విధాత: మెగాస్టార్ చిరంజీవి తన స్వయంకృషితో సోలోగా ఎవరి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఎలా ఎదిగాడో.. ఆయన తర్వాత అదే తరహాలో కష్టపడి, గాడ్‌ఫాదర్ అంటూ లేకుండా రవితేజ ఒక్కో మెట్టు ఎక్కుతూ మాస్ మహారాజా అయ్యాడు. ఇద్దరి జీవితాలలో చాలా సారూప్యతలు కనిపిస్తాయి. హీరోగా ఒక స్థాయికి వచ్చిన తర్వాత హిట్స్ ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా రవితేజ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఇక రవితేజకు మొదట అవకాశాలు ఇచ్చింది కృష్ణవంశీ అయితే రవితేజను హీరోగా మార్చి ఆయనకంటూ ఓ పంథాను ఏర్పరచిన దర్శకుడు పూరీ జగన్నాథ్.
కెరీర్ ప్రారంభంలో ఆయన నేటి స్టార్ హీరోలందరి చిత్రాలలో చిన్న చిన్నపాత్రలు పోషించాడు. మెగాస్టార్ నటించిన ‘అన్నయ్య’ మూవీతో పాటు నాగార్జున నుంచి జగపతిబాబు వరకు అందరి చిత్రాలలో వేషాలు వేశాడు. కానీ తనకంటూ ఓ గుర్తింపు వచ్చిన తర్వాత ఆయన తనను హీరోగా నిలబెట్టిన పూరీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన ‘సూపర్’ మూవీలో సోనూసూద్ చేసిన పాత్రను చేయమని అడిగితే నో చెప్పాడని వార్తలు వచ్చాయి.
ఇక విషయానికి వస్తే ఆల్రెడీ దర్శకుడు బాబి తన డైరెక్టోరియల్ ఫిల్మ్‌గా రవితేజతో ‘పవర్’ చిత్రం చేశాడు. ఆ మూవీని రవితేజకు తగ్గట్లుగా తీసి మెప్పించాడు. ప్రస్తుతం బాబి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేర్ వీరయ్య’లో రవితేజ పవర్ఫుల్ రోల్ చేస్తున్నాడు. చిరు, రవితేజలిద్దరికీ మాస్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. దాంతో వారిద్దరు కలిస్తే థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు వస్తాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక ఈమూవీలో నటించమని స్వయంగా తను అడగడంతో రవితేజ నటించాడని చిరు స్వయంగా తెలిపాడు.
ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ముందు జరిగిన ప్రెస్మీట్లో చిరు రవితేజ గురించే గాక సినిమా గురించి ఇతర నటీనటులు, దర్శకుల గురించి మాట్లాడారు. సమయాభావం వల్లనో, సినిమా గురించి, అందులో నటించిన వారి గురించి, దానికి పనిచేసిన టెక్నీషియన్ల గురించి.. ఇలా అందరి గురించి మాట్లాడటం వల్ల కాబోలు చిరు రవితేజ గురించి కూడా రెండు మూడు ముక్కల్లో చెప్పాడు. దాంతో రవితేజ గురించి తాను తక్కువగా మాట్లాడాననే లోటుని గుర్తించిన చిరు తాజాగా ట్విట్టర్లో రవితేజ గురించి గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు.
#WaltairVeerayyaPressMeet pic.twitter.com/M0dUgJvk2G
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 27, 2022
వాల్తేరు వీరయ్య సినిమా కోసం మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో టీం మొత్తం తమ అనుభవాలను పంచుకోవడం చాలా చక్కగా అనిపించింది. అయితే నాలో ఎక్కడో తెలియని అసంతృప్తి నెలకొంది. ఈ చిత్రానికి అత్యంత కీలకమైన వ్యక్తి, వీరయ్యకి ఆప్తుడు, నా తమ్ముడు రవితేజ గురించి ఎందుకో తక్కువగా మాట్లాడాను అని నా మనసుకు అనిపించింది.
ప్రీరిలీజ్ ఈవెంట్‌ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడటం వల్ల నా తమ్ముడు రవితేజ గురించి సరిగా మాట్లాడే అవకాశం రాలేదు. అందుకే ఈ ట్వీట్ చేస్తున్నాను. నేను అడగగానే వెంటనే రవితేజ ఒప్పుకోవడం, అతనితో కలిసి మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నటించడం నాకు ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపించింది.
ఒకవేళ రవితేజ ఈ సినిమా ఒప్పుకోకపోయి ఉంటే వాల్తేరు వీరయ్య చిత్రం అసంపూర్ణంగానే ఉండేది. డైరెక్టర్ బాబి.. రవితేజ పాత్రని అద్భుతంగా తీర్చిదిద్దాడు. అతను మొదటి నుండి చెప్తూ వస్తున్న పూనకాలు లోడింగ్‌లో రవితేజ పాత్ర చాలా కీలకం. ఆ విషయాలు మనం త్వరలో మాట్లాడుకుందాం…. అంటూ చిరంజీవి చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.