Chhattisgarh | మాట్లాడటం మానేసిందని.. ఓ అమ్మాయి పట్ల క్రూర మృగంలా ప్రవర్తించాడు. ఆమె ముఖంపై దిండు పెట్టి.. స్క్రూడ్రైవర్‌తో 51 సార్లు పొడిచి చంపాడు. ఈ దారుణ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కోర్బా జిల్లాకు చెందిన ఓ యువతి(20)తో జశ్పూర్ జిల్లా యువకుడితో మూడేండ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అయితే ఆ యువకుడు గతంలో కండక్టర్‌గా పని చేశాడు. అదే బస్సులో ప్రతి రోజు యువతి తన పనులకు వెళ్లి వచ్చేది. దాంతో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడటం, ఒకరికొకరు ఫోన్లో మాట్లాడుకోవడం జరిగింది. బస్సు కండక్టర్ జాబ్ వదిలేసి, ఇటీవలే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు ఆ యువకుడు వెళ్లిపోయాడు.
అయితే గత కొద్ది రోజుల నుంచి అతను ఫోన్ చేసినప్పటికీ, ఆమె మాట్లాడటానికి ఇష్టపడేది కాదు. ఫోన్ లిఫ్ట్ చేయడం కూడా మానేసింది. మాట్లాడటం మానేసిందని ఆమెను వేధింపులకు గురి చేశాడు. యువతి తల్లిదండ్రులను కూడా బెదిరించాడు. దీంతో డిసెంబర్ 24వ తేదీన నేరుగా ఆమె ఇంటికి చేరుకున్నాడు ఆ యువవకుడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో.. ఆమె ముఖంపై దిండు పెట్టి అరవకుండా చేశాడు. అనంతరం స్క్రూడ్రైవర్ తీసుకొని ముఖం, ఛాతీపై 51 సార్లు పొడిచి చంపాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడ్నుంచి పారిపోయాడు. సోదరుడు ఇంటికి వచ్చేసరికి సోదరి రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పట్టుకునేందుకు నాలుగు బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు.