- నీకే కాదు, నీ నాయనకు కూడా భయపడను: దేవేంద్ర ఫడ్నవిస్
విధాత: ముప్పై రెండేండ్ల వ్యక్తిని చూసి ఈ ప్రభుత్వం భయపడుతున్నదని ఆదిత్య థాకరే చేసిన విమర్శలపై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తీవ్రంగా స్పందించారు. నీకే కాదు, మీ నాయన ఉద్ధవ్ థాకరేకు కూడా భయపడబోమని ప్రకటించారు. ఈ సందర్భంగానే… ఫడ్నవిస్ తమకు ఎదురులేదని చెప్పటానికి గతంలో ఆయన చేసిన ఘనకార్యాలను గొప్పగా చెప్పుకొన్నారు.
ఇంకా దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ.. మేం ఎవరికీ భయపడం. నీకే కాదు, నీ తండ్రికి కూడా భయపడం. మీ కండ్లముందే 40మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయి ప్రభుత్వాన్ని పడగొట్టాం. మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం.
అప్పడు ముంబాయి మండి పోతుందని అన్నారు.కానీ అగ్గిపుల్ల కూడా మండలేదు.. అని ఆధిత్య థాకరేను ఉద్దేశించి బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ఈ మాటలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. బీజేపీ అనుసరిస్తున్న ఆధిపత్య ధోరణికి ఇది తార్కాణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు శివసేన నేత ఏక్నాథ్ షిండేను చేరదీసింది బీజేపీ. ఆ క్రమంలోనే 40 మంది ఎమ్మెల్యేలను అధికార పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేలా ప్రోత్సహించారు. ఆ తర్వాత వారిని బీజేపీలో చేర్చుకొని శివసేన-ఎన్సీపీ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
తిరుగుబాటు నేత షిండే ముఖ్యమంత్రి పదవి చేపట్టగా, ఈ మొత్తం ఎపిసోడ్‌ను తెరవెనుక ఉండి నడిపించి రాజకీయ చక్రం తిప్పిన దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన విషయం అందరికి తెలిసిందే.