మోదీ మైదానంలో జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.

  • ఫైనల్‌లో భారత్‌పై 6 వికెట్ల విజయం
  • ఆరోసారి కంగారూల రికార్డు గెలుపు
  • పది మ్యాచ్‌లు వరుసగా గెలిచి.. కీలకపోరులో తడబడిన భారత్
  • మోదీ స్టేడియంలో భారత్‌కు నిరుత్సాహం

అహ్మదాబాద్‌: క్రికెట్‌ సామ్రాజ్యానికి తానే రారాజునని మరోసారి ఆస్ట్రేలియా చాటింది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌పై ఘన విజయం సాధించింది. ఈ ప్రపంచకప్‌ మ్యాచ్‌లలో వరుసగా విజయాలు సాధిస్తూ వచ్చిన భారత్‌.. ఫైనల్స్‌లో తన సత్తా చూపలేక పోయింది. ఇప్పటికే ఐదుసార్లు టోర్నీని గెలిచిన ఆస్ట్రేలియా.. ఆరోసారి దానిని తన ఖాతాలో వేసుకుని కొత్త రికార్డు సృష్టించింది. క్రికెట్‌కు పుట్టినిల్లుగా చెప్పే ఇంగ్లండ్‌ ఒకే ఒక్కసారి విశ్వవిజేతగా నిలువగా.. రెండుసార్లు భారత్‌, రెండుసార్లు వెస్టిండీస్‌ విజయపతాకాలను ఎగురవేశాయి. తొలుత టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. నిర్ణీత 50 ఓవర్లలో భారత్‌ను 240 పరుగులకు ఆలౌట్‌ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. తొలి మూడు వికెట్లను మొదట్లోనే చేజార్చుకున్నప్పటికీ.. ట్రావిస్‌హెడ్‌ 137 పరుగులతో జట్టుకు గెలుపును ఖాయం చేశాడు. మార్నుస్‌ లాబుస్‌చేంజ్‌ (58) వికెట్ల వద్ద పాతుకుపోవడంతో భారత బౌలర్ల ఆటలు సాగలేదు. చివరిలో హెడ్‌ను ఔట్‌ చేయగలిగినా.. అప్పటికే పరిస్థితి భారత్‌ చేయిదాటిపోయింది. దీంతో ఇంకా ఏడు ఓవర్లు మిగిలి ఉండగానే.. ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. భారత జట్టులో విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ అర్ధ సెంచరీలు చేసినా.. ఉపయోగపడేలేదు.

ప్రపంచకప్‌లో వరుసగా పది మ్యాచ్‌లూ గెలిచిన భారత్‌.. ఫైనల్స్‌లో బోల్తా పడటంతో స్టేడియంలో ఉన్న సుమారు 93వేల మంది భారతీయ అభిమానులు, టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నవారు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

భారత కెప్టెన్‌ రోహిత్‌శర్మ తనదై శైలిలో ఆడినప్పటికీ.. శుభ్‌మన్‌ గిల్‌ వికెట్‌ను మ్యాచ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే కోల్పోవడంతో భారత్‌కు కష్టాలు మొదలయ్యాయి. మూడు భారీ సిక్సర్లతో రోహిత్‌శర్మ 47 పరుగులు చేయగా.. విరాట్‌ కోహ్లీ 54 పరుగులకు నిష్క్రమించాడు. కేఎల్‌ రాహుల్‌ 66 పరుగులు తప్ప మిగిలినవారెవరూ చెప్పుకోతగిన స్కోర్లు చేయలేక పోయారు. దీంతో 50 ఓవర్లు ముగిసే సమయానికి భారత్‌ 240 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

గడిచిన యాభై ఏండ్లలో క్రికెట్‌ అనేక మార్పులకు లోనైంది. అయితే.. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య 1971 జనవరి 5న మెల్‌బోర్న్‌లో నిర్వహించిన తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌.. ఒక కీలక ఘట్టంగా నిలిచింది. ఆ తర్వాత రెండేళ్లకు అప్పట్లో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కాన్ఫరెన్స్‌గా ఉన్న ప్రస్తుత ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌.. పురుషుల తొలి ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను నిర్వహించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మొత్తం 13 టోర్నమెంట్లు జరుగగా.. అందులో ఆస్ట్రేలియా ఏకంగా ఆరింటిని తన ఖాతాలో వేసుకున్నది. వెస్టిండీస్‌, భారత్‌ రెండేసిసార్లు చొప్పున గెలిచాయి. పాకిస్థాన్‌, శ్రీలంక, ఇంగ్లండ్‌ ఒక్కోసారి జగజ్జతగా నిలిచాయి.

Updated On 19 Nov 2023 4:28 PM GMT
TAAZ

TAAZ

Next Story