ఐదో రోజుకు చేరిన అన్నదాతల పాదయాత్ర నాసిక్‌ నుంచి ముంబైకి బయల్దేరిన రైతులు ఉల్లి ధర, ఇతర సమస్యలపై సీపీఎం సమరభేరి Maharashtra Farmers March On | తెగిన చెప్పులు.. తారు రోడ్డుపై నలిగి పోతున్న పాదాలు.. నెత్తుటి ముద్రలు వేస్తున్న అడగులు! ఇది మహారాష్ట్ర రైతుల మహా పాదయాత్రలో దృశ్యాలు! ఉల్లిగడ్డలకు కనీస ధర దక్కని ఆగ్రహం, ఎన్ని ప్రభుత్వాలు మారినా తీరని కడగండ్లపై వినిపిస్తున్న సమరశంఖం! నాసిక్‌ నుంచి మహారాష్ట్ర వరకు.. అన్నదాతలు […]

  • ఐదో రోజుకు చేరిన అన్నదాతల పాదయాత్ర
  • నాసిక్‌ నుంచి ముంబైకి బయల్దేరిన రైతులు
  • ఉల్లి ధర, ఇతర సమస్యలపై సీపీఎం సమరభేరి

Maharashtra Farmers March On | తెగిన చెప్పులు.. తారు రోడ్డుపై నలిగి పోతున్న పాదాలు.. నెత్తుటి ముద్రలు వేస్తున్న అడగులు! ఇది మహారాష్ట్ర రైతుల మహా పాదయాత్రలో దృశ్యాలు! ఉల్లిగడ్డలకు కనీస ధర దక్కని ఆగ్రహం, ఎన్ని ప్రభుత్వాలు మారినా తీరని కడగండ్లపై వినిపిస్తున్న సమరశంఖం! నాసిక్‌ నుంచి మహారాష్ట్ర వరకు.. అన్నదాతలు నడిచొస్తున్నారు! అనేక అడ్డంకులు ఎదురైనా.. ముంబై చేరుకుని.. తమ నిరసన గళం వినిపించాలన్న ఏకైక లక్ష్యం వారిని ముందుకు నడిపిస్తున్నది.

విధాత: ఉల్లిగడ్డలకు కనీసం గిట్టుబాటు ధర (relief to onion growers), ఇతర సమస్యల పరిష్కారం కోసం మహారాష్ట్ర అన్నదాతలు (Maharashtra Farmers) చేపట్టిన మహాపాద యాత్ర 5వ రోజుకు చేరుకున్నది. కాళ్లు బొబ్బలు కడుతున్నా.. చెప్పులు తెగిపోయి.. పాదాలు రక్తం కారుతున్నా వారి సంకల్పం చెదిరిపోవటం లేదు.

నాసిక్‌ నుంచి దాదాపు 200 కిలోమీటర్లు ప్రయాణించి ముంబై చేరుకుని తమ గోడును వెళ్లబోసుకునేందుకు వారు నడుస్తున్నారు. కాస్తంత విశ్రాంతి తీసుకునేందుకు ఆగుతారా? అని ఒక మహిళా రైతును ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తే.. ‘లేదు.. మా డిమాండ్ల సాధన కోసం మేం నడుస్తూనే ఉంటాం’ అని ఆమె తేల్చి చెప్పారు.

అలసిపోయి. సొమ్మసిల్లినా.. ఆగని యాత్ర

దారి మధ్యలో నడవలేక అస్వస్థతకు గురైనవారిని అంబులెన్సులు హాస్పిటళ్లకు తరలించాయి. ఇలా అస్వస్థతకు గురై హాస్పటల్‌కు వెళుతున్న ఒక రైతును పలకరిస్తే.. ఆయన ఒక్కసారిగా భోరుమన్నారు. తనకు ఆరోగ్యం బాగోలేదని, తన చెప్పులు తెగిపోవడంతో కాళ్లు విపరీతమైన నొప్పి పెడుతున్నాయని ఆయన విలపించారు. చేతిలో కొద్దిపాటి సొమ్ము ఉన్నా.. రహదారి మీదుగా వస్తున్న కారణంగా ఆయన చెప్పులు కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు. మరికొంత మంది బాగా అలిసిపోయామని, సొమ్మసిల్లి పడిపోతున్నామని చెప్పారు.

సీపీఎం నాయకత్వంలో పాదయాత్ర

ఈ మహా పాదయాత్రకు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్ట్‌) (Communist Party of India-CPIM) నాయకత్వం వహిస్తున్నది. ఈ యాత్రలో వందల మంది రైతులు పాల్గొంటున్నారు. అసంఘటిత రంగానికి చెందినవారు, గిరిజన తెగలకు చెందినవారు కూడా ఈ యాత్రలో భాగస్వాములవుతున్నారు.
ఉల్లి రైతులను ఆదుకోవాలని, క్వింటా ఉల్లిగడ్డలకు కనీసం 600 చెల్లించాలని రైతులు ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు.

ఇటీవల ఒక రైతుకు క్వింటా ఉల్లిగడ్డకు ఐదు రూపాయలు లభించిన విషయం తెలిసిందే. ధరలు పడిపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనలో పాల్గొంటున్న పలువురు గిరిజన రైతులు.. తమకు భూమి హక్కులు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. వ్యవసాయ రుణాలు రద్దు చేయాలని, వ్యవసాయానికి 12 గంటలపాటు విద్యుత్తు సరఫరా చేయాలని కూడా వారు కోరుతున్నారు.

ప్రభుత్వంలో కదలిక

రైతుల మహా పాదయాత్ర ఐదో రోజుకు చేరుకున్న తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. పాదయాత్రలో ఉన్న రైతులను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే (Chief Minister Eknath Shinde), ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ (Devendra Fadnavis), ఇతర మంత్రులు కలుసుకోనున్నారు. పాదయాత్ర ఠాణె చేరుకున్న తర్వాత బుధవారం రాత్రి ఇద్దరు మంత్రులు దాదా భూసే, అతుల్‌ సావే కలుసుకుని చర్చలు జరిపారు.

2018లోనూ మహాయాత్ర

మహారాష్ట్ర రైతులు 2018లో ఒకసారి ఇదే తరహాలో సీపీఎం(CPI (M)), ఆలిండియా కిసాన్‌ సభ (Kisan Sabha) నాయకత్వంలో మహాపాదయాత్ర చేపట్టారు. ఆ యాత్రకు దారి పొడవునా ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. అప్పట్లో ఈ యాత్ర దేశంలో సంచలనం సృష్టించింది. రైతు రుణమాఫీ చేయాలని, గిరిజనులకు పోడు హక్కులు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ యాత్ర సాగింది. అయితే.. అప్పటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ఆ డిమాండ్లను ఆమోదించడంతో రైతులు తమ నిరసనను విరమించారు.

Updated On 16 March 2023 1:28 PM GMT
Somu

Somu

Next Story