కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ పూర్తిగా ఆగమైందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. కండ కావరం పట్టిన కాంగ్రెస్ నేతలను చిత్తుగా ఓడించాలన్నారు

  • కాంగ్రెస్ వల్లే తెలంగాణ ఆగమయింది
  • తిక్కరేగి నేను ఆమరణ దీక్ష చేస్తే తెలంగాణ వచ్చింది
  • సూర్యాపేటలో జగదీశ్ రెడ్డిని గెలిపించాలి
  • నదీ జలాలు, అభివృద్ధే ధ్యేయం
  • రౌడీలు చేసే కుతంత్రాలను తిప్పికొట్టాలి
  • సూర్యాపేట ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ పూర్తిగా ఆగమైందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. కండ కావరం పట్టిన కాంగ్రెస్ నేతలను చిత్తుగా ఓడించాలన్నారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలో మంగళవారం ఏర్పాటుచేసిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

ఎన్నికలు వచ్చినప్పుడు ఎవడు పడితే వాడు వచ్చి ఓట్లు అడుగుతారని.. పార్టీలు, అభ్యర్థుల చరిత్ర ఆలోచన చేయాలన్నారు. ఓటు మన తలరాతలు మారుస్తుందన్నారు. ఉద్యమకారుడు, అభివృద్ధి ఎజెండాగా పనిచేసే జగదీష్ రెడ్డిని మరోసారి గెలిపించి అభివృద్ధిని కొనసాగించాలని ఆకాంక్షించారు.

కాళేశ్వరం జలాలు అద్భుతమైన ప్రగతి తెచ్చాయని.. మూసీని బాగు చేసుకున్నమన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా రైతు బంధు పథకం తెచ్చి ధాన్యం కొంటూ రైతు బీమా ఇవ్వడంతో అన్నదాతలు బాగుపడ్డారని తెలిపారు. రైతుబంధు దుబారా అని ఉత్తమ్ రెడ్డి వ్యాఖ్యానించడం విచారకరమన్నారు. వారికి ఓటుతోనే బుద్ధి చెప్పాలని, జగదీష్ రెడ్డి గెలిస్తేనే రైతే బంధు వస్తుందన్నారు.

రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంటు చాలని, 10 హెచ్ పీ మోటార్లు పెట్టుకోవాలని రైతులకు ఉచిత సలహాలు ఇవ్వడం పట్ల కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి ఎత్తేసి భూమాత తెస్తామనడం హాస్యాస్పదమన్నారు. అన్నదాతల హక్కులను కాంగ్రెస్ కాలరాస్తుందని, అప్రమత్తంగా ఉండాలన్నారు. కోమటిరెడ్డి సోదరులకు కండకావరం ఎక్కువైందని, వారికి గుణపాఠం చెప్పాలన్నారు.

తలసరి ఆదాయం పెరిగింది

రాష్ట్రంలో ప్రతిఒక్కరి తలసరి ఆదాయం పెరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. మంచి సురక్షిత నదీ జలాలు అందిస్తున్నామన్నారు. తెలంగాణలో పసిడి సిరులు పండిస్తున్నామని, రైతులు ఆనందంగా ఉన్నారని చెప్పారు. జగదీష్ రెడ్డి 2001 నుండి పట్టు వదలకుండా తెలంగాణ పోరాటం చేసిన గొప్ప ఉద్యమకారుడని కితాబుఇచ్చారు. తిక్క రేగి ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తెలంగాణ వచ్చిందని తెలిపారు. 30 వేల కోట్లతో యాదాద్రి పవర్ ప్లాంట్ నల్గొండలో నిర్మాణం జరుగుతున్నదన్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యవసాయ మోటార్ లకు మీటర్లు పెడితే 25 వేల కోట్లు ఇస్తామంటే, చచ్చిన రైతులకు అన్యాయం చేయమని తెగేసి చెప్పినట్లు పేర్కొన్నారు. సూర్యాపేటలో సద్దలచెరువు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇంటర్నేషనల్ స్థాయిలో నిర్మించామని, ప్రజలందరూ అభివృద్ధిని చూసి మంత్రి జగదీశ్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, సూర్యాపేటలో జగదీశ్ ను గెలిపిస్తే గిరిజన బంధు అమలు చేయడంతో పాటు ఆటోలకు ఫిట్నెస్ చార్జీలు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.

మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ యోధుడు, సాహసి, తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేసి, గమ్యాన్ని ముద్దాడిన నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోని దొంగలు, కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. ఇవ్వాళ సబ్బండ వర్గాలు సంతోషంగా జీవిస్తున్నాయి.. కాళేశ్వరం జలాలతో సూర్యపేట కోనసీమలాగా తయారైందన్నారు.

సూర్యపేటలో డ్రై పోర్ట్, పారిశ్రామిక వాడ, ఐటీ టవర్ రక్షణల నిర్మాణంతో పాటు సూర్యపేటలో టూరిస్ట్ సర్కిల్ కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. సమావేశంలో రాజ్యసభ సభ్యులు లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ, జిల్లా ఇంచార్జి తక్కెళ్లపల్లి రవీందర్ రావు, జడ్పీ చైర్మన్ గుజ్జ దీపికా యుగేందర్ రావు, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, మధుసూదన చారి, చెరుకు సుధాకర్, మున్సిపల్ చైర్మన్ పెరుమల్ల అన్నపూర్ణ, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, శంకరమ్మ, నిమ్మల శ్రీనివాస్, ఒంటెద్దు నరసింహ రెడ్డి, నంద్యాల దయాకర్ పాల్గొన్నారు.

Updated On
Somu

Somu

Next Story