Yennam Srinivas Reddy | బీజేపీలో ఉంటే భవిష్యత్ లేదనేనా..? మహబూబ్ నగర్ లో కొత్త సమీకరణలు విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: మాజీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి బీజేపీ నుంచి బయటపడేందుకు కావాలనే సొంత పార్టీపై విషం గక్కారా? బీజేపీలో ఉంటే రాజకీయ భవిష్యత్ ఉండదనే ఉదేశంతో అభాండాలు వేసారా? కాంగ్రెస్ నాయకులను కలిసి.. తన గోడు వెళ్ళబోసుకున్న విషయం ఆయనే బయట పెట్టుకున్నారా.. ఇవ్వన్నీ పరిశీలిస్తే, బీజేపీ నుంచి వెళ్ళిపోవడానికే […]

Yennam Srinivas Reddy |
- బీజేపీలో ఉంటే భవిష్యత్ లేదనేనా..?
- మహబూబ్ నగర్ లో కొత్త సమీకరణలు
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: మాజీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి బీజేపీ నుంచి బయటపడేందుకు కావాలనే సొంత పార్టీపై విషం గక్కారా? బీజేపీలో ఉంటే రాజకీయ భవిష్యత్ ఉండదనే ఉదేశంతో అభాండాలు వేసారా? కాంగ్రెస్ నాయకులను కలిసి.. తన గోడు వెళ్ళబోసుకున్న విషయం ఆయనే బయట పెట్టుకున్నారా.. ఇవ్వన్నీ పరిశీలిస్తే, బీజేపీ నుంచి వెళ్ళిపోవడానికే ఎన్నం సిద్ధమైనట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయాలని అనుకుని, బీజేపీ నుంచి తనకు తాను బయట పడలేక పార్టీ నుంచి సస్పెన్షన్ కోసం ఎదురుచూసినా ఎన్నంకు తాను అనుకున్నట్లు జరిగింది. బీజేపీ నుంచి సస్పెండ్ అయితే కాంగ్రెస్ లో చేరితే సానుభూతి వస్తుందని ఆయన ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ అధిష్టానం కూడా చాలా రోజుల నుంచి ఎన్నం ను పార్టీలోకి రావాలని ఒత్తిడి చేసింది. ఎన్నం వస్తే మహబూబ్ నగర్ నియోజకవర్గం అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో దింపెందుకు రంగం సిద్ధం చేసింది. ఇందు కోసమే ఎన్నం బీజేపీపై లేని పోని ఆరోపణలు చేసి పార్టీ నుంచి బయట పడ్డారు. ఇప్పటికే ఖమ్మం నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొల్లాపూర్ నేత జూపల్లి కృష్ణారావుతో రహస్యంగా మంతనాలు జరిపినట్లు సమాచారం. గత ఆదివారం హన్వాడ మండలం బీజేపీ నాయకులతో ఎన్నం సమావేశం నిర్వహించడం చర్చ నీయాంశమైంది.
మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ముస్లింల ఓట్ల శాతం బాగా ఉందని, వారి ఓట్లు బీజేపీకి పడవని ఆయన ఈసందర్భంగా శ్రేణులకు వివరించారు. ఈ నియోజకవర్గంలో 80 వేల ఓట్లు వస్తే గెలుపు సాధ్యమని, బీజేపీలో ఉంటే ఇన్ని ఓట్లు రావడం కష్టం అని కాంగ్రెస్ లో ఉంటే ఇది సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ నాయకులు తన వెంట నడవాలని ఎన్నం వెల్లడించడంతో, పలువురు నాయకులు బీజేపీని వీడమని తేల్చి చెప్పారు. దీన్నిబట్టి చూస్తే ఎన్నం కాంగ్రెస్ లో చేరి మహబూబ్ నగర్ నుంచి పోటీలో ఉండేందుకు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
గెలుపోటములు చవిచూస్తూ..
ఎన్నం శ్రీనివాస్ రెడ్డి గతంలో తెరాస జిల్లా అధ్యక్షులు గా ఉన్నారు. 2009లో తెరాస నుంచి మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. కానీ టికెట్ ఆయనకు ఇవ్వకుండా మెట్టుగాడి శ్రీనివాస్ కు ఇవ్వడంతో ఆయన తెరాసకు గుడ్ బై చెప్పారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి రాజేశ్వర్ రెడ్డి తెరాస అభ్యర్థిపై విజయం సాధించారు. 2011 అక్టోబర్ లో రాజేశ్వర్ రెడ్డి అకాల మరణంతో అదే ఎడాది మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది.
ఈ ఎన్నికల్లో తెరాస నుంచి షాద్ నగర్ కు చెందిన మైనారిటీ నాయకుడు సయ్యద్ ఇబ్రహీంకు టికెట్ వచ్చింది. వెంటనే బీజేపీ అభ్యర్థిగా ఎన్నం శ్రీనివాస్ రెడ్డిని ప్రకటించింది. గతంలో ఎన్నంకు తెరాస నాయకులతో ఉన్న అనుబంధం ఉండడంతో బీజేపీకి కలిసి వస్తుందనే భావనతో బీజేపీ అధిష్టానం ఎన్నంకు టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ ఇక్కడ బీజేపీ గెలిచేందుకు మరో ఎత్తు వేసింది. ఎన్నం గెలవాలంటే హిందూ వాదన తెరపైకి తెచ్చింది. ప్రజల్లో ఈ వాదం బలంగా వెళ్లడంతో బీజేపీ అభ్యర్థి ఎన్నం సునాయాసంగా గెలుపొందారు.
మళ్ళీ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస నుంచి తెలంగాణ ఉద్యమ నేత శ్రీనివాస్ గౌడ్, బీజేపీ నుంచి ఎన్నం శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఎన్నం ఓటమి చెందారు. ఉద్యోగుల ఓట్లతో శ్రీనివాస్ గౌడ్ గట్టెక్కారు. అప్పటి నుంచి రాజకీయాలకు ఎన్నం దూరంగా ఉన్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో మళ్ళీ ఎన్నంకు బీజేపీ నుంచి టికెట్ వస్తుందని అందరూ అనుకున్నారు. ఈ సారి ఎన్నం విజయం సాధిస్తాడని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ ఈ నియోజకవర్గం మహాకూటమికి రావడంతో టీడీపీకి ఈ నియోజకవర్గం వెళ్ళింది.
టీడీపీ నుంచి ఎర్ర శేఖర్ ను బరిలో నిలిపారు. ఇక్కడ మహాకూటమి అభ్యర్థి ఎర్ర శేఖర్ చిత్తుగా ఓటమి చెందారు. ఎన్నంకు ఇస్తే గెలిచేవారని ప్రతి ఒక్కరూ అన్నారు. అప్పటి నుంచి బీజేపీని ఆంటిపెట్టుకుని ఉన్న ఎన్నం, ఇటీవల తాను ఉన్న బీజేపీ పైనే విమర్శలు చేశారు. లేని పోని ఆరోపణలు చేసిన ఎన్నంపై పార్టీ కన్నెర్ర చేసింది. ఈ విషయం బీజేపీ రాష్ట్ర అధిష్టానం దృష్టిలో పడడంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. ఎలాగూ బీజేపీ నుంచి బయట పడాలని అనుకున్న ఎన్నం ఈ విధంగా పార్టీ నుంచి బయట పడ్డారు.
