Kotamreddy Sridhar Reddy | ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. అధికార పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. నెల్లూరు రూరల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. తన ఫోన్‌ను అధికారపక్షం ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆరోపించారు. తనపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా ఉంచారని, గత మూడు నెలల నుంచి తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయం తనకు ముందే తెలుసు కాబట్టి.. రహస్యాలు మాట్లాడేందుకు వేరే ఫోన్ ఉందని, 12 సిమ్ కార్డులు కూడా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.
ఫేస్ టైమర్, టెలిగ్రాం కాల్స్‌ని మీ పెగాసస్ రికార్డు చేయలేదు.. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ముగ్గురు అధికారులతో నిఘా అవసరమా? అని కోటంరెడ్డి ప్రశ్నించారు. నిఘా కోసం తన నియోజకవర్గంలో ఒక ఐపీఎస్ అధికారిని పెట్టుకోండి అని సవాల్ చేశారు. క్రికెట్ బెట్టింగ్ కేసులప్పుడు కూడా అప్పటి ఎస్పీ తనపై నిఘా పెట్టారని కోటంరెడ్డి గుర్తు చేశారు. ఏపీ పోలీసు బాసు కూడా తనను ఏమీ చేయలేరు. 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఎప్పుడు ఏమి చేయాలో తనకు బాగా తెలుసుని శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు.