- వరంగల్ జిల్లాలో దారుణ సంఘటన
- ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి
- ఇంటి పెద్ద దిక్కును పొట్టన పెట్టుకున్నారంటున్న తల్లి, సోదరి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: పోలీసుల వేధింపులు (Police harassment) తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్(Warangal) జిల్లాలో మంగళవారం జరిగింది. దొంగతనం చేశారనే ఆరోపణల నేపథ్యంలో విచారణ కోసం పిలిచి పోలీసుల వేధింపులు తాళలేక గీసుకొండ (Geesukonda) మండలం శాయంపేటకు చెందిన పోలం వంశీ (Polam Vamsi) (26) యువకుడు స్టేషన్ ఆవరణలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే యువకుడ్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
శాయంపేటకు చెందిన పోలీసుశాఖలో పనిచేసే లింగయ్య అనే వ్యక్తి ఇంట్లో గత నెల 28న దొంగతనం జరిగింది. బంగారు నగలు ఇతర వస్తువులు చోరీకి గురయ్యాయి. ఆయన ఇచ్చిన ఫిర్యాదులో వంశీని అనుమానితుడిగా పేర్కొన్నాడు. లింగయ్య కుమారుడు, వంశీ స్నేహితులు కావడంతో తరచూ ఆయన ఇంటికి వెళ్లేవాడు. ఈ కారణంగా తన ఇంట్లో చోరీకి వంశీ కారణమని అనుమానాన్ని వ్యక్తం చేశారు.
పోలీసు వేధింపులే కారణం
ఈ సంఘటనపై విచారణ జరిపేందుకు గీసుకొండ పోలీసులు గత మూడు, నాలుగు రోజులుగా వంశీని పోలీస్ స్టేషన్ పిలిచి తమదైన పద్ధతిలో విచారిస్తున్నారు. తాను ఎలాంటి దొంగతనానికి పాల్పడలేదని వంశీ చెప్పినప్పటికీ పోలీసులు నమ్మలేదు. సోమవారం కూడా విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు పిలిచారు.
పోలీస్ స్టేషన్కు పిలిచి విచారించడం అవమానంగా భావించిన వంశీ స్టేషన్‌కు వెళ్లే ముందు తనతో పాటు కూల్ డ్రింక్‌లో కలిపిన పురుగుల మందును తీసుకెళ్లాడు. పోలీసులు విచారిస్తుండగానే తనతో తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే పోలీసులు వంశీ తల్లి, సోదరిని పిలిపించి ఆస్పత్రికి తరలించగా ఎంజీఎంలో చికిత్స పొందుతూ వంశీ మంగళవారం మృతి చెందాడు. యువకుడి ఆత్మహత్య జిల్లాలో తీవ్ర చర్చనీయమైంది.
మాకు సంబంధం లేదంటున్న పోలీసులు
ఇదిలా ఉండగా పోలీసులు మాత్రం వంశీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం, చికిత్స పొందుతూ
మృతిచెందడంలో తమకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు.
నా బిడ్డను పొట్టన పెట్టుకున్నారు
దొంగతనం జరిగిందనే ఆరోపణలు చేసి తమ బిడ్డ వంశిని పోలీసులు వేధించడం వలన మృతి చెందాడని వంశీ తల్లి సోదరి కన్నీరు మున్నీరుగా విలపించారు. దొంగతనం జరిగిన ఇంటి యజమాని మాటలే నమ్మి పోలీసులు తమ కొడుకును ఇబ్బంది పాల్జేశారని విలపించారు.
పోలీసు విచారణ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. కనీసం పోలీసులు మానవత్వంతో కూడా స్పందించ లేదని విమర్శించారు. తమ ఇంటికి కొడుకే పెద్ద దిక్కని కానీ ఇప్పుడు తమ బతుకు రోడ్డున పడిందని బోరుమంటున్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు.