Yennam Srinivas టికెట్ ఆశావహుల్లో ఆందోళన సీనియర్ల మద్దతు, అధిష్టాన నిర్ణయమే కీలకం విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: పాలమూరు నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ కు పోటీ తీవ్రమైంది. తాజాగా యెన్నం శ్రీనివాస్ రెడ్డి పార్టీలో చేరికతో, ఆశావహుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. పార్టీలో సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నా, ఇద్దరు నేతలు మాత్రం మొదటి నుంచి టికెట్ రేసులో ఉన్నారు. మైనార్టీ వర్గం నుంచి మాజీ పాలమూరు డీసీసీ అధ్యక్షులు ఓబేదుళ్ల కొత్వాల్, […]

Yennam Srinivas
- టికెట్ ఆశావహుల్లో ఆందోళన
- సీనియర్ల మద్దతు, అధిష్టాన నిర్ణయమే కీలకం
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: పాలమూరు నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ కు పోటీ తీవ్రమైంది. తాజాగా యెన్నం శ్రీనివాస్ రెడ్డి పార్టీలో చేరికతో, ఆశావహుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. పార్టీలో సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నా, ఇద్దరు నేతలు మాత్రం మొదటి నుంచి టికెట్ రేసులో ఉన్నారు. మైనార్టీ వర్గం నుంచి మాజీ పాలమూరు డీసీసీ అధ్యక్షులు ఓబేదుళ్ల కొత్వాల్, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి సంజీవ్ ముదిరాజ్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి.
గతంలో కొత్వాల్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. మళ్ళీ ఈ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నారు. మరో నేత సంజీవ్ ముదిరాజ్ టికెట్ కోసం ప్రయత్నం ముమ్మరం చేశారు. పార్టీ బలంతో పాటు తన సామాజిక వర్గం ఓట్లు కూడా తనకు అనుకూలంగా ఉంటాయనే యోచనలో ఉన్నారు. టికెట్ కోసం అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు.
మరోనేత ఎన్పీ వెంకటేష్ కూడా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ కోసమే బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. టికెట్ ఆశించే ఈ ముగ్గురికీ ప్రజాబలం అంగా లేదనే అభిప్రాయం టీపీసీసీలో ఉంది. అందుకే బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ లో చేరాలని అధిష్టానం కోరింది.
ఇటీవల బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని యెన్నంను పార్టీ నుంచి బహిష్కరించింది. ఇదే మంచి సమయం అని యెన్నం కాంగ్రెస్ లో చేరేందుకు మార్గం సుగమమైంది. ఆ తర్వాత టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ని కలిసి తన అభిప్రాయం తెలపడంతో, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో యెన్నం కాంగ్రెస్ లో చేరారు. యెన్నం చేరికతో టికెట్ ఆశించే వారంతా ప్రస్తుతం మౌనం పాటిస్తున్నారు.
యెన్నంకు సీనియర్ల మద్దతు దొరుకుతుందా?
యెన్నం శ్రీనివాస్ రెడ్డికి పాలమూరు కాంగ్రెస్ సీనియర్ నేతల మద్దతు ఉంటుందా లేదా అనే సంశయంతో ఆ పార్టీ కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాత్రం యెన్నంకు మద్దతుగా నిలబడతారని రాజకీయ సమీకరణాలు తెలియజేస్తున్నాయి. పాలమూరు డీసీసీ కూడా యెన్నం కే మద్దతుగా ఉంటుందనే అభిప్రాయం ఇక్కడి నేతల్లో ఉంది.
ఇక్కడి బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు గట్టి పోటీ ఉండాలంటే, యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఉండాలని కాంగ్రెస్ మెజారిటీ నేతలు కోరుతున్నారు. కొత్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చాకా 2014 ఎన్నికల్లో తెరాస అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ పై బీజేపీ అభ్యర్థిగా యెన్నం శ్రీనివాస్ రెడ్డి పోటీపడ్డారు. ఈ ఎన్నికలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల తో శ్రీనివాస్ గౌడ్ గట్టేక్కారు.
తెలంగాణ సెంటిమెంట్, ఉద్యమ నేతగా పేరు పడ్డ శ్రీనివాస్ గౌడ్ స్వల్ప ఓట్లతో గెలుపొందగా, బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి ఓటమి చెందినా తెరాసకు చమటలు పట్టించారనే పేరు వచ్చింది. అంతకు ముందు 2012 పాలమూరు ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి సయ్యద్ ఇబ్రహీంపై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన యెన్నం ఘన విజయం సాధించారు.
రెండేళ్లు పాలమూరు ఎమ్మెల్యే గా ఉన్న యెన్నం మచ్చ లేని నేత గా పేరు పొందారు. తాజాగా కాంగ్రెస్ లో చేరి పాలమూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక్కడి కాంగ్రెస్ సీనియర్ నాయకుల మద్దతు కూడగట్టుకుంటే యెన్నం ఎదురు లేని నాయకుడిగా ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆపార్టీ టికెట్ ఆశావహులను కలుపుకుని వెళితే యెన్నం ఈ ఎన్నికల్లో గట్టేక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
