Yuvajana Saṅgharṣaṇa Sabha
- తొలిసారి రాష్ట్రానికి వస్తుండటంతో సభ సక్సెస్ చేస్తామంటున్న రాష్ట్ర నాయకత్వం
- యువజన సంఘర్షణ సభ ద్వారా యువతకు భరోసా
- బీఆర్‌ఎస్ వైఫల్యాలపై విరుచుకుపడే అవకాశం
విధాత: కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ రేపు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జరిగే ‘యువజన సంఘర్షణ సభలో ఆమె పాల్గొననున్నారు. ఈ సభను సక్సెస్ చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా పెద్ద ఎత్తున జనసమీరణ చేయడానికి అన్ని జిల్లాల నుంచి నిరుద్యోగులను, యువతను ప్రత్యేక వాహనాల ద్వారా తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో తెలంగాణ రాష్ట్రంలో మంచి స్పందన వచ్చింది. కాంగ్రెస్ నేతలను, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. దీనికి తోడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేపట్టిన హాత్‌సే హాత్ జోడో పాదయాత్ర విజయవంతం కావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు జోష్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తొలిసారి ప్రియాంక గాంధీ రాష్ట్ర పర్యటనకు వస్తుండటంతో ప్రాధాన్యం ఏర్పడింది.
ప్రియాంక పర్యటనకు ప్రాధాన్యం
ప్రియాంక గాంధీ ప్రచార బాధ్యతలు తీసుకున్న హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రస్తుతం కర్ణాటక ఎన్నికల ప్రచారంలోనూ ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న విమర్శలను ప్రియాంక గాంధీ ధీటుగా సమాధానం ఇచ్చారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను, వాళ్లు చెబుతున్న డబుల్ ఇంజిన్ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టారు.
హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో రాష్ట్ర, స్థానిక నాయకత్వాలు గట్టిగా కొట్లాడుతున్నాయి. వారికి అండగా కాంగ్రెస్ అగ్రనాయకత్వం, ప్రియాంక గాంధీ ప్రచారం ఆ పార్టీ గెలుపునకు దోహదం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ వైఫల్యాలను ఎండగట్టే అవకాశం
ఎన్నికల ఏడాది కావడం.. కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ, కాంగ్రెస్ అధినాయకత్వాలు తెలంగాణ రాష్ట్రంపైనే ఫోకస్ పెట్టాయి. ఇక్కడ కూడా రాష్ట్ర నాయకత్వం కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రధానంగా ధరణి వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్నది. వారికి భరోసా కల్పిస్తున్నది.
అలాగే అకాల వర్షాలతో చేతికి వచ్చిన పంటలు నేల పాలుకావడం. రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ ‘యువజన సంఘర్షణ సభ’ ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఏం చేయబోతున్నది అన్న అంశాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నది. అలాగే రైతులకు కూడా భరోసా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
మద్యం కుంభకోణంలో కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత పై ఆరోపణలు రావడం, ఆమెను ఇప్పటికే ఈడీ విచారించడం, ప్రశ్నపత్రాల లీకేజీ వల్ల నిరుద్యోగులు ఆందోళన బాట పట్టడం వంటి అంశాలపై ప్రియాంక గాంధీ ఈ సభ ద్వారా బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తుతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
రాష్ట్రంలో రెండుసార్లు అధికారం ఇచ్చినా బీఆర్‌ఎస్ ప్రభుత్వం దాన్ని సద్వినియోగం చేసుకోలేదని, పైగా విపక్ష పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించడం, విపక్షాలు చేపట్టే నిరసనలను, ఆందోళనలను అడ్డుకోవడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై కేసులు పెట్టడం వంటి అంశాలపై ప్రస్తావించే అవకాశం ఉన్నది.
రెండు గంటలే పర్యటన
హైదరాబాద్‌లో ప్రియాంకగాంధీ పర్యటన రెండు గంటలు మాత్రమే ఉండనున్నట్లు సమాచారం. రేపు (సోమవారం) సాయంత్రం 4 గంటలకు ఆమె శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఎల్బీనగర్‌కు చేరుకుని.. తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. అక్కడి నుంచి పాదయాత్రగా సరూర్‌నగర్ స్టేడియానికి చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు తిరిగి హస్తినకు పయనమవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.