Sunday, December 4, 2022
More
  Homelatestఈ ఆడబిడ్డను చంపుకుంటారో.. సాదుకుంటారో మీ ఇష్టం: రేవంత్

  ఈ ఆడబిడ్డను చంపుకుంటారో.. సాదుకుంటారో మీ ఇష్టం: రేవంత్

  విధాత‌: మనం తీసుకునే నిర్ణయం రాష్ట్ర భవిష్యత్ ను మారుస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.  మంగళవారం మునుగోడులో నిర్వహించిన ఆడబిడ్డల ఆత్మగౌరవ సభలో ఆయన మాట్లా డుతూ.. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి భార్య, స్రవంతి అమ్మగారు ఇక్కడి వచ్చారు. గోవర్ధన్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆమె బయటి రావడం లేదు. ఇప్పుడు స్రవంతి మీ చేతుల్లో పెట్టడానికి వచ్చారు. ఇప్పటి నుంచి స్రవంతి మీ బిడ్డ. సంపుకుంటారో.. సాదుకుంటారో మీ ఇష్టం అని రేవంత్ రెడ్డి భావోద్వేగంతో అన్నారు.

  ఈ ఎన్నికల్లో స్రవంతిని గెలిపిస్తే వచ్చే ఎన్నికల్లో 15 మంది మహిళలకు ఎమ్మెల్యే టికెట్లతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నలుగురు మహిళలకు మంత్రి పదవులు ఇస్తామన్నారు. ఆ నలుగురిలో స్రవంతి కూడా ఉంటుందన్నారు. స్రవంతిని గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకుంటా, అభివృద్ధి చేసే బాధ్యత కూడా తీసుకుంటా అని ఆయన వ్యాఖ్యానించారు. మునుగోడులో ఆడబిడ్డను గెలిపిస్తారా లేదో అనుకున్నా.. కానీ ఈ సభకు ఆడబిడ్డలంతా తరలివచ్చి తెలంగాణ నలుమూలలు పిక్కటిల్లేలా మీ అభిమానం చూపారని. ఆడబిడ్డను ఆత్మ గౌరవాన్ని చాటుతామని నిరూపించాల‌న్నారు.

  మునుగోడు నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది. ఈ గడ్డ మీద పుట్టిన ఆరుట్ల కమలా దేవి, మల్లు స్వరాజ్యం రజకార్లకు వ్యతిరేకంగా పోరాడి ఇక్కడి ఆడబిడ్డల పౌరుషాన్ని ప్రపంచానికి చాటారు. అటువంటి గడ్డ మీద ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు తీసుకునే నిర్ణయం రాష్ట్ర భవిష్యత్ ను మార్చబోతోంది. ఎనిమిదేళ్ల పాలనలో మోదీ చేసిన మోసం, కేసీఆర్ చేసిన ధోకా మీద మీరు తీర్పు ఇవ్వబోతున్నారు.

  తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ఎవరికి రాని అవకాశం మీకు వచ్చింది. మిమ్మల్ని, మమ్మల్ని, విద్యార్థులను, నిరుద్యోగులను, ఉద్యమకారులను మోసం చేసిన నట్టేటా ముంచి మన ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన కేసీఆర్ ను 100 మీటర్ల లోతులో పాతిపెట్టే అవకాశం మీకు దక్కింది. గుజరాత్, ఢిల్లీల నుంచి తీసుకొచ్చిన సీసాలు, నోట్ల కట్టలతో ఓట్లు కొనుగోలు చేయాలనుకుంటున్న బీజేపీ పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది.

  మునుగోడు ఎన్నికల్లో మూడు పార్టీల నుంచి ముగ్గురు పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలవలేదు. ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డ అని బీజేపీ నాయకులు సిగ్గు లేకుండా వ్యాఖ్యానిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏమి తక్కువ చేసింది. ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా చేస్తే కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని మోసం చేసి బీజేపీలో చేరిండు. బీజేపీలో చేరితే మాకు అభ్యంతరం లేదు. కానీ ఎవడి మాటలో విని కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని చంపాలని బొడ్డులో కత్తి పెట్టుకొని తిరుగుతుండు. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే చూస్తే ఉరుకునే ప్రసక్తే లేదని రాజగోపాల్ రెడ్డిని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

  ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచి ఇప్పుడు అభివృద్ధి పేరుతో మీ ముందుకొస్తున్నారు బీజేపీ నాయకులు. రూ. 400 ఉన్న సిలిండర్ రూ.1100 ఎందుకు అయిందని బీజేపీ నాయకులను ప్రశ్నించండి. అమ్మకు అన్నం పెట్టని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాన్నట్టుంది బీజేపీ వ్యవహారం. ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ను కాదని ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీలోకి సమస్యల మీద కోట్లాడతా, అభివృద్ధి చేస్తా, నిధులు తెస్తా అంటున్న రాజగోపాల్ రెడ్డి మాటలు ఎట్లా నమ్మాలి అని అన్నారు.

   

   

  టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని 2014లో ఎమ్మెల్యేగా గెలిపించారు. కానీ మునుగోడుకు జూనియర్ కాలేజీ తీసుకురాలేదు, కిష్టరాయినిపల్లె, చర్లగూడెం, డిండి ప్రాజెక్టు పూర్తి చేయలేదు, రాచకొండ ప్రాంతంలో గిరిజన భూములకు పట్టాలు ఇప్పించ లేదు. అయిన సిగ్గు లేకుండా మరోసారి మీ ముందుకు వచ్చి ఓట్లు అడుగుతుండు. రాజగోపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి కొత్తవారేం కాదు. వాళ్ల రంగు ఏందో అందరికీ తెలుసు. కేసీఆర్ దొడ్లో ఇప్పటికే 100 గాడిదలు ఉన్నాయి. ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే 101 గాడిద అవుతుంది తప్ప మీ సమస్యలను పట్టించుకోదు.

  బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే చత్తీస్ గఢ్ పోయి బొగ్గు తొవ్వుకుంటడు తప్పితే మీవైపు కన్నెత్తి చూడడు. అందుకే చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నా స్రవంతిని గెలిపించండి. ఈ ఆడబిడ్డను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పై ఉంది. సోనియా గాంధీ గారి ఆశ్వీరాదంతో స్రవంతిని ఇక్కడ పోటీలో నిలిబెట్టాం. ఇక్కడ తమిళనాడులోని కరూర్ ఎంపీ జ్యోతిమణి ఉన్నారు.

  ఎన్నికల సమయంలో చేతిలో చిల్లి గవ్వలేకున్నా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గార్ల ఆశ్వీరాదంతో లోకసభ డిప్యూటీ స్పీకరుగా పనిచేసిన తంబిదురైని 4లక్షల 20 వేల ఓట్ల మెజార్టీతో ఓడించి జ్యోతిమణి ఎంపీగా ఎన్నికయ్యారు. “తమిళనాడులో అటువంటి తీర్పు ఇచ్చినప్పుడు తెలంగాణ మహిళలకు ఆ శక్తి లేదా. తెలంగాణ ఆడబిడ్డలు సొంతంగా నిర్ణయం తీసుకోలేరా. మీరందరూ కలిసి ఆడబిడ్డను గెలిపించుకోలేరా. మీ శక్తి మీ ఓటు. మీ గెలుపు మీ ఓటు. మీ ఓటుతో స్రవంతిని గెలిపించుకుని మహిళా శక్తిని చాటండి ” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

  కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ మీ అందరి ఆదరాభిమానాలతోనే ఈ ఎన్నికల్లో పోటీకి దిగాను. అడుగడుగునా ఒక ఆడబిడ్డను టీఆర్‌ఎస్‌, బీజేపీ ఇబ్బంది పెడుతున్నాయని అన్నారు. మా ఆఫీసుపై, ప్రచార రథంపై దాడి చేశారు. మా నాన్న సహకారంతో రాజకీయంగా ఎదిగిన వారు నన్ను మోసం చేసే ఇతర పార్టీలకు అమ్ముడుపోయారు.

  నాకు వ్యాపారాలు లేవు, వ్యాపకాలు లేవు.. కేవలం మా నాన్న ఆశయాలను నెరవేర్చేందుకే పోటీ చేస్తున్నా. ఒక్కోసారి నేను అలిసిపోయానని అనిపిస్తుందంటూ స్రవంతి కంటతడి పెట్టారు. ఇది స్రవంతి ఎన్నిక కాదు.. బడుగు బలహీన వర్గాల ఎన్నిక దయచేసి ఒక్క అవకాశం ఇచ్చి నన్ను గెలిపించండని స్రవంతి మునుగోడు ప్రజలను కోరారు.

   

   

  ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ రంజితా రంజన్ మునుగోడు మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి మహిళలు తమ శక్తిని చూపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణను అనుకున్న విధంగా అభివృద్ధి చేసే వారమని ఆమె పేర్కొన్నారు. ఒక మహిళకు ఓటు వేస్తేనే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. కాబట్టి మీరంతా స్రవంతిని గెలిపించాలని పిలుపునిచ్చారు. మహిళ ను గౌరవించలేని వ్యక్తులకు స్రవంతి గెలుపు గుణపాఠం కావాలి అని రంజితా రంజన్ అకాంక్షించారు.

  సభలో తమిళనాడులోకి కరూర్ ఎంపీ జ్యోతిమణి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రులు శ్రీధర్ బాబు, గీతారెడ్డి, దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు.

   

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular

  You cannot copy content of this page