మోదీ ప్రాభవ మంతా గతమేనా.. పన్నెండు రాష్ట్రాల్లో గెలిచింది ఐదింటిలోనే.. 1.65 కోట్ల ఓట్లు కోల్పోయిన బీజేపీ.. 2019తో పోలిస్తే… 10శాతం కోల్పోయిన బీజేపీ ఎన్నికల వేళ.. భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లుదండుకొనే యత్నం  ఓట్ల కోసం ఉసిగొల్పే రాజకీయం అన్ని వేళలా పనికిరాదు..! (విధాత ప్రతినిధి, హైదరాబాద్): నరేంద్రమోదీ మళ్లీ గెలుస్తాడా?.. దేశంలో ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇది. నరేంద్రమోదీ మళ్లీ గెలవాలని కోరుకునే వారు ఒక విధంగా, మళ్లీ రావద్దు దేవుడా అని కోరుకునే […]

  • మోదీ ప్రాభవ మంతా గతమేనా..
  • పన్నెండు రాష్ట్రాల్లో గెలిచింది ఐదింటిలోనే..
  • 1.65 కోట్ల ఓట్లు కోల్పోయిన బీజేపీ..
  • 2019తో పోలిస్తే… 10శాతం కోల్పోయిన బీజేపీ
  • ఎన్నికల వేళ.. భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లుదండుకొనే యత్నం
  • ఓట్ల కోసం ఉసిగొల్పే రాజకీయం అన్ని వేళలా పనికిరాదు..!

(విధాత ప్రతినిధి, హైదరాబాద్): నరేంద్రమోదీ మళ్లీ గెలుస్తాడా?.. దేశంలో ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇది. నరేంద్రమోదీ మళ్లీ గెలవాలని కోరుకునే వారు ఒక విధంగా, మళ్లీ రావద్దు దేవుడా అని కోరుకునే వారు ఇంకోవిధంగా.. ఈ అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే వాస్తవ పరిస్థితి ఏమిటి? గత ఐదేళ్లలో ఏమి జరిగింది? వచ్చే ఎన్నికల్లో ఏమి జరుగబోతున్నది? నరేంద్రమోదీ ప్రభ, ప్రాభవం 2019 ఎన్నికల్లో అసాధారణంగా పనిచేసింది. ఆయన రాజకీయ సోపానంలో 2019 ఎన్నికలే ఉచ్ఛదశ. నరేంద్ర మోదీ నాయకత్వంలో పదకొండు రాష్ట్రాలలో 80 నుంచి 100 శాతం లోకసభ స్థానాలను గెల్చుకున్నారు.

ఢిల్లీ, హర్యానా, గుజరాత్, ఉత్తరాఖండ్, హిమాచలప్రదేశ్‌లలో వందశాతం లోకసభ (మొత్తం 52) స్థానాలను; మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, కర్నాటకలలో 90 శాతానికిపైగా లోకసభ(మొత్తం 77) స్థానాలను బీజేపీ గెలిచింది. ఉత్తరప్రదేశ్, చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌లలో 80 శాతానికి పైగా లోకసభ (మొత్తం 90) స్థానాలను గెల్చుకున్నది. మహారాష్ట్ర, బీహార్‌లలో మిత్రపక్షాలతో కలసి 80 శాతం(40) స్థానాలను గెల్చుకుంది. ఇలా బీజేపీ గెలిచిన మొత్తం 302 స్థానాలలో ఈ రాష్ట్రాలన్నింటిలో కలిపి గెలిచిన స్థానాలు 251. ఇది గత ఎన్నికలలో మోదీ ప్రాభవం.

1.65 కోట్ల ఓట్లు కోల్పోయిన బీజేపీ..

మూడున్నర సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ ప్రభ ఉన్నదా లేదా అన్నది పరిశీలించవలసి ఉంది. 2019 లోకసభ ఎన్నికల తర్వాత ఉత్తరప్రదేశ్‌తో సహా పన్నెండు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఢిల్లీలో ఆప్ గెలిచింది. బీహార్‌లో బొటాబొటి మెజారిటీతో బీజేపీ జేడీయూ కూటమి గెలిచినా ఆ తర్వాత లెక్కలు మారిపోయాయి. ఆర్జేడీ, జేడీయూ జతకట్టి బీజేపీని ప్రభుత్వం నుంచి తప్పించాయి. జార్ఖండ్‌లో జేఎంఎం- కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి.

మహారాష్ట్రలో శివసేన-బీజేపీ కలిసి గెలిచినా గొడవ పడి విడిపోయాయి. బెంగాల్‌లో బీజేపీ పోరాడినా ఫలితం లేకపోయింది. ఉత్తరప్రదేశ్, హర్యానా, అస్సాం, గుజరాత్, గోవా రాష్ట్రాలను బీజేపీ నిలబెట్టుకుంది. హిమాచలప్రదేశ్‌లో కాంగ్రెస్ పోరాడి గెలిచింది. పంజాబ్‌లో ఆప్ గెలిచింది. నరేంద్రమోదీ, అమిత్ షాలు తమ ప్రతిష్ఠనంతా పణంగా పెట్టి భూమీ ఆకాశాలను ఏకం చేసినా, పన్నెండు రాష్ర్టాల్లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టగలిగింది ఐదు రాష్ట్రాలలోనే.

ఈ రాష్ట్రాలలో బీజేపీ పలుకుబడి గణనీయంగా తగ్గింది. ఈ పన్నెండు రాష్ట్రాలలో 2019 లోకసభ ఎన్నికలలో బీజేపీకి వచ్చిన ఓట్లతో పోల్చితే బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా పడిపోయింది. ఈ పన్నెండు రాష్ట్రాలలో 2019లో 13.9 కోట్ల ఓట్లు రాగా, అసెంబ్లీ ఎన్నికలలో 12.27 కోట్ల ఓట్లు మాత్రమే వచ్చాయి. సుమారు కోటీ 65 లక్షల ఓట్లు తగ్గిపోయాయి. పన్నెండు రాష్ట్రాలలో లోకసభ ఓట్ల శాతం 44.9 కాగా, అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన ఓట్ల శాతం 33.4 కి పడిపోయింది. సుమారు పది శాతం ఓట్లు తగ్గాయి.

మోదీ వైభవమంతా.. గతమేనా?

ఈ గణాంకాలను బట్టి చూస్తే అర్థమయ్యేది ఏమంటే… నరేంద్రమోదీ ప్రాభవం మసకబారుతున్నది. ఆయన ఇంకా మరో ఉచ్ఛస్థితికి ఎగబాకే అవకాశాలు తగ్గిపోయాయి. అయితే రానున్న ఏడాదికాలంలో మరోసారి భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి బీజేపీ ప్రభుత్వం చేసే విన్యాసాలను పక్కనబెడితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీజేపీకి 200 స్థానాలకు మించి గెలిచే అవకాశాలు కనిపించడం లేదు.

అప్పటికీ బీజేపీయే ఏకైక పెద్దపార్టీగా ఆవిర్భవించడం, చిన్నాచితక పార్టీలను ఏకం చేసి మళ్లీ ఎన్డీఏను పునరుద్ధరించి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించడం జరుగుతున్నది. అందుకే బీజేపీ ఇప్పుడు కొత్త రాష్ట్రాలపై కన్నేసి దున్నే ప్రయత్నం చేస్తున్నది. కాగా ఇవేవీ ఫలించే అవకాశాలు కనిపించడం లేదు.

కొత్తొక వింత పాతొక రోతలాగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీవైపు కొన్ని శక్తులు ఊగుతున్నాయి. అయితే ఆ ఊపు బీజేపీని గెలిపించే అవకాశం లేదు. బీజేపీకి నాయకత్వం వహిస్తున్న వారెవరికీ కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలను ఢీకొట్టే శక్తి సామర్థ్యాలు లేవు. మిగిలిన రాష్ర్టాలలో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.

ఓట్ల ఆయుధం కోసం బీజేపీ వెతుకులాట..

ఇక మిగిలింది మరోసారి భావోద్వేగాలను రెచ్చగొట్టడం. అందుకు అయోధ్య రామాలయాన్ని పూర్తి చేసి దేశవ్యాప్తంగా యాత్రలు చేస్తారని, ఉమ్మడి పౌర చట్టం తీసుకువస్తారని, ఆక్రమిత కశ్మీర్‌ కోసం పాకిస్థాన్‌ తో పరిమిత యుద్ధం చేస్తారని ఇంకా ఇలాంటి అనేక అంశాలు ముందుకు తెచ్చి భావోద్వేగాలు పెంచుతారని, బీజేపీతోనే దేశానికి రక్ష అన్న భావనను కలిగించేందుకు ప్రయత్నిస్తారని ప్రచారం జరుగుతున్నది.

భావోద్వేగాలు ఎల్లకాలం ఆయుధంగా పనిచేస్తాయా..?

అయితే గత ఎనిమిదిన్నరేండ్లలో అనేక భావోద్వేగాలను చవిచూసిన దేశ ప్రజలు మరోసారి భావోద్వేగాల వలలో పడతారా అన్నది కూడా సందేహాస్పదం. మోదీ ప్రసంగాలు, ఆయన విధానాలపై మూడేళ్ల క్రితం ఉన్న ఆదరణ అభిమానం ఇప్పుడు లేవు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకత అన్నది ఇప్పుడు బీజేపీకి గుదిబండగా మారుతున్నది.

రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకతను బాగా వ్యాప్తి చేయడం ద్వారా తమ ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకతను అధిగమించడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఈ నేపథ్యంలో.. రానున్న కాలం మోదీకి గడ్డుకాలమే అనక తప్పదు. అందుకే మోదీకి ముందున్నది ముసుళ్ల పండుగే. అంటే కష్టాల కడలే.., ఓటమి పరాభవాలే.

Updated On 27 Dec 2022 4:45 PM GMT
krs

krs

Next Story