విధాత: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. అంగప్రదక్షిణ టికెట్లు పొందడానికి ఇకపై భక్తులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా కీలక నిర్ణయం తీసుకుంది. అంగప్రదక్షిణ టోకెన్ల జారీని ప్రస్తుతం ఉన్న విధానం నుంచి ఆన్లైన్ పద్ధతిలోకి మార్చినట్లు వెల్లడించింది.
అంగప్రదక్షిణ టోకెన్లను బుధవారం (15వ తేదీ) నుంచి ఆన్లైన్లో భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్టు ప్రకటించింది. ఈనెల 15 నుంచి జూలై 31 వరకు రోజుకు 750 టోకెన్ల చొప్పున ఆన్లైన్లో జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ టోకెన్లు తీసుకోవాలనుకునేవారు https // tirupathibalaji.ap.gov.in అనే వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చని తెలిపారు.
పౌర్ణమి గరుడ సేవ రద్దు
పౌర్ణమి సందర్భంగా నేడు శ్రీవారి గరుడ సేవను రద్దు చేస్తున్నట్టు టీటీడీ తెలిపింది. ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా ఆలయంలో గరుడసేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే ప్రస్తుతం స్వామివారి వార్షిక జ్యేష్ఠాభిషేకం ముగింపు వేడుకలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గరుడ సేవను రద్దు చేస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది.
ఒక్కసారిగా మారిన వాతావరణం
మరోవైపు తిరుమల కొండపై రుతు పవనాల ఎఫెక్ట్ ముందుగా కనిపిస్తోంది. తిరుమల కొండపై వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మరో 24 రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నట్లు ఇప్పటికే అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ క్రమంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో తిరుమల మరింత అందంగా దర్శనమిస్తోంది.
రుతుపవనాల ఎఫెక్ట్‌తో ఆకాశమంతా దట్టమైన మేఘలు కమ్మేశాయి. దీంతో సోమవారం ఉదయం ఉన్నట్లుండి ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షంతో శ్రీవారి ఆలయ ప్రాంగణం, తిరుమాడ వీధులు, లడ్డు కేంద్రం, తిరుమల రోడ్లన్ని జలమయమయ్యాయి. మరోవైపు తిరుమల ఘాట్ రోడ్డులో గతంలో జరిగిన అనుభవాల రిత్యా అధికారులు ముందుగానే అప్రమత్తమయ్యారు.