆమెకు భరణం ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలన్నారు. భార్య, అత్తింటి నుంచి వస్తున్న వేధింపులు తాళలేక పలువురు పురుషులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని భార్యా బాధితుల సంఘం సభ్యులు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. గృహహింస కేసులో గతేడాది మద్రాస్ హైకోర్టు పురుషులు కూడా హింసకు గురవుతారా? అనే ప్రశ్నను లేవనెత్తిన విషయం తెలిసిందే. ఇందుకు హర్యాణాలోని హిసార్‌కు చెందిన ఒక వ్యక్తి కేసును ప్రస్తావించింది. భార్య చిత్రహింసలు కారణంగా 21 కిలోల బరువు తగ్గడంతో.. దీని ఆధారంగా హైకోర్టులో విడాకులకు ఆమోదం తెలుపడం అప్పట్లో సంచలనంగా నిలిచింది.