• స‌గ‌టు ఓట‌రు మ‌న‌సులో మాట ఇదే
  • స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్న నాయ‌కులు
  • హోరాహోరీగా ఎన్నిక‌ల ప్ర‌చారం
  • రంగంలోకి పార్టీల అగ్ర నాయ‌కులు
  • ఒకే ఒక్క‌డై తిరుగుతున్న కేసీఆర్‌
  • కేంద్రీక‌రించిన రాహుల్‌, ప్రియాంక‌
  • మోదీ, అమిత్‌షాపైనే బీజేపీ ఆశలు
  • ఈసారికి అధికార పార్టీని మారిస్తే?
  • రచ్చబండలపై జోరుగా చర్చలు
  • బీఆరెస్‌కు ఈసారి గడ్డుకాలమేనా?



విధాత‌, హైద‌రాబాద్‌: ఓట‌రు ఆలోచ‌న మారిందా? స్థానిక అభ్య‌ర్థులను, వారి తీరును చూసి కాకుండా పార్టీని చూసి ఓటు వేయాల‌న్నదిశ‌గా ఆలోచన మారుతున్నదా? రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో ప్రజలు స్పందిస్తున్న తీరు, గ్రామాల్లో రచ్చబండలపై చర్చలు జరుగుతున్న సరళిని గమనిస్తే అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఎమ్మెల్యేలే కాదు.. ఆఖరుకు మంత్రుల ప్రభావం కూడా లేదని, కేవలం పార్టీ అనే ఒకే ఒక్క అంశం ఆధారంగా ఓటింగ్‌ జరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. అందుకే అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా అక్కడి ఎమ్మెల్యే అభ్యర్థి గురించి చెప్పడం కంటే తమ పార్టీల గురించి చెప్పడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఎన్నికల రణరంగం హోరాహోరీగా సాగుతున్నది. ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేశారన్నదానికంటే.. ముఖ్యమంత్రి ఎలా పనిచేశారన్న అంశం ప్రధానంగా చర్చనీయాంశంగా ఉన్నదని క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన ఒక రిటైర్డ్ టీచ‌ర్ తెలిపారు.

‘ఎమ్మెల్యేల‌ది ఏమున్న‌దిది? సీఎం అనుకుంటే చేస్తారు.. లేకుంటే లేదు. అలాంట‌ప్పుడు ఆయ‌న ఎంత మంచి మ‌నిషి అయితే మాత్రం స్థానిక అభ్య‌ర్థితో మ‌న‌కేమి అవ‌స‌ర‌మ‌న్న తీరుగా చ‌ర్చించుకుంటున్నారు. ఏ చౌర‌స్తాలో న‌లుగురు కూడినా ఇలాంటి చ‌ర్చ‌నే జ‌రుగుతున్న‌ది’ అని ఆయన తెలిపారు. గ‌తంలో ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎవ‌రికి ఓటు వేయాల‌న్న దిశ‌గా చ‌ర్చ జరిగిన‌ప్పుడు ఫ‌లాన‌ పార్టీ అభ్య‌ర్థి మంచి వాడ‌నో... లేదా చెడ్డ వాడ‌నో, అత‌నికి ఓటు వేస్తే మంచో, లేక చెడో ఏదో జ‌రుగుతుంద‌న్న చ‌ర్చ ఉండేది. కానీ ఈ నెల 30వ తేదీన జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి మాత్రం అభ్య‌ర్థి ఎవ‌ర‌నేది చూడకుండా పార్టీ మార్పు జ‌ర‌గాల‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. 10 మందిని ప‌లుక‌రిస్తే దాదాపు ఏడుగురు వ్యక్తులు.. మార్పు జ‌ర‌గాల‌ని అంటున్నార‌ని, అభ్య‌ర్థి ఎవ‌ర‌నేది కాదు.. ప్ర‌భుత్వం మారాల‌న్న తీరుగా మాట్లాడుతున్నార‌ని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఒక‌రు వ్యాఖ్యానించారు.


సెంటిమెంట్‌తో కొడుతున్నారు..

అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా నిర్వ‌హిస్తున్న ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌ల‌లో మాట్లాడుతున్న కేసీఆర్ తనను చూసి ఓటేయాలని కోరుతున్నారు. అంతేకాకుండా.. ‘తెలంగాణ కోసం కొట్లాడింది ఎవ‌డు? ఉద్య‌మం మొద‌లుపెట్టింది ఎవ‌డు? ప్రాణాలకు తెగించి, పేగులు తెగేదాకా జై తెలంగాణ అని నిన‌దించి తెలంగాణ సాధించినోడు ఎవ‌డు.? సాధించిన తెలంగాణ‌ను దేశంలో న‌వంబ‌ర్ చేసింది ఎవ‌డు? 24 గంట‌ల క‌రెంట్ తెచ్చినోడు ఎవ‌డు? ప్ర‌తి ఇంటికి మంచినీరు తెచ్చినోడు ఎవ‌డు? పంట‌ల‌కు సాగునీరు తెచ్చినోడు ఎవ‌డు? అని ప్రశ్నిస్తూ.. అంతా తన ఘనతే అని చెప్పుకొంటున్నారు.


అదే సమయంలో ప్రతి సమయంలోనూ కాంగ్రెస్ గెలిస్తే.. అంటూ ఆ పార్టీ నామ స్మరణ చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పదేళ్లవుతున్నా.. ఇప్పటికీ తెలంగాణ సెంటిమెంట్‌పైనే ముఖ్యమంత్రి, బీఆరెస్ నాయకత్వం ఆధారపడటం కొంత ఆశ్చర్యం కలిగించే అంశమేనని హైదరాబాద్‌కు చెందిన సీనియర్ అధికారి ఒకరు అన్నారు. అభివృద్ధి గురించి చెబుతున్నా.. సెంటిమెంట్ ద్వారానే ఓట్లు రాబట్టుకోవాలన్న ఆలోచన ఆయన మాటల్లో కనిపిస్తున్నదని చెప్పారు. తానేమీ తక్కువ కాదన్నట్టు.. కాంగ్రెస్ కూడా తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్‌.. అంటూ సెంటిమెంట్ ప్రయోగిస్తున్నది. అదే సమయంలో ఆరుగ్యారెంటీలు, అభయ హస్తం పేరిట విడుదల చేసిన మ్యానిఫెస్టోలని అంశాలను ఊదరగొడుతున్నది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి.. మార్పు తేవాలని విజ్ఞప్తి చేస్తున్నది. బీజేపీ సైతం.. ‘పార్టీ’నే నమ్ముకున్నది. ఒక అడుగు ముందుకేసి.. బీసీ సీఎం నినాదం ఎత్తుకున్నది. ఏది ఏమైనా.. అభ్యర్థుల కంటే.. పార్టీని దృష్టిలో పెట్టుకుని ఓటేయాలని కోరుతున్నాయి.


రంగంలోకి జాతీయ స్థాయి నాయకులు

కాంగ్రెస్‌, బీజేపీ పెద్ద ఎత్తున జాతీయ పార్టీ నాయ‌కుల‌ను తీసుకు వ‌చ్చి ప్ర‌చారం చేయిస్తున్నాయి. ఇలా ప్ర‌చారం చేయ‌డంలో కాంగ్రెస్ ముందంజ‌లో ఉన్న‌ది. తెలంగాణలో కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు దండిగా ఉన్నాయన్న అంచనాల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు.


దీనికితోడు జాతీయ స్థాయి నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, మల్లికార్జున ఖర్గే వంటి నేతలు అన్నీ తామై రాష్ట్ర కాంగ్రెస్‌ను నడిపిస్తున్నారు. బీజేపీ నుంచి మోదీ, అమిత్‌షా, నడ్డా వంటి నేతలు ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. బీఆరెస్ త‌ర‌పున ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు.. మంత్రులు కేటీఆర్‌, హ‌రీశ్‌రావు, క‌విత ‘సూపర్‌స్టార్’ క్యాంపెయినర్లుగా ఉన్నారు. వెరసి.. ఎన్నికల ప్రచారం పతాకస్థాయికి చేరుకుంటున్నది. ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు చేసుకుంటుండటంతో ప్రచారం వేడెక్కిపోయింది. అగ్ర‌నేత‌లు రాష్ట్రంలో హెలికాప్ట‌ర్ల ద్వారా సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు.


మ‌రో వైపు పోల్ మేనేజ్‌మెంట్ ఎలా జరగాలన్న అంశంలోనూ స‌మాలోచ‌న‌లు జరుగుతున్నాయి. అయితే ప్ర‌జ‌లు మాసివ్‌గా ఒక నిర్ణయానికి వస్తే.. పోల్ మేనేజ్‌మెంట్లు అనేవి అసలు పనిచేస్తాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్ర‌జ‌లు అధికార పార్టీ మారాలని కోరుకుంటే మాత్రం.. ఎలాంటి మేనేజ్‌మెంట్లు పనిచేయవని రాజ‌కీయ ప‌రిశీల‌కుడొక‌రు అన్నారు. రెండు పార్టీల మ‌ధ్య నువ్వా..? నేనా అన్న‌ట్లుగా పోరు ఉంటే ఒక‌టి రెండు బూత్‌ల‌లో పోల్ మేనేజ్‌మెంట్ చేసుకోవ‌చ్చునేమో కానీ ప్ర‌జాభిప్రాయ‌మే భిన్నంగా ఉంటే ఎంత పెద్ద నాయ‌కుడైనా ఏమీ చేయ‌లేర‌న్న అభిప్రాయాన్ని ఆయన వ్య‌క్తం చేశారు.


ఏది ఏమైనా డిసెంబర్ 3న ఏకపక్షంగా ఓటింగ్ జరుగుతుందనే అంచనా లేకపోయినప్పటికీ.. అంతర్గతంగా ఏదైనా జరగొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్గతంగా ప్రజల నాడి ఎలా ఉన్నదో తెలుసుకునేందుకు అధికార బీఆరెస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు తమకున్న యంత్రాంగాల ద్వారా విశ్వప్రయత్నం చేస్తున్నాయని సమాచారం.


ఏ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉన్నది? ఎక్కడ ఎక్కువ కేంద్రీకరించాల్సి ఉంటుంది? అదనంగా చేయాల్సిన పనులేంటి? జనం ఏమనుకుంటున్నారు? అనే అంశాలపై సమాచారాన్ని సేకరిస్తున్నారు. 30 నుంచి 35 నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మొత్తంగా పదేళ్ల బీఆరెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఛాయలు బాగానే కనిపిస్తున్నాయని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఒక‌రు అన్నారు. టీఆరెస్ పార్టీని బీఆరెస్‌గా మార్చ‌డంతోనే తెలంగాణ ఆత్మ పోయిన‌ట్లు క‌నిపిస్తోందని, దీంతో తెలంగాణ ప్ర‌జ‌లు బీఆరెస్‌ను అన్ని పార్టీల‌లాగనే చూస్తున్నారని వ్యాఖ్యానించారు. మ‌రో వైపు తెలంగాణ తెచ్చాను అన్న పార్టీకి పదేళ్లు అవకాశం ఇచ్చిన ప్రజలు.. తెలంగాణ ఇచ్చామన్న పార్టీకి మరో అవకాశం ఇవ్వాలనుకునేందుకూ అవకాశం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు.



కొంప ముంచనున్న రహస్య అవగాహన!

రాష్ట్రంలో బీఆరెస్‌, బీజేపీ మధ్య ర‌హ‌స్య అవ‌గాహ‌న ఉంద‌న్న చ‌ర్చ కూడా గ్రామాల‌లో సామాన్య ప్ర‌జ‌ల మ‌ధ్య జ‌రుగుతున్నదని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం లేదని దీని అర్థమని భావిస్తున్నారు. ప్రస్తుత రాజకీయ వాతావరణాన్ని గమనిస్తే.. కాంగ్రెస్‌కు అనుకూలంగా కనిపిస్తున్నప్పటికీ.. బీఆరెస్ అధినేత కేసీఆర్ ఆఖరి నిమిషాల్లో ప్రదర్శించే చాణక్యం ఫలితాన్ని తారుమారు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అనేక మంది మాటగా వినిపిస్తున్నది.


ప్రలోభాలు పనిచేస్తాయా?

ఓటర్లను డబ్బు, మద్యంతో ప్రభావితం చేసేందుకు అవకాశాలు ఉన్నా.. తీసుకున్న ఓటరు కచ్చితంగా ఓటు వేస్తాడన్న నమ్మకం ఎవరికీ ఉండదని చెబుతున్నారు. ప్రలోభాలకు గురిచేసినా.. ఓటరు స్థిర నిశ్చయంతో ఉంటే.. ఏదీ పనిచేయదని అనేక ఎన్నికల్లో పోలింగ్ సిబ్బందిగా పనిచేసిన రిటైర్డ్ టీచర్ ఒకరు చెప్పారు. ఇప్పటికైతే ఓటరు తన నిర్ణయం తాను తీసుకుని ఉంటాడని, ఒక 10-20 శాతం మంది మాత్రం పోలింగ్ రోజునే తమకు నచ్చిన పార్టీకి ఓటేస్తారని ఆయన తన అనుభవాలను జోడించి చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో జరిగింది ఇదేనని ఆయన గుర్తు చేశారు.

Updated On 20 Nov 2023 1:00 AM GMT
Subbu

Subbu

Next Story