Uttar Pradesh | ఓ వృద్ధురాలు చనిపోయిందని డాక్టర్లు ధృవీకరించారు. ఇక ఆ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు ఖననానికి ఏర్పాట్లు చేశారు. డెడ్‌బాడీని శ్మశాన వాటికకు తీసుకెళ్తుండగా, వృద్ధురాలు మధ్యలోనే కళ్లు తెరిచింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఫిరోజాబాద్ జిల్లా బిలాస్పూర్ గ్రామానికి చెందిన హరిభేజి(81) గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో డిసెంబర్ 23న ఆస్పత్రిలో చేర్పించారు. అయితే వృద్ధురాలు బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు వైద్యులు తెలిపారు.
దీంతో 24వ తేదీన డెడ్‌బాడీని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొచ్చారు. ఇక ఖననానికి ఏర్పాట్లు చేసి, శ్మశాన వాటికకు తీసుకెళ్తుండగా, మార్గమధ్యలో వృద్ధురాలు కళ్లు తెరిచింది. దీంతో శ్మశానానికి తీసుకెళ్లకుండా, తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. ఒక రోజంతా బాగానే ఉన్న వృద్ధురాలు మర్నాడే మరణించింది.