తెలంగాణలోని ఆటో డ్రైవర్లకు తెలంగాణ సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి బీఆరెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటోలకు సంబంధించిన ఫిట్‌నెస్ ఛార్జీలు, సర్టిఫికెట్ జారీలను రద్దు చేయనున్నట్లు ప్రకటించారు

- ఫిట్‌నెస్ చార్జీల రద్దు చేస్తామని ప్రకటన
విధాత : తెలంగాణలోని ఆటో డ్రైవర్లకు తెలంగాణ సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి బీఆరెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆటోలకు సంబంధించిన ఫిట్‌నెస్ ఛార్జీలు, సర్టిఫికెట్ జారీలను రద్దు చేయనున్నట్లు ప్రకటించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ఎవరినీ వదలకుండా ప్రతి ఒక్కరికీ సహాయం చేశామన్నారు.
ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తరట కాంగ్రెసోళ్లు. వాళ్లు వస్తే వచ్చినాటికి సచ్చినాటికి కానీ. కాంగ్రెస్ మాటలను మీరంతా విమర్శించాలి. ధరణి తీసి బంగాళాఖాతంలో వేసి భూమాత పెడుతరట. అది భూమాతనా.. భూమేతనా..? మళ్లా వీఆర్‌వోలను తీసుకొస్తాం. 34 కాలమ్స్ పెడుతాం. కౌలుదార్ల కాలం పెడుతాం. అంటే రైతులకు కౌలుదార్లకు జుట్లు జట్లు ముడేస్తర..? ధరణి తీస్తే రైతుబంధు ఎలా వస్తుంది. మళ్లా వీఆర్వోలు, అగ్రికల్చర్ ఆఫీసర్లు సంతకం, సర్టిఫికెట్ తీసుకురా అంటరు. మళ్లీ లంచాలు, దళారీల రాజ్యం, వీఆర్ఎవోల రాజ్యం వస్తది.
మీ భూముల మీద యాజమాన్యం మీ చేతుల్లో లేకుండే. పెత్తనం ఆఫీసర్లది ఉండే. ఇప్పుడే హక్కులు మీకే ఇచ్చాం. మీ బొటనవేలితో మీ భూమి హక్కు మారుతుది. మీ భూమిని సీఎం కూడా మార్చలేడు. మరి ఇంత మంచిగా ఉన్న అధికారాన్ని తీసి ఉంచుకుంటారా..? పొడగొట్టుకుంటారా..? దయచేసి నిర్ణయం చేయాలి. ఆలోచన చేయాలి. మళ్లా ధర్నాలు, నిరసనలు, బాలకిషన్ పాటలు.. మన బతుకే ఉద్యమమా..? గత పదేండ్ల నుంచి 70 ఏండ్లలో లేనంత శాంతంగా ఉంది తెలంగాణ. ఎవరికి తోచిన పని వారు చేసుకుంటున్నారు. వ్యవసాయ రంగం కుదుటపడ్డది. రైతుల ముఖాలు తెల్లవడ్డాయి. గ్రామాల్లో ఇండ్లు కట్టుకున్నాం. పల్లెల్లో పల్లె దవాఖానాలు, బస్తీల్లో బస్తీ దవాఖానాలు, నియోజకవర్గంలో 100, 200 పడకల దవాఖానాలు, హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నాం.
తెలంగాణలో కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుంది కాబట్టి.. తాలుకాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడుతాం. స్థానిక పిల్లలకు ఉద్యోగాలు, పనులు దొరుకుతాయి. ఇక ఇండ్లు లేని వారికి ఇండ్లు కట్టేది ఉంది. ఒక యుద్ధ ప్రతిపాదికన కడుదాం. డబుల్ బెడ్రూం ఇండ్లు కానీ, గృహలక్ష్మీ కానీ ఈ వచ్చే ఐదేండ్లలో ముమ్మరంగా కడుదాం. తెలంగాణలో వడ్లు ఎలా పండుతున్నాయో ఇండ్ల నిర్మాణం కూడా అట్లనే జరుతది వచ్చే ఐదేండ్లు. మనం పడితే గట్టిగ పడుతం కదా..? ఇండ్ల జాగాలు లేనోళ్లకు జాగాలు ఇప్పిద్దాం. సొంత జాగ ఉన్నోళ్లకు డబ్బులు ఇద్దాం. ఇల్లు లేని మనిషి లేకుండా చేసుకుందాం. ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్దాం.
మానకొండూరు నియోజకవర్గంలో మీకు నలుదిక్కులా నాలుగు రిజర్వాయర్లు ఉన్నాయి. అటు అన్నపూర్ణ, మిడ్ మానేరు, ఇటు లోయర్ మానేరు, తోటపల్లి. మిడ్ మానేరు కాలువ తోటపల్లిలో పారేస్తే 35 వేల ఎకరాలు పారుతుంది నియోజకవర్గంలో. ఇదంతా మీ కళ్ల ముందుంది. బెజ్జంకి మండలంలో ఎంత కరువు ఉండే. ఎంత దెబ్బతిన్నాం. ఎంత అవస్థ ఉండే. ఇవాళ కొంత ముఖం తెలివి అయినం. ఇంకా నీళ్లు రావాలి. ఇంకా చేసుకుందాం. ముందకు పోదాం.
హుజురాబాద్‌లో పెట్టిన మాదిరిగానే మానకొండూరులో దళితులందరికీ ఒకేసారి ఇవ్వాలని బాలకిషన్ కోరారు. 80 వేల మెజార్టీతో గెలిపించండి.. గ్యారెంటీగా పెడుతాం. మొత్తం దళిత కుటుంబాలకు దళితబంధు ఇచ్చే బాధ్యత నాది. స్కీం సాంక్షన్ చేయడమే కాదు.. హుజురాబాద్‌కు పోయిన మాదిరిగానే నేనే మానకొండూరు వచ్చి అమలు చేయిస్తాను. దళిత బిడ్డలు తరతరాలుగా వివక్షకు గురయ్యారు. వెలివేయబడ్డారు, అణిచివేయబడ్డారు.
నెహ్రూ ఆ రోజు దళితుల గురించి ఆలోచించి ఉంటే 75 ఏండ్ల తర్వాత ఇంత దరిద్రం ఎందుకు ఉంటుండే ఈ దళిత జాతిలో. దేశానికి ఈడికెళ్లి బుద్ది చెప్పాలని చెప్పి దళితబంధు తీసుకొచ్చిన. ఆ పథకం ఇవాళ కాంతులు నింపుతుంది దళితుల ఇండ్లలో. ఎన్నో రాష్ట్రాల నుంచి హుజరాబాద్‌కు వచ్చి ఆ పథకాన్ని పరిశీలిస్తున్నారు. మనం ఉదాహరణ అయ్యాం. మన స్కీంలు చాలా వరకు అట్లనే ఉన్నాయి. ఓట్లు అనగానే ఆగమాగం కాకుండా చెప్పుడు మాటలు వినకుండా, ఆలోచించి ఓటేయండి.
ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అన్నమే లేకుండే.. తిన్నోడు తిన్నడు తిననోడు తినలేదు. ఇందరిమ్మ రాజ్యం బాగుంటే ఎన్టీ రామరావు పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది. ఇందిరామ్మ రాజ్యం బాగుంటే.. ఎన్టీ రామారావు 2 రూపాయాలకే కిలో బియ్యం ఎందుకు పెట్టాల్సి వచ్చింది. ఇవన్నీ ఆలోచించాలి. ఆ బియ్యం పెట్టిన తర్వాత పేదల కడుపు నిండింది. అప్పటిదాకా సగం తిని సగం పడుకున్న వాళ్లు ఉండ్రి. ఇది నిజం కదా..? ఇందిరమ్మ రాజ్యం సక్కగా ఉంటే హైదరాబాద్, బొంబై, భీవండి ఎందుకు వలసపోయారు. కూలినాలీ చేసుకునే గతి ఎందుకు పట్టింది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ. అందర్నీ పట్టుకుపోయి జైళ్లో వేసుడు. ప్రభుత్వాలు కూలగొట్టుడు. అది ఇందిరమ్మ రాజ్యం అంటే. ఉన్నోడు ఉండే లేనోడు లేకనే ఉండే.
మళ్లా ఆ రాజ్యం తెస్తమని మాట్లాడుతున్నారు ఎవర్ని గోల్ చేయడానికి. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది ఇదే కాంగ్రెస్ పార్టీ కదా..? 58 ఏండ్లు కోట్లాడి బయటపడ్డాం. ఎంతో గోస పోసుకున్నారు. ఇల్లంతకుంటలో నా క్లాస్‌మేట్స్, స్నేహితులు ఉండే, సిద్దిపేటలో చదివినోళ్లు. పెళ్లిళ్లకు కూడా వచ్చాను. ఎక్కడ చూసినా దుబ్బలే ఉండే. ఏం లేకుండే, మన్ను కూడా లేకుండే, బతక లేకుండా ఉండే. వానాకాలం పంట పండితే పండినట్టు. చివరకు గడ్డి లేక పశువులను అమ్ముకున్న దయనీయ పరిస్థితి.
ఎవరినీ వదలకుండా ప్రతి ఒక్కరికీ సహాయం చేశాం. ట్రాఫిక్ పోలీసులు పొద్దాక పొగలో ఉంటరు కాబట్టి శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటరు. భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క తెలంగాణలోనే 30శాతం అలవెన్స్ వారి వేతనంలో ఇస్తున్నాం. భారతదేశంలో హోంగార్డులకు అత్యధిక వేతనం ఇచ్చే రాష్ట్రం తెలంగాణనే. ఎక్కడ కూడా ఇంత ఇవ్వరు’.
‘ఆటోరిక్షా పోరగాళ్లు ఉన్నరు. వాళ్లకు నేను ఇవాళ శుభవార్త చెబుతున్నాను. వారికి ఆదాయం వచ్చే తక్కువ. నరేంద్ర మోదీ విపరీతంగా డీజిల్ ధర పెంచేటట్టు చేసిండు. దేశవ్యాప్తంగా ఆటో రిక్షా కార్మికుల దగ్గర ముక్కుపిండి పన్ను వసూలు చేస్తరు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాంగనే పన్ను రద్దు చేసిన. రూపాయి పన్ను లేదు. ఇప్పుడు వాళ్లకు ఏం బాధ ఉన్నదంటే. సంవత్సరానికి కోసారి ఫిట్‌నెస్ చేయించుకోవాలి. ఆ ఫిట్‌నెస్‌కు వెళితే రూ.700 ఛార్జి చేస్తరు. సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.500 ఛార్జీ వేస్తున్నరు. మొత్తం కలిపి రూ.1200 అవుతుంది. ఈ సారి బీఆర్‌ఎస్ గవర్నమెంట్ వస్తే ఫిట్‌నెస్ పన్నును రద్దు చేస్తమని ప్రకటిస్తున్నా.
కరీంనగర్‌కు నాకు ఏదో శ్రుతి ఉన్నది. కరీంనగర్ భీముడు కమలాకర్ మొన్న అన్నడు. మీకు కరీంనగర్‌కు ఏదో లింక్ ఉన్నది సార్ అన్నడు. లింక్ అయితే ఉన్నదనుకో ఇక్కడి నుంచే పెళ్లి చేసుకున్న. కరీంనగర్ పిల్లనే పెళ్లి చేసుకున్న. నేను కరీంనగర్ ఎప్పుడు వచ్చినా ఏదో స్కీమ్ ప్రకటిస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలోని ఆటో కార్మికులకు ఫిట్‌నెస్ ఛార్జి, సర్టిఫికెట్ ఛార్జీలను రద్దు చేస్తాం. తక్కువ ఆదాయం ఉన్న ప్రజలకు అందరికీ అన్నీ చేసుకుంటూ పోతున్నాం’ .
