Women Reservation Bill ఎట్ట‌కేల‌కు మ‌హిళా రిజర్వేషన్‌ బిల్లు పార్ల‌మెంటు, అసెంబ్లీల‌కు కొత్త క‌ళ‌ తెలుగు రాష్ట్రాల్లోరాజ‌కీయ మార్పులు విధాత: భార‌త‌దేశ రాజ‌కీయాల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్‌. దాదాపు మూడు ద‌శాబ్దాల క‌ల‌. 2010లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదించబడింది. అది ఇప్పటికీ లోక్‌స‌భ‌లో ఆమోదం పొంద‌లేదు. ఈ ప‌నిని ఎట్ట‌కేల‌కు మోడీ ప్ర‌భుత్వం మొద‌లుపెట్టింది. కేంద్ర క్యాబినేట్ ఆమోదం పొందిన మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును పార్ల‌మెంటు […]

Women Reservation Bill

  • ఎట్ట‌కేల‌కు మ‌హిళా రిజర్వేషన్‌ బిల్లు
  • పార్ల‌మెంటు, అసెంబ్లీల‌కు కొత్త క‌ళ‌
  • తెలుగు రాష్ట్రాల్లోరాజ‌కీయ మార్పులు

విధాత: భార‌త‌దేశ రాజ‌కీయాల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్‌. దాదాపు మూడు ద‌శాబ్దాల క‌ల‌. 2010లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదించబడింది. అది ఇప్పటికీ లోక్‌స‌భ‌లో ఆమోదం పొంద‌లేదు. ఈ ప‌నిని ఎట్ట‌కేల‌కు మోడీ ప్ర‌భుత్వం మొద‌లుపెట్టింది. కేంద్ర క్యాబినేట్ ఆమోదం పొందిన మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును పార్ల‌మెంటు ప్ర‌త్యేక స‌మావేశాల్లో, నూత‌న పార్ల‌మెంటు భ‌వ‌నంలో, తొలి బిల్లుగా ఆమోదించ‌డం చారిత్ర‌క ప‌రిణామంగా చెప్పొచ్చు. ఈ బిల్లు ప్ర‌కారం ఇక‌పై చట్టసభల్లో (పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలు) మహిళలకు 33 శాతం రిజర్వేషన్ లభిస్తుంది.

ఏమిటీ మహిళా రిజర్వేషన్ బిల్లు ?

మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే… లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లోని మొత్తం సీట్లలో 33 శాతం లేదా మూడింట ఒక వంతు మహిళలకు రిజర్వ్ చేయాలని ప్రతిపాదిస్తుంది. 33 శాతం కోటాలో ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలు, ఆంగ్లో-ఇండియన్ల సబ్ రిజర్వేషన్లను కూడా ఈ బిల్లు ప్రతిపాదిస్తుంది. ప్రతి సార్వత్రిక ఎన్నికల తర్వాత రిజర్వ్‌డ్ సీట్లను మార్చాలని కూడా బిల్లులో ప్ర‌తిపాదించారు.

దేవెగౌడ హ‌యాంలో మొద‌లు..

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు ఎన్నో ఆటుపోట్ల‌ను, అడ్డంకుల‌ను ఎదుర్కొంటూ వ‌చ్చింది. మొట్ట‌మొద‌టిసారి నాటి ప్ర‌ధాని దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం సెప్టెంబర్ 12, 1996న 81వ సవరణ బిల్లుగా లోక్‌సభలో దీనికి ప్రవేశపెట్టింది. కానీ సభ ఆమోదం పొందలేదు. దీంతో లోక్‌సభలో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు రద్దయ్యింది.

ఇది జ‌రిగిన రెండు సంవ‌త్స‌రాల త‌రువాత ఎన్డీయే హ‌యాంలో1998లో స్వాతంత్య్ర‌ దినోత్సవ ప్రసంగంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్ర‌ధాని వాజ‌పేయి సంక‌ల్పించారు. అన్న‌ట్లుగానే 1998లో లోక్‌సభలో బిల్లు పెట్టారు. కానీ బిల్లుకు తగిన మద్దతు లేక వీగిపోయింది. త‌రువాత వాజ్‌పేయి ప్రభుత్వంలోనే 1999, 2002, 2003లో తిరిగి మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టారు. కానీ అప్పుడూ అనేక అవ‌రోధాల వ‌ల్ల‌ బిల్లు అట‌కెక్కింది.

యూపిఏ హ‌యాంలో ఇలా..!

యుపీఏ-1 హ‌యాంలో నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం.. మే 6, 2008న రాజ్యసభలో తిరిగి మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టింది. నాటి యూపిఏ చైర్మ‌న్ సోనియా గాంధీ కూడా మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు ప‌ట్ల సానుకూలంగానే ఉండ‌టంతో మే 9, 2008న బిల్లును పార్ల‌మెంటు స్టాండింగ్ కమిటీకి పంపారు. స్టాండింగ్ కమిటీ డిసెంబర్ 17, 2009న నివేదిక సమర్పించింది. ఈ నివేదికకు 2010, ఫిబ్రవరిలో కేంద్ర కేబినెట్ ఆమోదించింది.

దీంతో మార్చి 9, 2010న మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో 186-1 ఓట్లతో ఆమోదం పొందింది.లోక్‌సభలో ఆమోదం పొంద‌లేదు. 2014లో 15వ లోక్‌సభ రద్దవడంతో ఈ బిల్లు క‌థ అక్కడితో ముగిసిపోయింది. లాలూ నాయ‌క‌త్వంలోని RJD- ములాయంసింగ్ నాయ‌క‌త్వంలోని సమాజ్‌వాదీ పార్టీలు మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లులో కులాల వారీగా రిజర్వేషన్లు ఉండాల‌ని, అప్పుడే తాము మ‌ద్ద‌తు ఇస్తామ‌ని లోక్‌స‌భ‌లో డిమాండ్ చేశాయి. దీంతో క‌థ మ‌ళ్లీ మొద‌టికొచ్చింది.

1992 నుంచే పంజాయితీరాజ్‌లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌

చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు కంటే ముందే దేశంలో పంచాయితీరాజ్ సంస్థ‌ల్లో (స్థానిక సంస్థ‌ల్లో) అంటే స‌ర్పంచ్‌, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ స్థానాల్లో మ‌హిళ‌ల‌కు 33.33 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లులో ఉంది. 1992లో.. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఆమోదించబడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-D ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలు, అణగారిన వర్గాలకు 33.3 శాతం రిజర్వేషన్లు తప్పనిసరిగా అమ‌లు చేస్తూ వ‌స్తున్నారు.

ఈ రిజ‌ర్వేష‌న్ పుణ్య‌మా అని దేశంలో 14.5 లక్షలకు పైగా మహిళలు రాజ‌కీయ నాయకత్వంలోకి వ‌చ్చారు. పాల‌న‌లో భాగ‌మ‌య్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, త్రిపుర, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ స‌హా దేశంలోని 21 రాష్ట్రాలు పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాయి.

ఏ పార్లమెంటులో ఎంత‌మంది మహిళ‌లు?

దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏళ్లు దాటినా పార్ల‌మెంటులో మ‌హిళ‌ల ప్రాతినిధ్యం అనుకున్నంత మేర‌కు పెర‌గ‌లేదు. అందుకే మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు అవ‌స‌రం గురించి ప‌లు మ‌హిళా సంఘాలు పోరాడుతున్నాయి. దేశంలోని ప‌లు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో మ‌హిళా ఓట‌ర్ల సంఖ్య పురుషుల ఓట్ల కంటే అధికంగా ఉన్న‌ట్లు ప్ర‌భుత్వ గ‌ణాంకాలే చెబుతున్నాయి.

2019 లోక్‌సభ ఎన్నికల ప్రకారం 47.27 కోట్ల మంది పురుషులు, 43.78 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2022 ప్రభుత్వ డేటా ప్రకారం రాజ్యసభలో మహిళల ప్రాతినిధ్యం దాదాపు 14 శాతం. ఇప్పటివరకు అత్యధికంగా 17వ లోక్‌సభలో 82 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. ఇది మొత్తం లోక్‌సభ బలంలో దాదాపు 15.21 శాతం. 2014లో అంటే 16వ లోక్‌సభలో మొత్తం 11.87 శాతం అంటే 68 మంది మహిళా ఎంపీలు ఉన్నారు.

బిల్లు ఆమోదం త‌రువాత జ‌రిగేంటి?

ఈ మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు ఆమోదం పొందాక దేశంలోని మొత్తం పార్ల‌మెంటు, అసెంబ్లీ స్థానాల్లో 33 శాతం సీట్ల‌ను మహిళలకు రోటేషనల్ పద్ధతిలో రిజర్వ్ చేస్తారు. అంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అసెంబ్లీకి సుమారు 59 సీట్లు, తెలంగాణ అసెంబ్లీ స్థానాల్లో సుమారు 40 సీట్ల‌ను త‌ప్ప‌నిస‌రిగా మ‌హిళ‌ల‌కు కేటాయించాల్సిందే. వరుసగా ప్రతి మూడు సార్వత్రిక ఎన్నికల్లో ఒకసారి మహిళలకు లాట‌రీ పద్ధతిలో సీట్లు రిజర్వ్ చేస్తారు. అలాగే పార్ల‌మెంటు స్థానాల్లో కూడా. దేశంలో ఇప్పుడు 543 పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. 33 శాతం రిజ‌ర్వేష‌న్ వ‌ల్ల మ‌హిళ‌ల‌కు 161 పార్ల‌మెంటు స్థానాలు ద‌క్కుతాయి.

తెలంగాణ‌లో ఇప్పుడు మొత్తం 17 లోక‌స‌భ స్థానాలు ఉండ‌గా, వీటిలో జ‌న‌ర‌ల్ 12, ఎస్సీ 3, ఎస్టీ రెండు స్థానాలు ఉన్నాయి. తెలంగాణ‌లో మొత్తం 6 లోక్‌స‌భ స్థానాలు మ‌హిళ‌ల‌కు కేటాయించాల్సి ఉంటుంది. ఒక‌టి ఎస్టీ, ఒక‌టి ఎస్సీ, నాలుగు జ‌న‌ర‌ల్ స్థానాలు మ‌హిళ‌ల‌కు ద‌క్కుతాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మొత్తం 25 పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. వీటిలో 5 స్థానాలు రిజ‌ర్వుడు కేట‌గిరీలో ఉన్నాయి. 7 జ‌న‌ర‌ల్ మ‌హిళ‌ల‌కు, ఒక‌టి ఎస్టీ, ఒక‌టి ఎస్సీ మ‌హిళ‌ల‌కు పోటీ చేసే అవ‌కాశం వ‌స్తుంది.

49 శాతం ఉన్న మ‌హిళ‌ల‌కు 11 శాతం సీట్లేనా?

భారతదేశ జ‌నాభాలో మ‌హిళ‌లు 49 శాతం ఉండ‌గా, వారు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సీట్ల శాతం కేవలం 11 శాతంగా ఉంది. 51శాతం జనాభా ఉన్న‌పురుషులు పార్లమెంటులో 89 శాతం సీట్ల‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా, పార్లమెంట్ దిగువసభలో మహిళల ప్రాతినిధ్యంలో 190 దేశాలలో భారతదేశం 103వ స్థానంలో ఉంది.

మహిళా బిల్లుతో ప‌రిస్థితి ఏమ‌వుతుంది?

తెలంగాణ అసెంబ్లీలో 119స్థానాలు ఉన్నాయి. 2011 జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల, జ‌య‌శంక‌ర్‌, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, రాజ‌న్న సిరిసిల్ల‌, కామారెడ్డి, మెద‌క్‌, సిద్దిపేట‌, వికారాబాద్‌, ఖ‌మ్మం, ములుగు, నారాయ‌ణ‌పేట జిల్లాల‌లో మ‌హిళా జ‌నాభా పురుషుల జ‌నాభా కంటే ఎక్కువ‌గా ఉంది.

రాష్ట్రాన్ని ఒక యూనిట్‌గా ప‌రిగ‌ణించి జ‌నాభా ప్రాతిప‌దిక‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే ముందుగా ఎక్కువ మ‌హిళా జ‌నాభా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఎంపిక చేయ‌వ‌ల‌సి ఉంటుంది. లేదా ఓట‌ర్ల సంఖ్య‌నే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే తెలంగాణాలో దిగువ పేర్కొన్న నియోజ‌క‌వ‌ర్గాలలో ముందుగా రిజ‌ర్వేష‌ను అమ‌ల‌వుతుంది. ఎక్కువ‌శాతం నుంచి త‌క్కువ శాతం మ‌హిళా జ‌నాభాను గ‌ణించి అందులో 40 అసెంబ్లీ స్థానాల‌ను, ఆరు లోక్‌స‌భ స్థానాల‌ను ఎంపిక చేయ‌వ‌ల‌సి ఉంటుంది.

దేవుడే నన్ను ఎంచుకున్నాడు: మహిళా బిల్లుపై ప్రధాని మోదీ

మహిళా కోటా బిల్లుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపిన సెప్టెంబర్‌ 17 చరిత్రలో నిలిచిపోయే రోజని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. ఇది మనందరికీ గర్వకారణమైన సందర్భమని అన్నారు. మహిళా బిల్లుపై అనేక సంవత్సరాలుగా పార్లమెంటు చర్చించిదని పేర్కొన్నారు. 1996లో మొదటిసారి బిల్లు ప్రవేశపెట్టారని, వాజ్‌పేయి హయాలో పలు సందర్భాల్లో బిల్లు ఆమోదానికి కృషి జరిగిందని చెప్పారు.

కానీ.. తగినంత సంఖ్యాబలం లేకపోవడం వల్ల బిల్లు ఆమోదం పొందలేదని తెలిపారు. ‘బహుశా ఈ పవిత్రమైన కార్యం నిర్వహించడానికి దేవుడే నన్ను ఎంచుకున్నాడేమో’ అని మోదీ వ్యాఖ్యానించారు. సభలో పక్షాలన్నీ ఏకాభిప్రాయంతో బిల్లును ఆమోదించాలని కోరారు.

పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు :

1. ఆదిలాబాద్ - 114016
2. బోథ్(ఎస్టీ) - 102576
3. ఖానాపూర్(ఎస్టీ) - 104537
4. నిర్మల్ - 122696
5. ముధోల్ - 119092
6. ఆర్మూర్ - 105657
7. బోధన్ - 106222
8. బాన్సువాడ - 94941
9. నిజామాబాద్ అర్బన్ - 138615
10. నిజామాబాద్ రూరల్ - 127602
11. బాల్కొండ – 111424
12. జుక్కల్ (ఎస్సీ) – 95512
13. ఎల్లారెడ్డి - 107603
14. కామారెడ్డి - 117783
15. కోరట్ల - 116536
16. జగిత్యాల - 109853
17. ధర్మపురి(ఎస్సీ)- 107068
18. మంథని - 110840
19. పెద్దపల్లి - 120120
20. చొప్పదండి(ఎస్సీ)- 116006
21. మానకొండూర్(ఎస్సీ)- 107087
22. హుజూరాబాద్ - 119632
23. వేములవాడ - 107839
24. సిరిసిల్ల - 116066
25. ఆంధోల్(ఎస్సీ) - 114077
26. సంగారెడ్డి - 107750
27. మెదక్ - 105075
28. నర్సాపూర్ - 104712
29. హుస్నాబాద్ -114218
30. సిద్ధిపేట - 109938
31. దుబ్బాక - 95375
32. గజ్వేల్ - 126814
33. తాండూర్ - 111529
34. కొండంగల్ - 108157
35. దేవరకొండ - 107951
36. గద్వాల - 118447
37. అలంపూర్(ఎస్సీ)- 111439
38. నాగార్జున సాగర్ - 109992
39. మిర్యాలగూడ - 107265
40. నల్లగొండ - 114211
41. హుజూర్ నగర్ - 117299
42. కోదాడ - 114706
43. సూర్యపేట - 113049
44. జనగామ - 110512
45. ఘన్‌పూర్ స్టేషన్(ఎస్సీ)- 117439
46. మహబూబాబాద్(ఎస్టీ) - 119343
47. నర్సంపేట - 110271
48. వరంగల్ ఈస్ట్ - 120903
49. వర్ధన్నపేట(ఎస్సీ)- 125541
50. పరకాల - 105788
51. వరంగల్ వెస్ట్ - 134053
52. పినపాక(ఎస్టీ) - 94012
53. ఇల్లందు(ఎస్టీ) - 105638
54. కొత్తగూడెం - 117338
55. అశ్వారావుపేట(ఎస్టీ) - 76305
56. భద్రాచలం(ఎస్టీ) - 74121
57. ఖమ్మం - 159527
58. పాలేరు - 114636
59. మధిర(ఎస్సీ) - 107698
60. వైరా(ఎస్టీ) -94024
61. సత్తుపల్లి(ఎస్సీ)- 115405
62. నారాయణపేట - 107139
63. మక్తల్ - 111870.

Updated On 19 Sep 2023 10:58 AM GMT
somu

somu

Next Story