50 ఏండ్ల కాంగ్రెస్‌ పాలనలో ఏనాడు గిరిజనులను పట్టించుకోలేదని డోర్న‌క‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో సీఎం కేసీఆర్ అన్నారు

విధాత‌: 50 ఏండ్ల కాంగ్రెస్‌ పాలనలో ఏనాడు గిరిజనులను పట్టించుకోలేదని డోర్న‌క‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో సీఎం కేసీఆర్ అన్నారు. యాడీన్‌ బాపూన్‌ రామ్‌రామ్‌. కురవి వీరభద్రస్వామి చాలా శక్తి ఉన్న దేవుడు. ఉద్యమం జరిగేటప్పుడు నేను ఇక్కడికి వచ్చి వీరభద్ర స్వామికి మొక్కిన. స్వామి మీ దయవల్ల తెలంగాణ రాష్ట్రం రానీ, నేనొచ్చి మీకు బంగారు మీసాలు సమర్పించుకుంటా అని చెప్పిన. స్వామి దయవల్ల తెలంగాణ వచ్చింది. నేను గూడా మొక్కు చెల్లించుకున్న.

మీ తండాల్లో, గ్రామాల్లో ఎవరికి ఓటు వేయాలనే దానిపై చర్చ పెట్టండి. అభ్యర్థులు ఎలాంటోళ్లు..? ఆ అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీలు ఎలాంటివి అనే చర్చ జరగాలె. ఏ అభ్యర్థి ఏం జేసిండు..? ఏ పార్టీ ఏం జేసింది..? అనే అంశాలు చర్చకు రావాలె. ఈ విధంగా చర్చ జరిగితేనే రాయేదో.. రత్నమేదో ఏర్పడుతది. బీఆర్‌ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ సాధన కోసం. తెలంగాణ ప్రజల హక్కుల రక్షణ కోసం. కాంగ్రెస్‌ 50 ఏండ్ల పాలనలో ఏం జరిగింది..? పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఏం జరిగింది..? అనేది మీరు ఆలోచన చేయాలె. అలా ఆలోచించి ఓటేస్తేనే మంచి ప్రభుత్వం అధికారంలోకి వస్తది.

మేం అధికారంలోకి వచ్చినప్పుడు కరెంటు లేదు. నీళ్లు లేవు. పేరుకే కాలువలు ఉండె తప్ప ఎన్నడూ నీళ్లను కండ్ల జూడలే. డోర్నకల్‌లో అయితే కాలువల్లో చెట్లు మొలిచినయ్‌. ఇయ్యన్నీ ఎట్ల బాగు జెయ్యాలె అని జెప్పి బీహార్‌ నుంచి ఆర్థికవేత్త జీఆర్‌ రెడ్డిని ఇక్కడికి రప్పించుకున్నం. ఆయన మన తెలంగాణ బిడ్డనే. అనేక మంది ఆర్థికవేత్తలతో చర్చించి ఓ మార్గం పట్టినం.

ఇయ్యాల కాలువల్లోకి నీళ్లు వస్తున్నయ్‌. మీ వెన్నవరం కాలువ అయితదని ఎవడూ అనుకోలే. మీ రెడ్యా నాయక్‌, మహబూబ్‌నగర్‌ శంకర్‌ నాయ్‌ నా వెంటబడి పట్టుబట్టి దాన్ని మంచిగ చేసిండ్రు. వెన్నవరం కాలువతోటి ఇయ్యాల డోర్నకల్‌ నియోజకవర్గం మొత్తం బ్రహ్మాండంగా నీళ్లు వస్తున్నయ్‌. ఆ నీళ్లకు మీకు పన్నులు లేవు. కాంగ్రెస్‌, బీజేపీ పాలించే ప్రతి రాష్ట్రంలో నీటి పన్నులు ఉన్నయ్‌. కానీ ఒక్క తెలంగాణలనే నీటి తీరువా లేదు.

మోటార్లు కాలిపోకుండా 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నం. రైతుబంధు ఇస్తున్నం. రైతుల పండించిన పంటను 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి కొంటున్నం. ఇవన్నీ మీ కండ్ల ముందు జరిగినయ్‌. కంటి వెలుగు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మూడు కోట్ల మందికి కంటి పరీక్షలు చేయించి 80 లక్షల మందికి కండ్లద్దాలు పంపిణీ చేసినం. మరె 50 ఏండ్ల కాంగ్రెస్‌ పాలనల ఇలాంటి ఆలోచన చేసిండ్రా..? ఇది మీరు ఆలోచించాలి.

కాంగ్రెస్‌ నాయకులు రైతుబంధు దుబారా అంటున్నరు. రైతుబంధు దుబారనా..? దుబారా కాదు గదా..? ఇక్కడి రెడ్యా నాయక్‌ను గెలిపించండి రైతుబంధును ఎకరానికి రూ.16 వేలు చేస్తం. యుద్ధం చేసేటోని చేతులనే కత్తి పెట్టాలె. కత్తి ఒగని చేతుల పెట్టి యుద్ధం ఒగన్ని చేయమంటే అయితదా..? రైతుబంధు వేస్ట్‌ అనే కాంగ్రెస్‌ గెలిస్తే మనం మునిగిపోతం. కాబట్టి రైతుబంధు ఉండాలంటే రెడ్యా నాయక్‌ గెలువాలె. 24 గంటల కరెంటు వేస్ట్‌ అంటున్నరు.

మూడు గంటలే సాలు అంటున్నరు. మూడు గంటల సరిపోతదా..? మరె కాంగ్రెస్ గెలిస్తే పొలాలు ఎట్ల పారాలె. అందుకే పంట పొలాలు నిండుగ పారాలంటే రెడ్యా నాయక్‌ గెలువాలె. ఇంకేమంటున్నరు 10 హెచ్‌పీ మోటార్ తోటి గంటకు ఎకరం పారుతది అంటున్నరు. మరె 10 హెచ్‌పీ మోటార్‌లు రైతులకాడ ఉన్నయా..? తెలంగాణల ఉన్న 30 లక్షల మోటార్లను 10 హెచ్‌పీకి మార్చాలంటే రూ.30 వేల కోట్లు గావాలె. మరె ఆ రూ.30 వేల కోట్లు ఎవడియ్యాలె..?

ఇంకేమంటరు..? ధరణిని తీసి బంగాళాఖాతంల వేస్తరట. దానికి బదులు భూమాతను తీసుకొస్తరట. ఈ భూమాత దేని కోసం భూమి మేత కోసం. అది భూమాత కాదు.. భూమేత. ధరణితోటి భూముల క్రయవిక్రయాల్లో అక్రమాలకు తెరదించినం. ధరణిని తీసేస్తె మళ్ల ఏమైతది..? మళ్ల లంచాలు ఇచ్చి పనులు చేయించుకోవాల్సి వస్తది. రైతులు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తది. కాబట్టి కాంగ్రెస్‌ను నమ్మితే కైలాసం ఆటల పెద్ద పామును మింగినట్లు అయితది. రైతుబంధు తీసేస్తం అనేటోడు కావాల్నో.. రైతుబంధును రూ.16 వేలకు పెంచుతం అనేటోడు కావాల్నో ప్రజలే నిర్ణయించాలె. దయచేసి ఆగమాగం కావద్దు.

గిరిజన సోదరులున్నరు. లంబాడీలు, ఆదివాసీలు, కోయలు, గోండులు ఉన్నరు. మా తండాల్లో మా రాజ్యం ఉండాలె అని అనేక ఏండ్లు కొట్లాడిండ్రు. కానీ ఎవడన్నా పట్టించుకున్నడా..? ఇయ్యాల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చినంక 3,500 తండాలను, గోండుఉ గూడాలను గ్రామ పంచాయతీలు చేసినం. ఒక్క రెడ్యా నాయక్‌ గారి డోర్నకల్ నియోకవర్గంలో 82 తండాలు గ్రామ పంచాయతీలు అయినయ్‌. వాళ్లను వాళ్లే పాలించుకుంటున్నరు. తండాలు మంచిగయితున్నయ్‌. రెడ్యా నాయక్‌ నాతోటి కొట్లాడి ప్రతి తండాకు బీటీ రోడ్‌ వేయించుకున్నడు.

తండాల్లోని ప్రతి వీధిలో సీసీ రోడ్లు అయినయ్‌. రెడ్యా నాయక్‌ సీనియర్‌ నాయకుడు, మంచి తెలివితేటలు ఉన్న వ్యక్తి, నాకు చాలా సలహాలు ఇచ్చే వ్యక్తి, నియోజకవర్గ క్షేమాన్నే కోరుతడు. నా మాట విని రెడ్యా నాయక్‌ను మళ్లీ గెలిపించండి. ఈసారి ఆయన హోదా పెరుగుతది. మీకు మంచి లాభం జరుగుతది. ఆయనను గెలిపిస్తే మీ నియోజకవర్గంలో పనులన్నీ చేయించే బాధ్యత నాది అని నేను హామీ ఇస్తున్నా. మిమ్మల్ని అందర్నీ చూస్తుంటే నాకో విషయం అర్థమైంది. ఇయ్యాల్నే రెడ్యా నాయక్‌ గెలిచిపోయినట్లు స్పష్టమైంది అని సీఎం వ్యాఖ్యానించారు.

Updated On
Somu

Somu

Next Story