Work From Home | కొవిడ్ అనంతరం మనుషుల జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అలాంటి వాటిలో ఒకటి వర్క్ ఫ్రం హోం (WFH) . ప్రస్తుతం కొన్ని కంపెనీలు ఉద్యోగులను పూర్తి కాలం వర్క్ ఫ్రం హోం (డబ్ల్యూఎఫ్‌హెచ్) కు అనుమతిస్తుండగా మరికొన్ని తప్పనిసరిగా ఆఫీసుకు వచ్చి పనిచేయాల్సిందేనని ఆదేశించాయి. అయితే డబ్ల్యూఎఫ్‌హెచ్ వల్ల పర్యావరణానికి ఎంతో ఉపయోగం ఉందని తాజా అధ్యయనం (Study) ఒకటి వెల్లడించింది. ఆఫీసుకొచ్చి పని చేస్తున్న వారితో పోలిస్తే […]

Work From Home |
కొవిడ్ అనంతరం మనుషుల జీవన విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అలాంటి వాటిలో ఒకటి వర్క్ ఫ్రం హోం (WFH) . ప్రస్తుతం కొన్ని కంపెనీలు ఉద్యోగులను పూర్తి కాలం వర్క్ ఫ్రం హోం (డబ్ల్యూఎఫ్‌హెచ్) కు అనుమతిస్తుండగా మరికొన్ని తప్పనిసరిగా ఆఫీసుకు వచ్చి పనిచేయాల్సిందేనని ఆదేశించాయి. అయితే డబ్ల్యూఎఫ్‌హెచ్ వల్ల పర్యావరణానికి ఎంతో ఉపయోగం ఉందని తాజా అధ్యయనం (Study) ఒకటి వెల్లడించింది.
ఆఫీసుకొచ్చి పని చేస్తున్న వారితో పోలిస్తే ఇంట్లో నుంచి పని చేస్తున్న వాళ్లు సగానికి కన్నా తక్కువగా గ్రీన్ హౌస్ గ్యాస్‌ల( Green House Gases) ను విడుదల చేస్తున్నారని తెలిపింది. భూ ఉష్ణోగ్రతల పెరుగుదలకు ఈ గ్రీన్ హౌస్ గ్యాస్‌లే కారణమన్న విషయం తెలిసిందే. ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం అమెరికాలో డబ్ల్యూఎఫ్ హెచ్ విధానంలో పని చేస్తున్న ఉద్యోగులు, ఆఫీసుకొచ్చి పనిచేస్తున్న సిబ్బందిపై పరిశోధన చేసి నివేదికను రూపొందించింది.
దీని ప్రకారం.. ఆఫీసు ఉద్యోగులతో పోలిస్తే ఇంటి నుంచి పని చేస్తున్న వారు 54 శాతం తక్కువ ఉద్గారాలను వెలువరిస్తున్నారు. ఆఫీసు ఎసీ, కంప్యూటర్, టీ, స్నాక్స్ వెండింగ్ మెషీన్ల ద్వారా ఆదా అవుతున్న విద్యుత్, వాటి ఉద్గారాల నిలుపుదల మొదలైనవి ఈ వాయువుల తగ్గుదలకు దోహద పడుతున్నాయి. అలాగే నెలలో సగం రోజులు ఆఫీసు నుంచి సగం రోజులు ఇంటి నుంచి పనిచేస్తున్న హైబ్రిడ్ విధానంలో ఫలితాలు డబ్ల్యూఎఫ్‌హెచ్ విధానంలో వచ్చినంత ఆశాజనకంగా లేవని తెలుస్తోంది.
ఈ విధానంలో కేవలం 2 శాతం మాత్రమే ఉద్గారాల తగ్గుదల నమోదైంది. వారంలో కనీసం నాలుగు రోజులు ఇంటి నుంచి పనిచేస్తేనే ఉద్గారాల విడుదలలో తగినంత మార్పు నమోదవుతోందని అధ్యయన కర్తలు వెల్లడించారు. ఈ అధ్యయనం కోసం కార్నెల్ యూనివర్సిటీ, మైక్రోసాఫ్ట్ వివిధ సంస్థల నుంచి పెద్ద మొత్తంలో ఉద్యోగుల సమాచారాన్ని సేకరించాయి.
అయితే మొత్తం కర్బన ఉద్గారాల విడుదలలో ఇతర పరిశ్రమల వాటాతో పోలిస్తే ఐటీ, కమ్యునికేషన్స్ వాటా స్వల్పమేనని ఈ అధ్యయనం వెల్లడించింది. అందువల్ల ఇతర రంగాల్లోనూ డబ్ల్యూఎఫ్‌హెచ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తే ఈ సానుకూలతను పెంచుకోవచ్చని.. తద్వారా ఉష్ణోగ్రతల పెరుగుదలను నియంత్రించొచ్చని తెలిపింది. అంతే కాకుండా ఇంటి నుంచి పనిచేసే వారు ఎనర్జీ ఎఫిషియెంట్ రేటింగ్ ఉన్న విద్యుత్ పరికరాలనే వాడాలని.. లేదంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదముందని హెచ్చరించింది.
