ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరింది. పోలింగ్‌కు కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. నేతలందరూ ఇంటింటికి ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో మునిగిపోయారు

- గులాబీ పార్టీలో గుబులు
విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరింది. పోలింగ్‌కు కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అన్ని పార్టీల నేతలందరూ ఇంటింటికి ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో మునిగిపోయారు. అయితే ప్రచారంలో కొన్నిచోట్ల అధికార పార్టీ అభ్యర్థులకు నిరసన సెగలు తగులుతున్నాయి. అభివృద్ది, సంక్షేమ పథకాలపైన, పెండింగ్ హామీలపైన ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థులను నిలదీస్తున్నారు. ముఖ్యంగా సిటింగ్ ఎమ్మెల్యేలకు ఎదురవుతున్న నిరసనలు గులాబీ పార్టీలో గుబులు రేపుతున్నాయి. నిరసనల సెగ వలిగొండలో మంత్రి కేటీఆర్‌కు కూడా తగలడం బీఆరెస్ వర్గాలను కలవర పెడుతుంది. నిత్యం రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులకు ఎక్కడో ఒక చోట జనం నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. ఊర్లలో గో బ్యాక్ నినాదాలతో జనం నిలదీస్తుండటంతో అభ్యర్థులు, సిటింగ్‌లు అసహనానికి గురవుతున్నారు. అధికార పార్టీ కార్యకర్తలకు, స్థానికులకు మధ్య వాగ్వివాదాలు తోపులాటలకు దారితీస్తున్నాయి. అయితే ఇంత జరుగుతున్నా.. ఇదంతా కామన్ అని మళ్లీ మేమే గెలుస్తామని, అప్పుడు మీ సంగతి చూస్తామంటూ కొన్ని చోట్ల అనుచరులు ఓవర్ యాక్షన్ చేస్తూ మాస్ వార్నింగ్‌లకు దిగుతున్నారు.
పాత హామీలు..పథకాలతోనే పరేషాన్
పదేళ్ల పాలనలో బీఆరెస్ చేయలేక వైఫల్యం చెందిన వాటిలో మళ్లీ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్..ఉద్యోగాల భర్తీ చేస్తామని చెబుతుంది. ఆటోవాలాలకు ఫిట్‌నెస్ చార్జీలు ఎత్తివేస్తామని, సౌభాగ్య లక్ష్మితో మహిళలకు సాయం, పేదలకు ఇంటి స్థలాలు, దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మితో ఇండ్లు వంటి పథకాలను బీఆరెస్ ప్రకటిస్తుంది. ఇదే తరహాలో నియోజకవర్గాల్లో సిటింగ్ ఎమ్మెల్యేలు కూడా రోడ్లు, ఇండ్లు, కాలేజీలు, సాగు, తాగునీటి వసతి వంటి వాటిపై హామీలిస్తున్నారు. సరిగ్గా ఇక్కడే వారికి నిరసనలు ఎదరవుతున్నాయి. పదేళ్లలో చేయలేని మీరు మళ్లీ వస్తే చేస్తామనడం అవకాశవాదమేనన్న ఆగ్రహం జనంలో బీఆరెస్ అభ్యర్థుల ప్రచారంలో నిరసనలను రగిలిస్తుంది. సొంత పార్టీలో అసమ్మతి వాదులను, అలకపాన్పులెక్కిన కేడర్‌ను మేనేజ్ చేసుకున్నప్పటికి ప్రజలకు సర్ధిచెప్పడం మాత్రం పలుచోట్ల అభ్యర్థులకు కష్టసాధ్యంగా తయారైంది.
నిరసనలు...వాగ్వివాదాలు
బీఆరెస్ సిటింగ్ ఎమ్మెల్యేల్లో ఎక్కువ శాతం రెండు పర్యాయాలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. పదేళ్లుగా మా గ్రామాలకి ఏం చేశారో చెప్పాలంటూ నిలదీస్తున్నారు జనం. వారు తమ నియోజకవర్గాల్లో ఇప్పటిదాకా చేసిన పనితీరును భేరీజు వేసుకుంటు ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో వారిచ్చే హామీలను విశ్లేషించుకుంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆరెస్ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సహా స్వయంగా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలంతా వచ్చి వరాల జల్లులు కురిపించి ఆ ఎన్నికల్లో గెలిచామనిపించారు. ఆ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో మెజార్టీగా అమలు కాకపోవడం ఇప్పుడు కూసుకుంట్లకు గ్రామాల్లో జనం నుంచి నిరసనలను చవిచూపిస్తుంది. ఇదే రీతిలో రీజినల్ రింగ్ రోడ్డు వివాదంలో భువనగిరి సిటింగ్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి బాధిత గ్రామాల ప్రజల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి.
ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గాదరి కిశోర్ వంటి వారికి పథకాల అందని దళితులు, బీసీలు, ఇండ్లు లేని పేదల నుంచి నిరసన స్వరాలు వినిపించేలా చేశాయి. చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవింశంకర్‌కు నీలోజుపల్లి, వరదవెల్లి గ్రామస్తుల నుంచి గో బ్యాక్ నినాదాలు, నిరుద్యోగుల చెప్పు ప్రదర్శన ఎదురైంది. మంత్రి గంగుల కమలాకర్‌కు ఎలబోతారం, మందులపల్లిలో నిరసనలు ఎదురయ్యాయి. వరంగల్ జిల్లాలో జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి, డోర్నకల్‌లో సిటింగ్ రెడ్యానాయక్‌కు, మహబుబాబాద్‌లో శంకర్ నాయక్‌కు, భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డికి, పరకాలలో చల్లా ధర్మారెడ్డికి, స్టేషన్ ఘనపూర్‌లో కడియం శ్రీహరికి, వరంగల్ ఈస్ట్‌లో నరేందర్‌కు జనం నుంచి పాత హామీలపై నిలదీతలు, నిరసనలు ఎదురయ్యాయి. జుక్కల్‌లో హనుమంత్ షిండేకు, ఆందోల్‌లో క్రాంతికుమార్‌కు సైతం నిరసనలు తప్పలేదు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి గంగసముద్రంలో గ్రామస్తులు పథకాల అమలు తీరును ప్రశ్నిస్తూ ఫ్లెక్సీ ప్రదర్శనతో నిరసన తెలిపారు.
ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు దళితబంధు పథకంపై నిరసన ఎదురైంది. చెన్నూరు నియోజకవర్గం బాబురావు పేటలో బాల్క సుమన్‌తో స్థానికుల నుంచి వాగ్వివాదానికి దిగారు. ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డికి జాహోల, గన్నోరం గ్రామాల్లో, ఖానాపూర్ అభ్యర్థి జాన్సన్ నాయక్‌కు మద్దిపడగలో, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావుకు దండెపల్లి, హాజీపూర్‌లలో, అదిలాబాద్‌లో జోగు రామన్నకు, బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు, గ్రేటర్ హైద్రాబాద్‌లో మంత్రి మల్లారెడ్డికి నిరసనలు తప్పడం లేదు. చెవేళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు ఎల్కగూడ, కుత్బుద్ధిన్ గూడలలో స్థానికుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి.
