- పాలేరు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ‘ మే’ డే వేడుకల్లో వైఎస్ షర్మిల
విధాత: వైఎస్‌ఆర్ బిడ్డ పాలేరులోనే పోటీ చేస్తుందని, ఎవరికి ఎలాంటి అపోహలు అవసరం లేదని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) స్పష్టం చేశారు. సోమవారం పాలేరులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మే డే వేడుకల్లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్మికులకు సలాం చెప్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయన్నారు. కేసీఅర్ కార్మికులను పురుగుల్లా చూస్తున్నారని ఆమె ఆరోపించారు.
కార్మికులను కేసీఆర్ ఎడమ కాలు చెప్పు కింద తొక్కి పెట్టారన్నారు. రాష్ట్రంలో కార్మికులకు ఎటువంటి హక్కులు లేకుండా చేశారన్నారు. ఆర్టీసీ కార్మికులు హక్కుల కోసం పోరాటం చేస్తే కనీసం గౌరవం కూడా ఇవ్వలేదన్నారు. ఆర్టీసీలో సంగమే లేకుండా చేశారని తెలిపారు. విద్యుత్ శాఖలో కార్మికులు సమ్మె చేస్తే తొక్కి పెట్టారన్నారు. కార్మికులను భయ బ్రాంతులకు గురి చేసి సమ్మెను విచ్ఛిన్నం చేశారన్నారు. కేసీఆర్ రాష్ట్రంలో కార్మిక సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేశాడని ఆమె ఆరోపించారు.
నా తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కార్మిక పక్షపాతి. ఆయన బిడ్డగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లటం నా కర్తవ్యం. YSR తెలంగాణ పార్టీ కార్మికుల పక్షాన పోరాడుతుందని, వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తామని మాటిస్తున్నా.మే డే సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు. pic.twitter.com/aCSFwsd1XN
— YS Sharmila (@realyssharmila) May 1, 2023
కేసీఅర్ వద్ద కార్మికులు బానిసలా బ్రతకాలా..? అని షర్మిల ప్రశ్నించారు. కనీసం వేతనాలు కూడా తెలంగాణ లో అమలు కావడం లేదని ఆరోపించారు. కార్మిక చట్టాల ప్రకారం రూ. 26 వేలు కనీస వేతనం ఉండాలి కానీ తెలంగాణలో రూ. 10 వేలు కూడా లేదన్నారు. 8 గంటల పని విధానం కూడా అమలు కావడం లేదన్నారు. రాష్ట్రంలో లక్ష మంది కాంట్రాక్ట్ బేసిక్ మీద పని చేస్తున్నారని షర్మిల తెలిపారు.
ఇందులో 5 వేల మందిని మాత్రమే రెగ్యులర్ చేస్తే మిగతా కాంట్రాక్ట్ కార్మికులు ఏమవ్వాలన్నారు. ఇక కేంద్రం అమలు చేస్తున్న నిర్ణయాలు కూడా సరైనవి కావని, ఉపాధి హామీ పథకం కింద గొడ్డు చాకిరీ చేయించి కేవలం 40 రూపాయలు ఇస్తారా..? అని అడిగారు. దేశంలో కార్మికుడు లేకపోతే మెతుకు లేదని, ఇంటికి వెలుగు లేదని అన్నారు. దేశం పురోగతికి కార్మికులు అవసరమన్నారు.