డైనమిక్ లీడర్, ములుగు కాంగ్రెస్ అభ్యర్థి, మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, సిటింగ్ ఎమ్మెల్యే ధనసరి అనసూయ సీతక్కను ఓడించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పద్మవ్యూహం

- ఓటమే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహం
- ఘాటు విమర్శలు, ప్రత్యేక ప్రణాళిక
- సిటింగు ఎమ్మెల్యే కాబట్టి వ్యతిరేకత
- కుట్రలెన్నిచేసినా? ప్రజలు నా వెంటే
- బీఆర్ఎస్ కుట్రలను ఎండగట్టాలి
- నైతిక మద్దతునందించాలని వినతి
- ములుగు కాంగ్రెస్ అభ్యర్థి ధనసరి అనసూయ సీతక్క
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: డైనమిక్ లీడర్, ములుగు కాంగ్రెస్ అభ్యర్థి, మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, సిటింగ్ ఎమ్మెల్యే ధనసరి అనసూయ సీతక్కను ఓడించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పద్మవ్యూహం పన్నుతున్నాదంటే ఔనని ములుగు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆమెను ఓడించేందుకు ప్రత్యేక ప్రణాళికతో పాటు దాని అమలుకు అవసరమైన నాయకులు, వనరులు, మందీమార్భలంతో అటవీప్రాంతంలో దిగిపోయారు. సీతక్క వ్యక్తిత్వం లక్ష్యంగా విమర్శలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎన్నడూలేని స్థాయిలో విష ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని కాంగ్రెస్ ముఖ్యనేతలు ఆగ్రం వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికలన్న తర్వాత గెలుపోటములుంటాయీ.... ప్రత్యర్థిని ఓడించి తమ పార్టీ అభ్యర్థిని గెలుపించుకునేందుకు ప్రయత్నించడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ, ఏ అంశంమైన చులకనగా మాట్లాడుతూ తాత్కాలిక ప్రయోజనం సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఎన్నికలకు ఆరునెలల ముందు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ములుగుపై దండయాత్ర ప్రారంభించారని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
- కాంగ్రెస్ లో డైనమిక్ లీడర్
పార్టీని పక్కకు పెట్టి, అభివృద్ధి, సంక్షేమం అంశాన్ని పక్కకుపెడితే ప్రజానాయకురాలిగా, నిత్యం ప్రజా సమస్యల వెంట నడిచే వ్యక్తిగా సీతక్కకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆమె తీరును బీఆర్ఎస్ ముఖ్యనేతలు కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇతర రాజకీయ పక్ష ముఖ్యనేతలు అంగీకరించిన అంశమే అయినప్పటికీ, ఎన్నికల వేళ బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కాలంలో తాను చేసిన సేవలను రీల్స్ గా అభివర్ణించడం పట్ల తాత్కాలికంగా ఆనందపడవచ్చేమోకానీ, తమకు చేతగాని పనిని హేళన చేస్తున్నారంటున్నారు. ముందు ప్రజల నుంచి సీతక్కను దూరం చేయాలనే యత్నిస్తున్నారు. లాజికల్ గా అభివృద్ధిని పట్టించుకోలేదంటూ తమకున్న ప్రచార వనరులను వినియోగించుకుని సెగ్మెంట్లో బాధ్యతలు నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ, ఓ కార్పొరేషన్ చైర్మన్, మాజీ జడ్పీ చైర్మన్లతో మండలానికో నేతను దింపి సర్వశక్తులొడ్డుతున్నారు. ప్రజలను గందరగోళపరిచే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమ ఖాతాలో వేసుకుంటూ పెండింగ్ లో ఉన్న పనులను మాత్రం సీతక్క ఖాతాలో వేస్తున్నారు. ఈ అంశానికి వస్తే ఈ నియోజకవర్గం నుంచి మంత్రి సత్యవతి ఇంచార్జ్ గా, ఎంపీ మాలొత్ కవిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో కుసుమ జగదీష్, ఇప్పుడు అభ్యర్థి బడే నాగజ్యోతి జడ్పీ చైర్మన్ గా, గతంలో వైఎస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారనే విషయాన్ని, అధికారంలో గత పదేళ్ళు బీఆర్ఎస్ ఉందనే విషయాన్ని విస్మరించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్ సీతక్కకు సవాల్ చేస్తున్నారు. ప్రజాగొంతుకగా పేరున్న సీతక్క పరిస్థితే ఇలా ఉంటే రాష్ట్రంలో విపక్ష ఎమ్మెల్యేల పరిస్థితి ఏవిధంగా అర్థం చేసుకోచ్చంటున్నారు.
- చర్చకు పెడుతున్న నక్సలైట్ నేపథ్యం
సమైక్య పార్టీలో పనిచేసి, బీఆర్ఎస్ లో చేరిన మాజీ మార్క్సిస్టు నాయకుడు మాట్లాడుతూ బడే నాగజ్యోతి తండ్రి, తల్లి నక్సలైట్ పార్టీలో పనిచేసి ఎన్ కౌంటరయ్యారని చెబుతున్నారు. ఇది నిజం కూడా. కానీ, బడే నాగజ్యోతికి ఆ ఉద్యమ నేపథ్యమేమిలేదనే అంశాన్ని చర్చకు రాకుండా యత్నించడం పట్ల విమర్శిస్తున్నారు. సీతక్క విద్యార్థి దశలోనే అడవిబాట పట్టింది. ఓ రెండు దశాబ్దాలు ప్రజల కోసం పనిచేసింది. చివరికి ఎన్నికల రాజకీయాల్లో పాల్గొంటోంది. ఉద్యమంలో కొన్నేళ్ళు పనిచేసిన సీతక్కకు మరో ఆదివాసీ బిడ్డకు పోటీపెట్టడం సిగ్గుమాలిన వ్యవహారంగా ఆదివాసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. సీతక్క కుటుంబంలో ఇద్దరు ఎన్ కౌంటరయ్యారనే విషయాన్ని విస్మరిస్తున్నారు. నాగజ్యోతి పేద ఆదివాసీ బిడ్డనే... అమె వెనుక అధికార పార్టీ, సీతక్క వెనుక ప్రతిపక్ష పార్టీలున్నాయనే విషయాన్ని విస్మరించడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది.
- బ్యాలెట్ పేపర్ లో చిన్నదిగా ఫొటో
బ్యాలెట్ పేపర్ ముద్రణలో సీతక్క ఫొటో చిన్నదిగా పెట్టారు. ఈ విషయమై సోమవారం అర్ధరాత్రి వరకు ఆర్వో ఆఫీస్ వద్ద సీతక్క, కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. అధికారుల హామీతో రాత్రి ఒంటిగంట తర్వాత విరమించారు. అధికార బీఆర్ఎస్ నేతల ఒత్తిడి మేరకు ఈ కుట్రలకు తెరలేపారని విమర్శించారు. ములుగులో సీతక్కకు మద్దతుగా వచ్చే ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు, నాయకులు బసచేసే గెస్ట్ హౌజ్ లు, లాడ్జిలపై అధికారులు తరచూ దాడులు చేస్తున్నారు. సోమవారం రాత్రి రామప్ప గెస్ట్ హౌజ్ పై దాడులు చేసి అక్కడ బసచేసిన కర్ణాటక ఎమ్మెల్యేను ఇబ్బందిపెట్టారని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఫిర్యాదుల మేరకు దాడులు చేయడం తప్పు కాదు. ఇదే విషయం అధికార పార్టీ నేతలకు వర్తించవా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనితో పాటు ఎక్కడ డబ్బులు దొరికినా సీతక్క డబ్బులే అంటూ ప్రచారం చేయడాన్ని చూసి కొందరు నవ్వుకుంటున్నారు. నియోజకవర్గంలోని వార్డు మెంబర్ నుంచి జడ్పీటీసీ వరకు రేటుకట్టి ప్రధాన పార్టీ పంపిణీ చేసిందనే చర్చ జోరుగా సాగుతోంది. పార్టీలో, నాయకురాలిపట్ల, తనచుట్టూ ఉన్న వారిపట్ల అపనమ్మకం కలిగే విధంగా చేస్తున్నారని మండిపడుతున్నారు.
- సిటింగు ఎమ్మెల్యే కాబట్టి వ్యతిరేకత
ఇదిలాఉండగా తాము సిటింగు ఎమ్మెల్యే కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. అదే విషయాన్ని తాము ప్రచారం చేస్తున్నామంటూ చెబుతున్నారు. ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడం, తమ పార్టీ అభ్యర్థి విజయానికి సర్వశక్తులు కూడగట్టుకోవడంలో తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. అధికారుల దాడులు, ఇతర అంశాలకు తమకు సంబంధం లేదని చెబుతున్నారు. తమపై కాంగ్రెస్ పార్టీ, సీతక్క తప్పుడు విమర్శలు చేస్తున్నారని చెబుతున్నారు.
కుట్రలెన్ని చేసినా ప్రజలు నా వెంటే
- కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ధనసరి అనసూయ సీతక్క
అధికార బీఆర్ఎస్ నేతలు ములుగులో నన్ను ఓడించేందుకు ఎన్నికుట్రలు చేసినా ప్రజలు నావెంటే ఉంటారనే విశ్వాసాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ధనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో మంగళవారం ఆమె ‘వరంగల్ ప్రత్యేక ప్రతినిధి’తో మాట్లాడారు. తాత్కాలిక ఆనందం కోసం కొందరు బీఆర్ఎస్ నేతలు, ప్రజా జీవితం పట్ల గౌరవం లేని వారు, డబ్బుతో రాజకీయాలు చేసే కొందరు, ఆపార్టీ ముఖ్యనేతకు బినామీగా వ్యవహరిస్తున్న వారు తనపై అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. తానేంటో ములుగు ప్రజలకు స్పష్టంగా తెలుసన్నారు. తాను రెండు దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. దురదృష్టవశాత్తు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ప్రతిపక్షానికి పరిమితం కావడం వల్ల అభివృద్ధి కోసం పోరాడడం తప్ప తానేమీచేయలేక పోయానని చెప్పారు.
ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, తాను మంత్రినయ్యే అవకాశం ఉందంటే బీఆర్ఎస్ ముఖ్యనాయకులు తనను విమర్శిస్తున్నారని, ఆదివాసీ బిడ్డను, తొలుత ఉద్యమం, తర్వాత రాజకీయాల్లో సీనియర్ గా ఉన్న తనకు కలగనే హక్కులేదా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబమే పదవులు అనుభవించాలా? అంటూ ప్రశ్నించారు. వ్యక్తిత్వ హణనం చేసి కొంతమంది తాత్కాలిక ఆనందం చెందితే చెందొచ్చన్నారు. బీఆర్ఎస్ కుట్రలను ఎండగడుతూ సోషల్ మీడియా ద్వార అన్నివర్గాలు తనకు నైతిక మద్దతునందించాలని సీతక్క విన్నవించారు. కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ను గద్దె దింపేందుకు ప్రజలు నిర్ణయించుకున్నారని, బీఆర్ఎస్ గత ఎన్నికల్లో సకల ప్రయత్నాలు చేసినప్పుడే ప్రజలు తనను ఆశీర్వదించారని, ఇక ఈసారి ప్రజలు భారీ మెజార్టీతో తనను దీవిస్తారని, వారి సేవలో ముందుంటానని సీతక్క వివరించారు.
