ఇందిరమ్మ రాజ్యం అంటేనే దోపిడీ రాజ్యమని నకిరేకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ అన్నారు

విధాత: ఇందిరమ్మ రాజ్యం అంటేనే దోపిడీ రాజ్యాయని నకిరేకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ అన్నారు. నకిరేకల్ నియోజకవర్గానికి సాగునీళ్లు కూడా తెచ్చాం. ధర్మారెడ్డి కాల్వ, పిల్లాయపల్లి కాల్వ, బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు. అవన్నీ ట్రయల్ రన్ కూడా అయిపోయాయి. ఈ ప్రాజెక్టు అయిపోతే ఒక లక్ష ఎకరాలకు నీళ్లు వస్తాయి. రాబోయై ఐదారు నెలల్లో నీళ్లు తీసుకువచ్చే బాధ్యత నాది అని మనవి చేస్తున్నా. ధర్మారెడ్డి, పిల్లాయపల్లి కాల్వలు 70 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు కూడా అయిపోతాయి. దాన్నుంచి కూడా నీళ్లు వస్తాయి.
కాళేశ్వరం ప్రాజెక్టును లింక్ చేసి భువనగిరి దగ్గర కట్టిన బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి రామన్నపేట మండలానికి బ్రహ్మాండంగా నీళ్లు వస్తాయి. రామన్నపేట చాలా కరువు ప్రాంతం నాకు తెలుసు. అందుకే బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి ప్రొవిజన్ పెట్టినం. ఆ నీళ్లు కూడా మీకు వస్తాయి. కరెంట్ మంచిగా ఇస్తున్నాం. ధాన్యం కొంటున్నాం. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న మాటలు చాలా ప్రమాదం.
ఇందిరమ్మ రాజ్యం అంటేనే దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం. ఎవ్వళ్లు ఏం చేసిండ్రు. ఎవరి చేతిలో అధికారం ఉంటే ఏం చేస్తరు. ఎవ్వళ్లు ప్రజల కోసం పాటు పడుతారు అనేది ఆలోచించి మీరు ఓటేసినట్టే అయితే మీకు లాభం జరుగుతది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నర్రా రాఘవరెడ్డి ఎండిపోయిన వరి కంకులు చూపిస్తుండే. కరెంట్ కోసం రోజు కొట్లాడుతుండే. విజయవాడ రోడ్డు అప్పుడప్పుడు బంద్ చేపిస్తుండే. అప్పుడుప్పుడు అసెంబ్లీలో కంకులు తెచ్చి చూపిస్తుండే. అటువంటి మహానాయకుడు ఈ గడ్డ మీద పుట్టారు. కమ్యూనిస్టు సోదరులకు మనవి చేస్తున్నా. ఇక్కడ మీరు పోటీలో లేరు. మీ ఓట్లు ఎవరికో వేసి మోరిలో పడేయకండి. ఒక ప్రగతికాముకమైన బీఆర్ఎస్ పార్టీకి దయచేసి వేయండి. లింగయ్యకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నా.
లింగయ్య ప్రజల్లో ఉండే మనిషి. ఆయన వ్యక్తిగత పనులు ఏ రోజు అడగలేదు. కాల్వలు, అయిటిపాముల ఎత్తిపోతల, బ్రాహ్మణ వెల్లెంల, హాస్పిటళ్ల గురించి అడిగిండు. ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి, బ్రహ్మాండంగా గెలిపించండి. లింగయ్య గెలుపును ఎవడు ఆపలేడు. ప్రజా శక్తి ముందు వ్యక్తులు ఎవరేం చేయలేరు. కాయలు ఉన్న చెట్టు మీదనే రాళ్లు పడుతాయి. రందీ పడాల్సిన అవసరం లేదు. ఇంత ప్రజా శక్తి నీ వెంట ఉన్నది.. తప్పకుండా విజయం నీదే.. అందులో అనుమానమే లేదు. లింగయ్యను గెలిపించండి.. ఇది వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి, ప్రత్యేక శ్రద్ధ పెట్టి దీన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను.
రైతుబంధు వేస్ట్ అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రైతుబంధు ఉండాలంటే చిరుమర్తి లింగయ్య గెలవాలి. అంతేకాదు రైతుబంధు 10 వేల నుంచి 16 వేలు అయితది. 24 గంటల కరెంట్ ఉండాలంటే లింగయ్య గెలవాలి. కాంగ్రెస్ గెలిస్తే 3 గంటలే ఇస్తామని చెబుతున్నారు కదా..? 10 హెచ్‌పీ మోటారు పెట్టుకోవాల్నాటా. 3 లేదా 5 హెచ్‌పీ మోటార్లు రైతుల వద్ద ఉంటాయి. తెలంగాణలో 30 లక్షల పంపు సెట్లు ఉన్నాయి. వీటన్నింటికి 10 హెచ్ పీ మోటార్లు పెట్టాలంటే 30 వేల కోట్లు కావాలి. ఎవడు ఇయ్యాలి. వీని అయ్య ఇస్తడా.. అందుకోసం దయచేసి ఆలోచించాలి. ఇది సీరియస్ విషయం.
ఇంకో మాట చెబుతున్నారు. అంది ఇంకా డేజంర్. రాహుల్, భట్టి, రేవంత్ చెబుతున్నాడు. కోమటిరెడ్డి కూడా దానికి సన్నాయి వాయిస్తున్నాడు. ఏదంటే కాంగ్రెస్‌కు అధికారం వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తరట. దాని ప్లేస్‌లో భూమాత తెస్తరట. అది భూమాతనా..? భూమేతనా..? ధరణి ఎందుకు తెచ్చాంటే మీ భూముల మీద అధికారుల పెత్తనం ఉండే. ఇప్పుడు ఆ అధికారాన్ని మీకే కల్పించాం. ధరణి ద్వారా రైతుబంధు డబ్బులు నేరుగా మీ ఖాతాలో పడుతున్నాయి. ధరణి ఎత్తేస్తే ఈ డబ్బులు ఎలా వస్తాయి..? అనే విషయాన్ని ఆలోచించాలి.
