కేసీఆర్ కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే.. హరీష్ రావు, కవిత పని ఔట్ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు

  • బీఆర్ఎస్ నేతలారా.. బిస్తర్ సర్దుకోవాల్సిందే
  • మున్నూరుకాపులను మోసగించిన జోగు రామన్న
  • బీసీలంతా బీజేపీవైపు చూస్తున్నారు
  • ఆదిలాబాద్‌ రోడ్ షోలో ఎంపీ బండి సంజయ్ కుమార్


విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: కేసీఆర్ కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే.. హరీష్ రావు, కవిత పని ఔట్ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇన్నాళ్లు వ్యవసాయంపైనే దృష్టి పెట్టానని, ఇకపై ఉద్యోగాల సంగతి చూస్తానని, తెలంగాణలో ఇకపై ఇల్లులేని వారే ఉండబోరని కేసీఆర్ చెప్పడంపై తనదైన శైలిలో బండి వ్యాఖ్యానించారు. ‘ఇన్నాళ్లు భూములమ్మి, ప్రాజెక్టుల పేరుతో దోచుకోవడంపైనే దృష్టి పెట్టిన కేసీఆర్... ఇకపై ఉద్యోగుల సంగతి చూస్తాడట. ఉద్యోగులు ఇకపై పనికూడా చేయరు.

ఇల్లు లేని వాళ్లే ఉండరంటే.. పేదలందరినీ తెలంగాణ నుండి పాకిస్తాన్ కు తరిమేస్తాడమో?’ అంటూ ఎద్దేవాచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆదిలాబాద్ వచ్చిన బండి సంజయ్.. బీజేపీ అభ్యర్థి పాయల శంకర్ తో కలిసి రోడ్ షో నిర్వహించారు. భారీఎత్తున తరలివచ్చిన యువకులు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి పెద్దఎత్తున నిధులిచ్చింది నరేంద్రమోదీ ప్రభుత్వమే అన్నారు. పటాన్ చెరు నుంచి ఆదిలాబాద్ రైల్వే లైన్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి, రూ. 5,706 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

మహారాష్ట్రలోని చంద్రాపూర్ నుండి తెలంగాణలోని భోరాజ్ వరకు 4-లేన్ల రహదారిగా విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం రూ.350 కోట్లు, ఆదిలాబాద్ పట్టణంలోని తాంసి బస్టాండ్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.39 కోట్లు మంజూరు చేసిందన్నారు. వీటితో పాటు అనేక పనులకు కేంద్రం పెద్దఎత్తున ఆదిలాబాద్ జిల్లాకు నిధులిస్తుంటే... కేసీఆర్ ప్రభుత్వం మాత్రం వాటిని దారి మళ్లిస్తోందని విమర్శించారు. చనాక కొరాట ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. సాత్నాల ప్రాజెక్ట్‌ పై చెక్ డ్యామ్‌, పద్మశాలి కమ్యూనిటీకి మినీ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న హామీ ఇచ్చి అమలు చేయలేకపోయారన్నారు.

గిరిజనులకు మాత్రమే కేసీఆర్ పోడు పట్టాలు పంపిణీ చేయడంతో, ఎస్సీ, ఓబీసీ రైతుల పోడు భూములు అటవీశాఖ కబ్జాకు గురవుతున్నాయని అన్నారు. సిటింగ్ ఎమ్మెల్యే జోగు రామన్న అవినీతిపరుడని, మున్నూరు కాపులను మోసం చేసిన వ్యక్తి అంటూ విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే మున్నూరుకాపుల భవనానికి 3 ఎకరాల స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలోని బీసీలందరూ బీజేపీకే ఓటేయబోతున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తే సీఎం కాబోతున్నట్లు తెలిపారు.

శివాజీ అవుతారా.. బాబర్ అవుతారా?

‘కేసీఆర్ మనిషివైతే.. ఆయన నిజమైన హిందువైతే ఒవైసీకి బొట్టుపెట్టి హనుమాన్ చాలీసా చదివించాలి. ఆదిలాబాద్ హిందువులకు నేను చెప్పేదొక్కటే... ఆదిలాబాద్ యువకులారా శివాజీ అవుతారా.. బాబర్ అవుతారా? తేల్చుకోవాల్సిందే’ అంటూ బండి సంజయ్ పిలుపునిచ్చారు. భూకబ్జాదారులపై బుల్డోజర్లు దించే ప్రభుత్వం కావాలా? ప్రజలెటు పోతే నాకేంది... నేను సంపాదించుకోవడమే ముఖ్యం అనుకునే వాళ్లు కావాలా? తేల్చుకోండి అంటూ పేర్కొన్నారు. ప్రతి ఇంటి నుండి ఛత్రపతి శివాజీ, ఝాన్సీ లక్ష్మీబాయి, కొమరం బీం, అంబేద్కర్ వస్తే తప్ప హిందువులు బతికి బట్టకట్టే పరిస్థితి లేదు.. ఏ సర్వే చూసినా ఆదిలాబాద్ పై ఎగిరేది కాషాయజెండానే...రంగు రంగుల జెండాలన్నీ కాషాయ కాంతులకు మాడిమసైపోవడం తథ్యం అని అన్నారు.

Updated On
Somu

Somu

Next Story