- గతంలో బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకుని భంగపడిన బీజేపీ
- మళ్లీ చర్యలకు సాహసిస్తుందా?
విధాత : రింగ్‌లో నిమిషాల్లోనే ప్రత్యర్థిని నేలకూల్చే రెజ్లర్లు (Wrestlers).. ఓ వ్యక్తి విషయంలో మాత్రం న్యాయం కోసం సుదీర్ఘకాలం పోరాడాల్సి వస్తోంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై ఒలింపిక్ పతక విజేతలు బజరంగ్ పూనియా, వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్ మొదలైన వారు జనవరిలో ఒకసారి ఆందోళనకు దిగగా.. మరో విడత నిరసన కార్యక్రమం ఏప్రిల్ నుంచి దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరుగుతోంది. భూషణ్ తమను లైంగికంగా వేధించాడని, డబ్ల్యూఎఫ్ఐను నియంతలా నిర్వహిస్తున్నారనేవి రెజ్లర్ల ప్రధాన ఆరోపణలు.
మూడు నెలలు దాటినా చర్యల్లేవు
భారత క్రీడా మంత్రిత్వ శాఖ, పీటీ ఉష సారథ్యంలో ఉన్న ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) ఈ ఆరోపణలను పరిశీలిస్తామని చెప్పడంతో రెజ్లర్లు జనవరిలో ఆందోళనను విరమించారు. అయితే తర్వాత మూడు నెలలు దాటినప్పటికీ బ్రిజ్‌పై ఎటువంటి కఠిన చర్యలకు కేంద్రం దిగలేదు. ఈ ఆరోపణలను కొట్టిపడేస్తున్న ఆయన.. తాను పదవి నుంచి దిగేదే లేదని, ఎటువంటి విచారణకయినా సిద్ధమేనని ప్రకటించాడు. తమకు న్యాయం జరడగం లేదని గుర్తించిన రెజ్లర్లు ఏప్రిల్ నుంచి రెండో విడత నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
ఖర్చులు, పనులను పంచుకుంటూ..
జంతర్‌మంతర్‌లో నిరసన అంటే తడిపిమోపెడు ఖర్చులుంటాయి. దీంతో రెజ్లర్లు పొదుపుగా తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. పరుపులు, సౌండ్ బాక్స్, కూలర్లు మొదలైనవి తొలుత అద్దెకు తీసుకున్నా.. ఖర్చు విపరీతంగా పెరిగిపోతుండటంతో సొంతంగా వాటిని సమకూర్చుకున్నారు. ఆహారం తయారుచేయడం, భద్రత మొదలైన వాటిని వారే వంతుల వారీగా పంచుకుంటున్నారు.
తమ ఆందోళన అయిపోయాక ఇక్కడి వస్తువులన్నింటిని గుడికి లేదా గురుద్వారాకు విరాళంగా ఇచ్చేస్తామని వారు చెబుతున్నారు. ప్రస్తుతం వీరికి ఆయా రెజ్లర్ల కుటుంబాలే ఆర్థికంగా దన్నుగా నిలబడ్డాయి. తాము సాయం చేస్తామంటూ రాజకీయపార్టీలు ముందుకు వచ్చినా.. వీరు అంగీకరించలేదు.
బ్రిజ్ భూషణ్ ఇంత శక్తిమంతుడా?
సాధాణరంగా ఏ రాజకీయ నాయకుడి పైన అయినా లైంగిక ఆరోపణలు వస్తే వెంటనే వారిని పదవి నుంచి తప్పించే ప్రభుత్వం.. బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవడానికి వెనకాడుతోంది. దీనికి కారణం బ్రిజ్ వెనక ఉన్న బలం, బలగమే..
బాబ్రీ మసీదు ఘటనతో వెలుగులోకి
1991లో జరిగిన బాబ్రీ మసీదును కూల్చిన గుంపులో బ్రిజ్ కూడా ఒకరు. స్వయంగా మల్లయోధుడైన ఆయన.. అప్పటి నుంచి రాం భక్త్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే ఈయన గతం మొత్తం రక్తచరిత్రేనని కొన్ని మీడియా వెబ్‌సైట్‌లు పేర్కొంటున్నాయి. ఒక ఇంటర్య్వూలో అయితే ఆయనే స్వయంగా తాను తుపాకీతో కాల్చి మర్డర్ చేసినట్లు ఒప్పుకొన్నారని ఒక కథనం చెబుతోంది.
తొలి దశలో ఆయన బైక్ చోరీలు, చిన్న పిల్లల చేత గుడి చెరువుల్లో నాణేలు ఏరించడం మొదలైనవీ చేసేవారని స్థానిక విలేకర్లు పేర్కొంటున్నారు. 2004 ప్రాంతంలో బ్రిజ్ రాజకీయ శత్రువు ఒకరు యాక్సిడెంట్‌లో మరణించారని వార్తలు రాగా.. ఏకంగా అటల్ బిహారీ వాజ్‌పాయీ ఇతడిని పిలిచి.. నువ్వే ఆయనను చంపేశావ్ కదా.. అని ప్రశ్నించారు. దీనిని బట్టి బ్రిజ్ ట్రాక్ రికార్డును మనం అంచనా వేయొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Keep supporting wrestlers 🙏#WrestlersProtest#IStandWithMyChampions #Wewantjustice pic.twitter.com/gWHwhHU8TS
— Sakshee Malikkh (@SakshiMalik) May 18, 2023
రాజకీయంగా మహా బలశాలి
గతం ఏదైతేనేం.. రాజకీయంగా మాత్రం బ్రిజ్ మహాబలశాలిగా మారారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాసర్‌గంజ్ నుంచి వరసగా ఆరు సార్లు ఎంపీగా గెలుపొందారు. ఇందులో 5 సార్లు బీజేపీ నుంచి కాగా ఒకసారి సమాజ్‌వాదీ పార్టీ నుంచి విజయం సాధించారు. దీని చుట్టుపక్కల నాలుగు జిల్లాల్లోనూ ఆయన ప్రభావం స్పష్టంగా ఉంది. మర్డర్ ఆరోపణలు, కండబలాన్ని విరివిగా ఉపయోగించే ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రయత్నించి భాజపా ఒకసారి భంగపాటుకు గురైంది.
2008లో బీజేపీ ఎంపీగా ఉన్న ఆయన.. లోక్‌సభలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని గుర్తించి ఆయనను సస్పెండ్ చేసింది. సంవత్సరం తిరగ్గానే సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొంది తానేంటో బీజేపీకి రుచి చూపించారు. తనను కాదని కాసర్‌గంజ్ చుట్టుపక్కల ఏ పార్టీకి సీటు రాదని ఆయన చాలా సార్లు ప్రకటించారు. 2011లో డబ్ల్యూఎఫ్ అధ్యక్షుడిగా నియమితులైన ఆయన 2014 నుంచి మళ్లీ బీజేపీలో కొనసాగుతున్నారు.
ఇప్పుడు కూడా బ్రిజ్ విషయంలో కషాయపార్టీ తొందరపడక పోవడానికి గతంలో నేర్చుకున్న పాఠమే కారణంగా కనపడుతోంది. కేవలం ఆ పార్టీనే కాదు.. ప్రధాన పార్టీలు సైతం ఆయనపై గట్టి విమర్శలు చేయకపోవడానికి ఆయన అవసరం భవిష్యత్తులో ఉంటుందనే. ఇలాంటి మహాబలశాలిని రెజ్లర్లు ఓడించగలరా? కాలమే సమాధానం చెప్పాలి.