Tuesday, January 31, 2023
More
  Homelatest‘యశోద’ ఆ హీరోయిన్ చేసి ఉంటేనా..

  ‘యశోద’ ఆ హీరోయిన్ చేసి ఉంటేనా..

  విధాత‌: తెలుగు సినీ చరిత్రలో పరుచూరి బ్ర‌ద‌ర్స్‌కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. క‌థ‌, పాత్ర‌లు, స‌న్నివేశాలు, ఎలివేషన్స్, హీరోల ఇమేజ్ వంటివ‌న్నీ దృష్టిలో ఉంచుకుని సంభాషణలు ఉండేలా చూసుకోవడం వారికి వెన్నతో పెట్టిన విద్య.

  స్వర్గీయ ఎన్టీఆర్ ప్రోత్సాహంతో ఇంతకాలం అన్నదమ్ములైనప్పటికీ కలిసే ఉంటూ ఎన్నెన్నో చిత్రాలకు పనిచేశారు. మధ్యలో ఒకటి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన అవి పెద్దగా మెప్పించలేదు. సినిమా బాగా ఉందని పేరు వచ్చినప్పటికీ కమర్షియల్‌గా అవి సక్సెస్ సాధించలేదు. ఇటీవల వయసు మీద‌ ప‌డ‌టం వలన వీరు పెద్దగా కనిపించడం లేదు.

  మరి ఎవరైనా ఆప్తులు వచ్చి రచనలో మీ సహకారం కావాలంటే అయా రచయితలకు రచనలో సహకారం అందిస్తూ పర్యవేక్షిస్తున్నారు. పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు.. వీరిద్దరూ ఎన్నో చిత్రాలలో మంచి పాత్రలను కూడా చేసి నటులుగా కూడా మెప్పించారు.

  నాడు ఎన్టీఆర్‌కు రాజకీయ ప్రసంగాలు రాయడంలో వారి సహకారం ఉందని కూడా అంటారు. ఇక ఈ విశ్రాంతి కాలంలో పరుచూరి గోపాలకృష్ణ తాము ప‌నిచేసిన పాత చిత్రాల‌తో పాటు కొత్తగా విడుదలవుతున్న సినిమాల వరకు వాటి మంచి చెడులను, లోపాలను, వాటిలో ఉన్న గొప్పతనాన్ని వివరిస్తూ.. పరుచూరి పాఠాలు పేరుతో వీడియోలు రూపొందిస్తున్నారు. ఇటీవలే ఆయన ‘కాంతార’ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేశారు. తాజాగా సమంత నటించిన ‘యశోద’ చిత్రంపై తనదైన విశ్లేషణ చేశారు.

  ఆయ‌న మాట్లాడుతూ.. యశోద చాలా మంచి సినిమా. ఇది మెసేజ్ ఓరియంటెడ్. హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యమిస్తూ సినిమా తీశారు. హీరోయిన్ పాత్రలో స‌మంత చాలా బాగా అనిపించింది. దర్శకులైన హరి హరీష్ లు చాలా బాగా తీశారు. సమంత పాత్రను బాగా తీర్చి తీర్చిదిద్దినందుకు వారిని మెచ్చుకోవాలి.

  మొదట్లో అమాయకంగా ఉన్న అమ్మాయిగా చూపించి క్లైమాక్స్‌లో విశ్వరూపం చూపించారని కొనియాడారు. విజయశాంతి కర్తవ్యం తీసిన సమయంలో ఆమె ఈ కథ చేసి ఉంటే బాగుండేది అనిపించిందని విశ్లేషించారు. విజయశాంతి నటించిన పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు పరుచూరి బ్రదర్స్‌కు పనిచేసిన అనుభవం ఉంది.

  వారికి విజయశాంతితో మంచి సాన్నిహిత్యమేముంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని పరుచూరి గోపాలకృష్ణ విజయశాంతి ఏ పాత్రనైనా అలవోకగా చేయగలదు. అందుకే ‘యశోద’ సినిమా ఆమె కైతే భలే ఉంటుంది అనిపించింది అన్నారు.

  సరోగసి ద్వారా తల్లి కావడం, సరోగసి నేపథ్యంలో సాగే ఓ పెద్ద మాఫియా ముఠాను గుట్టుర‌ట్టు చేయడం వంటివి యశోద చిత్రంలో చాలా బాగున్నాయి అని తెలిపారు. చివరి 40 నిముషాలు ఒక రకమైన భయం వేస్తుంది. ఇది అద్భుతమైన ప్రయోగం.

  ముఖ్యంగా సినిమాలోని పాత్రలకు సమయోచితంగా మంచి పేర్లను పెట్టారు. భాగవత కథను గుర్తుకు వచ్చేలా దర్శకులు పేర్లు పెట్టి సినిమా వాళ్ళ ఆలోచనను భాగవతంలోకి తీసుకెళ్లారు. ఇందులో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. తన చెల్లిని కనిపెట్టడం కోసం హీరోయిన్ సరోగసి చేయించుకోవడం అనేది సాహసం.

  యశోద మంచి సినిమా.. అందరూ చూడాల్సిన సినిమా. ఇలాంటి సినిమాలు చూస్తే ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. ఇలాంటివి చూస్తేనే ఇలాంటి మరిన్ని కథలను రాయవచ్చు. హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలను ఎలా చేయాలో తెలుసుకోవచ్చు అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమా నా కోసం చూడండి అంటూ చివరలో ఆయన ప్రేక్షకులకు విన్నవించారు.

  ముర‌ళీశ‌ర్మ‌, వరలక్ష్మీ శరత్ కుమార్‌ల‌ను చూసి ఆశ్చర్యపోయా. రావు రమేష్ చిన్న పాత్ర అయినా చక్కగా నటించారు. ఈ చిత్రంలోని అందరూ వాళ్ళ పాత్రలకు ప్రాణం పోశారు. అత్యద్భుతమైన స్క్రీన్‌ప్లే రచించిన దర్శకులకు, సంగీతం అందించిన మణిశ‌ర్మ‌కు, సమంతకు నా అభినందనలు అని తెలిపారు.

  కాగా ప్రస్తుతం స్వీటీ అనుష్క త‌న 48వ చిత్రాన్ని మహేష్ దర్శకత్వంలో చేస్తోంది. ఈ చిత్రం కూడా యశోదను పోలి ఉంటుందని సరోగసి నేపథ్యంలోనే ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఇందులో అనుష్క చీఫ్ చెఫ్‌గా నటిస్తుండగా స్టాండ్ అప్ కమెడియన్ నవీన్ పోలిశెట్టి కీలకపాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్ర రిజల్ట్ ఎలా ఉంటుందో.. ఈ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ పాఠం ఎలా ఉంటుందో తెలియాలంటే.. ఆ సినిమా వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular