Womens Reservation Bill లోక్‌సభలో మహిళా కోటా బిల్లు కొత్త పార్లమెంటు భవనంలో తొలి బిల్లు ప్రవేశపెట్టిన న్యాయ మంత్రి మేఘ్వాల్ న్యూఢిల్లీ : మహిళా లోకం సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కొత్త పార్లమెంటు భవనంలో జరిగిన తొలి సమావేశంలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం విశేషం. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల రెండో రోజైన మంగళవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రతిపక్షాల నిరసనల మధ్య […]

Womens Reservation Bill
- లోక్‌సభలో మహిళా కోటా బిల్లు
- కొత్త పార్లమెంటు భవనంలో తొలి బిల్లు
- ప్రవేశపెట్టిన న్యాయ మంత్రి మేఘ్వాల్
న్యూఢిల్లీ : మహిళా లోకం సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కొత్త పార్లమెంటు భవనంలో జరిగిన తొలి సమావేశంలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం విశేషం. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల రెండో రోజైన మంగళవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రతిపక్షాల నిరసనల మధ్య మహిళా బిల్లును ప్రవేశపెట్టారు.
రాష్ట్ర, జాతీయస్థాయి చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు దీనిని ఉద్దేశించారు. అయితే.. 2026లో నిర్వహించే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత దీనిని అమల్లోకి తీసుకు రానున్నారు. పదిహేను సంవత్సరాల పాటు రిజర్వేషన్లు వర్తింపజేస్తారు. లోక్‌సభ, అసెంబ్లీల్లో మూడింట ఒక వంతు స్థానాలను మహిళలకు రిజర్వ్ చేసి, ఎన్నిక ద్వారా భర్తీ చేస్తారని బిల్లు పేర్కొంటున్నది.
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు కేటాయించిన సీట్లలో కూడా ఈ కోటాను అమలు చేస్తారు. సభా కార్యక్రమాల అనుబంధ జాబితాలో భాగంగా రాజ్యాంగ సవరణ (128వ) బిల్లు 2023ను తీసుకువచ్చారు. పంచాయతీలు, పురపాలక సంస్థల్లో మహిళలు గణనీయంగా ప్రాతినిథ్యం వహిస్తున్నారని, కానీ.. రాష్ట్ర అసెంబ్లీలు, పార్లమెంటులో మాత్రం ఇంకా పరిమితంగా ఉన్నదని బిల్లులో పేర్కొన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే క్రమంలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని తెలిపింది.
ప్రతి పునర్విభజన ప్రక్రియ తర్వాత మహిళలకు కేటాయించిన సీట్లను రొటేషన్ చేస్తారని పేర్కొంది. ఈ బిల్లును 2008లో రాజ్యసభ ఆమోదించినా, అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో లోక్‌సభను దాటలేక పోయింది. సోమవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ బిల్లును ఆమోదించిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం ప్రధాని లోక్‌సభలో మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి ప్రక్రియలో మరింత మంది మహిళలు భాగస్వాములు కావాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు.
