Wednesday, December 7, 2022
More
  Homelatestమీ రిలేషన్ షిప్ పదిలమేనా? శ్ర‌ద్ధ హ‌త్య‌తో తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే..!

  మీ రిలేషన్ షిప్ పదిలమేనా? శ్ర‌ద్ధ హ‌త్య‌తో తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే..!

  Shraddha Walkar | ముంబైకి చెందిన‌ శ్ర‌ద్ధా వాక‌ర్ హ‌త్య దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. శ్ర‌ద్ధా హ‌త్య‌తో మ‌రోసారి స్త్రీల భ‌ద్ర‌త‌కు సంబంధించి విస్తృత చ‌ర్చ జ‌రుగుతోంది. అతి కిరాతకంగా ఆమెను 35 ముక్క‌లుగా న‌రికి చంపిన ఘట‌నను త‌ల‌చుకుంటేనే మ‌హిళ‌లు జంకుతున్నారు. ఆ భ‌యాన‌క దృశ్యాలు మ‌హిళ‌ల‌ను వెంటాడుతూనే ఉన్నాయి.

  ఈ ఘటన పూర్వా పరాలు పరిశీలించినపుడు సైకాలజిస్టులు మహిళల భద్రతకు సంబంధించి.. అసలు భాగస్వామిలో కనిపించే ఏ లక్షణాల ఆధారంగా వారిలోని రాక్షసత్వాన్ని గుర్తించడం వీలవుతుందో వివరిస్తున్నారు.

  దశాబ్ధాలుగా శ్రద్ధకు సన్నిహితులుగా ఉన్న స్నేహితులు కొన్ని ఆసక్తి కరమైన విషయాలు తెలియజేశారు. వారు చెప్పిన వివరాల ప్రకారం ఆమెను మానసికంగానూ, శారీర‌కంగానూ హింసిస్తున్నాడని, తను బాయ్ ఫ్రెండ్ నుంచి విడిపోవాలని అనుకున్నట్టు సమాచారం. అయితే ఆమె వదిలేసి వెళ్లిపోవద్దని, కాదని వెళ్లి పోతే ఆత్మ హత్య చేసుకుంటానని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసేవాడని కూడా అంటున్నారు. వాళ్ల రిలేష‌న్ షిప్‌లో శ్రద్ధను ఆప్తాబ్ చాలా సార్లు శారీర‌కంగా కూడా హింసించాడు. ఆమె ఒంటి మీద దాని తాలూకు గుర్తులు కూడా చూశామని సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవలి వరకు శ్రద్ధ తన స్నేహితులతో ఫోన్‌లో టచ్‌లో ఉండేదట. విషయాలు కూడా పంచుకునేదట. ఆమె హత్యకు ముందు కొద్ది రోజులుగా ఎవరికీ కూడా అందుబాటులో లేకుండా పోయిందని అంటున్నారు. ఇలా అన్ని కోణాల్లో పరిశీలించినపుడు శ్రద్ధ, ఆఫ్తాబ్ ల మధ్య ఉన్న సంబంధమే చాలా అన్ హెల్తీగా ఉందని అర్థం అవుతోంది. మానసికంగా బాధపెట్టడం, శారీర‌కంగా హింసించడం, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం వంటివన్నీ కూడా ప్రమాద సూచికలే. అయితే చాలా మంది మహిళలకు వారి మానసిక, భావోద్వేగ హక్కుల గురించిన అవగాహన లేకపోవడం దురదృష్టకరం.

  గౌరవం చాలా ముఖ్యం

  ఎటువంటి అనుబంధంలోనైనా సరే అవతలి వ్యక్తి పట్ల గౌరవం ఉండడం అనేది చాలా ముఖ్యం. ఎదుటి వారి గతం, వర్తమానం, వారి అంగీకారం, తిరస్కారం అన్నింటిని గౌరవించగలిగినపుడే అది ఒక గౌరవప్రదమైన అనుబంధం ఏర్ప‌డుతుంది. అందుకు భిన్నంగా పొజెసివ్ నెస్, జెలసీ మీ పార్టనర్ లో కనిపిస్తే మాత్రం ఆ రిలేషన్ షిప్ సరైంది కాదని గుర్తించాలని అరోబా కబీర్ అనే మెంటల్ హెల్త్ కౌన్సెలర్ అంటున్నారు. అంతేకాదు రిలేషన్ షిప్‌లో ఉన్నపుడు మనసులో మాట నిర్భయంగా బయట పెట్టగలిగే స్వేచ్ఛ తప్పకుండా ఉండాలని కూడా ఆమె చెబుతున్నారు. మీకు కలుగుతున్న అసౌకర్యం గురించి భాగస్వామికి చెప్పినప్పటికీ ఆ పరిమితులను గౌరవించడం లేదంటే అది మొట్టమొదటి ప్రమాదసూచికగా భావించాలని కూడా ఆమె సూచిస్తున్నారు.

  శ్రద్ధ విషయంలో ఆమె ఆ రిలేషన్ షిప్ లో నుంచి బయట పడాలని అనుకున్నప్పటికీ, బయటపడలేక పోయింది. ముఖ్యంగా కుటుంబం వద్దని వారిస్తున్నా వినకుండా ఆఫ్తాబ్ తో సహజీవనం చేసింది. ఇలా గిల్టీలో ఉన్నపుడు సరైన నిర్ణయం తీసుకోలేరని చెన్నైకి చెంది ప్రముఖ సైకియాట్రిస్ట్ పద్మావతి రామచంద్రన్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి టాక్సిక్ రిలేషన్ షిప్ లో ఉన్న మహిళలు తప్పనిసరిగా సన్నిహితులతో చర్చించగలగాలి అని అంటున్నారు పద్మావతి.

  పర్సనల్ స్పేస్‌కి స్థానం లేని రిలేషన్ షిప్ ఎప్పుడైనా టాక్సిక్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. పర్సనల్ స్పేస్ అంటే ఇష్టం లేని పనులు చేయ‌మ‌ని లేదా తనకు ఇష్టం కనుక మిమ్మల్ని చేయ‌మ‌ని బలవంత పెట్టడం, ఫోన్లు చెక్ చెయ్యడం, పాస్ వర్డ్ లు తన దగ్గర పెట్టుకోవడం, ఎప్పూడు ఫైనాన్షియల్ విషయాలు ట్రాక్ చేస్తూ ఉండడం, స్నేహితులను వదిలేయ‌మ‌ని బలవంత పెట్టడం వంటివి. ఇవ‌న్నీ కూడా అగౌరవ పరచడం కిందకు వస్తాయని అందరూ తెలుసుకోవాలని అరోబా అంటున్నారు. ఇలాంటి విషయాల్లో ఎక్కువగా మహిళలే ఎక్స్ ప్లాయిట్ అవుతుంటారనేది వాస్తవం.

  ఎలా బయట పడాలి?

  ముందుగా రిలేషన్ షిప్ టాక్సిక్ గా ఉందన్న అవగాహన ఉంటే అందులో నుంచి బయటపడాల్సిన అవసరం అర్థం అవుతుంది.
  -భాగస్వామి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు పాల్పడడం అనేది అన్నింటి కంటే ముందుగా గురించాల్సిన ప్రమాద సూచిక.
  -ముఖ్యంగా మహిళలు ప్రతి విషయానికి తల ఊపూతూ చెప్పిన ప్రతి పని చేయ‌డం లేదా మానడం అవసరం లేదని తెలుసుకోవాలి.
  – చెప్పిన మాట వినలేదని భౌతికంగా హింసించడం లేదా మాటలతో బాధ పెట్టడం అనేది మరో ప్రమాద సూచికగా గుర్తించాలి.
  – కొన్ని సార్లు చెప్పిన మాట వినలేదని పబ్లిక్ ప్లేసెస్ లో కూడా అవమాన పరుస్తుంటారు. లేదా అందరి ముందు ఆమె గురించి నెగెటివ్ గా మాట్లాడుతుంటారు. ఇది మీ గౌరవానికి భంగం కలిగించడం అని మరచి పోవద్దు. అది జోక్ కాదన్న సంగతి గుర్తించండి.
  -ఎక్కడికి వెళ్లాలన్నా అనుమతి తీసుకోవాలని అనడం లేదా ఎక్కడికి వెళ్లకుండా అడ్డుకోవడం కూడా గౌరవ లేమి అని తెలుసుకోవాలి.
  ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి అవతలి వారిని ఎమోషనల్ గా లేదా ఫిజికల్ గా బెదిరిస్తున్నారంటే వారు లోపల చాలా ఒంటరిగా, బలహీనంగా ఉన్నారని అర్థం. టాక్సిక్ పార్టనర్ ఎప్పుడైనా ముందుగా చేసే పని మీకు సన్నిహితులైన వారి నుంచి మిమ్మల్ని దూరం చేసే ప్రణాళికలు వేస్తుంటారు. అలా దగ్గరగా ఎవరైనా ఉంటే మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి అదుపులో ఉంచుకోవడం సాధ్యం కాదు కనుక.

  ముఖ్యంగా ఆత్మ హత్య చేసుకుంటామని బెదిరించే వారు మానసికంగా చాలా బలహీనులని అర్థం చేసుకోవాలి. అటువంటి వారికి తక్షణమే వీలైనంత దూరంగా వెళ్లడం అవసరం. వారికి సహాయం చేయ‌గలిగే వాళ్ల‌కు అప్పగించి వారి నుంచి దూరంగా వెళ్లాలి. లేదా అసలు ఆ రిలేషన్ షిప్ లో ఎందుకు ఉండాలి? విడిచిపోతే జరిగే నష్టం ఎలాంటిది? వంటి విషయాలను ఒకసారి విశ్లేషించి బేరీజు వేసుకుంటే మంచిది. టాక్సిక్ రిలేషన్ షిప్ ఎప్పుడైనా ప్రమాదకరమే. వీలైనంత త్వరగా గుర్తించి అందులో నుంచి బయటపడడం అవసరం అని నిపుణులు నొక్కి చెబుతున్నారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page