liquor Case | ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ టార్గెట్! జీ-20 సదస్సు తర్వాత అసలు కథ! హైదరాబాద్ లింకులపై ముందుకు? విధాత: ఢిల్లీ లిక్కర్ కేసులో మరో సంచలనం జరిగింది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అప్రూవర్‌గా మారారని విశ్వసనీయంగా తెలుస్తున్నది. ఈ కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్నిఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు అందించినట్లు సమాచారం. తాజాగా మాగుంట అప్రూవర్‌గా మారారన్న వార్తలతో లిక్కర్ కేసులో ఆసక్తి రేపుతున్న సౌత్ గ్రూపు నుండి […]

liquor Case |
- ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ టార్గెట్!
- జీ-20 సదస్సు తర్వాత అసలు కథ!
- హైదరాబాద్ లింకులపై ముందుకు?
విధాత: ఢిల్లీ లిక్కర్ కేసులో మరో సంచలనం జరిగింది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అప్రూవర్‌గా మారారని విశ్వసనీయంగా తెలుస్తున్నది. ఈ కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్నిఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు అందించినట్లు సమాచారం. తాజాగా మాగుంట అప్రూవర్‌గా మారారన్న వార్తలతో లిక్కర్ కేసులో ఆసక్తి రేపుతున్న సౌత్ గ్రూపు నుండి ఎక్కువ మంది అప్రూవర్లుగా మారినట్లు అయింది.
ఈ కేసులో ఇప్పటికే మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డితోపాటు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్లుగా మారిన విషయం తెలిసిందే. రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి బెయిల్‌పై ఉన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ అనేక మందిని ప్రశ్నిస్తున్నదని చెబుతున్నారు.
ఈడీ ప్రధానంగా హైదరాబాద్ నుండి ఢిల్లీకి నగదు బదిలీలపై ఫోకస్ పెట్టింది. ఢిల్లీలో జరుగనున్న జీ-20 సదస్సు ముగిశాక లిక్కర్ కేసులో అసలు కథ ప్రారంభం అవుతుందని దర్యాప్తు సంస్థల ముఖ్యలు అంటున్నారు. ప్రస్తుతం దర్యాప్తు స్తబ్దుగా ఉన్నట్లు కనిపిస్తున్నా అంతర్గతంగా జరగాల్సింది జరుగుతోందని ఈడీ వర్గాలు అంటున్నాయి.
టార్గెట్ కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ టార్గెట్ గా దూకుడు పెరుగుతుందని ఈడీ వర్గాలు అంటున్నాయి. అలాగే తెలంగాణకు సంబంధించి కీలక వ్యవహారాలన్నీ తెరమీదకు రానున్నాయని చెబుతున్నారు. తెలంగాణకు చెందిన ఓ కీలక నేతకు ఢిల్లీలో అత్యంత సన్నిహితంగా మెలిగే వ్యక్తిని ప్రశ్నంచిన ఈడీ.. రాతపూర్వకంగా అన్ని వివరాలు రాబట్టినట్లు సమాచారం.
తెలంగాణలో, ప్రత్యేకించి హైదరాబాద్‌లో అక్రమ నగదు బదిలీల వ్యవహారాలపై ఈడీ దృష్టి పెట్టినట్లు తెలిసింది. గత కొన్ని రోజులుగా హవాలా వ్యవహారాలు నడిపే 20 మందికి పైగా కీలక వ్యక్తులను ఈడీ అధికారులు పిలిచి, ప్రశ్నించినట్లు సమాచారం. కవిత ఆడిటర్ బుచ్చిబాబును ఈడీ ఇటీవల మరోమారు ప్రశ్నించింది. రాబోయే రోజుల్లో ఈడీ మరికొంతమందిని ప్రశ్నించనున్నట్లు సమాచారం.
